మనవడికి నేడు పట్టాభిషేకం | Anantapur People Happy For YS Jagan Swearing in ceremony | Sakshi
Sakshi News home page

మనవడికి నేడు పట్టాభిషేకం

Published Thu, May 30 2019 12:02 PM | Last Updated on Thu, May 30 2019 12:02 PM

Anantapur People Happy For YS Jagan Swearing in ceremony - Sakshi

అతడే ఒక సైన్యం...అందరి మనస్సులను గెలిచిన ‘అనంత’ మనవడు. ఓదార్పుయాత్రతో జిల్లాలో తొలి అడుగు వేసి...జనంతో మమేకమైన జననేత..ప్రజా సంకల్పయాత్రతో ప్రజల కష్టాలు స్వయంగా తెలుసుకున్న రాజన్న బిడ్డ. నవరత్నాలతో నవశకానికి నాంది పలికిన నేత. అందుకే ఆంధ్ర రాష్ట్రమంతా ఒక్కటై అపూర్వ విజయాన్నందించగా... నేడు విజయవాడలో పట్టాభిషేకం చేసుకుంటున్న జన హృదయ నేత. సొంత జిల్లా వైఎస్సార్‌ కడప అభివృద్ధిపై ఆయనకు ఎంత చిత్తశుద్ధి ఉందో... మనవడిగా ‘అనంత’పై అంతకు మించిన మమకారం ఉంది. ఓదార్పు, రైతు భరోసా, ప్రజా సంకల్ప యాత్రల్లో జిల్లాలోని పల్లె పల్లెకూ వెళ్లారు. ప్రతి గడపా తొక్కారు. జనం బాధలన్నీ విన్నారు. జిల్లా ప్రజలకు ఎంతో దగ్గరయ్యారు. అందుకే ‘అనంత’ జనం ఆయన వెంటే నడిచారు. సార్వత్రిక ఎన్నికల్లో అపూర్వవిజయాన్నందించారు. తమ     కష్టాలన్నీ తీరిపోయాయంటూ సంబరాలు చేసుకుంటున్నారు. మాట తప్పని నైజం జగ        నిజమని.. కరువు సీమలో సిరులు పండించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయంటున్నారు. జిల్లా సమగ్రాభివృద్ధి జగన్‌తోనే సాధ్యమని నమ్ముతున్నారు.   

అనుబంధం ఇలా..
2011 జూన్‌ 20: వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడిగా జిల్లాలో తొలి అడుగు..వైఎస్సార్‌ మృతిని జీర్ణించుకోలేక  గుండెపోటుతో మృతి చెందిన 23 మంది బాధిత కుటుంబాలకు ఓదార్పు.  
2012 ఫిబ్రవరి 12 : చేనేతల సమస్యలపై ధర్మవరంలోని ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల మైదానంలో 48 గంటల నిరాహారదీక్ష. చేనేత కార్మికుల సమస్యలపై ఓ నాయకుడు జిల్లాలో దీక్ష చేయడం ఇదే ప్రథమం.  
2015 ఫిబ్రవరి 22: అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాల కోసం ‘రైతుభరోసాయాత్ర’. 5 విడతల్లో 81 కుటుంబాలకు భరోసా.  రైతు భరోసా ఫిబ్రవరి 22న ప్రారంభం కాగా 21నే రైతు కుటుంబాలకు పరిహారం ఇస్తున్నట్లు జీఓ జారీ చేసిన టీడీపీ సర్కార్‌.  
2016 అక్టోబరు 4:  రైతుల సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్‌ ఎదురుగా ‘రైతుదీక్ష’. రెయిన్‌గన్‌ల పేరుతో ప్రభుత్వం చేసిన డ్రామాను తూర్పారబట్టిన జననేత. ‘అనంత’ను కరువు జిల్లాగా ప్రకటించాలని, రైతులకు ఎకరాకు రూ.20వేలు ఇన్‌పుట్‌సబ్సిడీ ఇవ్వాలని, సాగునీటి ఇబ్బందులు తీర్చాలని డిమాండ్‌.  
2017 అక్టోబరు 10: ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా బళ్లారి రోడ్డులోని ఎంవైఆర్‌ కళ్యాణమండపంలో ‘యువభేరి’ సభ. యువతను చైతన్యపరిచి... ప్రత్యేకహోదా ఆవశ్యకతను వివరించిన జగన్‌మోహన్‌రెడ్డి.
2017 డిసెంబర్‌ 4 : ప్రజాసంకల్ప పాదయాత్రతో జిల్లాలోకి ప్రవేశించిన జగన్‌మోహన్‌రెడ్డి. మొత్తం 9 నియోజకవర్గాల్లోని 15 మండలాల్లో 175 గ్రామాల్లో సాగిన యాత్ర. ప్రజల కష్టాలు, సమస్యలు స్వయంగా చూసిన జననేత. రైతులు, మహిళలు, నిరుద్యోగులు, యువకులు ఇలా అన్ని వర్గాలకు త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుందంటూ భరోసా.   

ఒక్క అడుగు కొన్ని లక్షల జీవితాలకు వెలుగైంది. ఆ ఒక్క అడుగే దోపిడీదారుల పాలిట సింహస్వప్నమైంది. 2009లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి అకాల మరణంతో జిల్లా అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయింది. పదేళ్ల పాటు జిల్లా ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. ఈ పదేళ్లలో ఎటు చూసినా సంక్షోభమే. కష్టాలు.. కన్నీళ్లతో ప్రజలు సహవాసం చేస్తూ వచ్చారు. ఇలాంటి తరుణంలోనే పీడిత ప్రజానీకానికి అండగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిలిచారు. మహానేత మృతిని జీర్ణించుకోలేక గుండెపోటుతో మరణించిన వారి కుటుంబసభ్యలను పరామర్శించేందుకు తొలిసారిగా ‘ఓదార్పు యాత్ర’తో వేసిన అడుగు.. తర్వాతి రోజుల్లో ప్రభంజనమై సాగింది. అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఏపీ రెండో ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు (గురువారం) ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా జిల్లాతో ఆయనకున్న అనుబంధాన్ని మననం చేస్తూ..  

సాక్షిప్రతినిధి, అనంతపురం: దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి  ‘అనంత’కు అల్లుడు. సొంతజిల్లా కడప కంటే ‘అనంత’పైనే ఆయనకు మక్కువ ఎక్కువ. అందుకే ఆయన సీఎంగా గద్దెనెక్కిన తర్వాత ‘అనంత’ సమగ్రాభివృద్ధిపై దృష్టి సారించారు. ‘అనంత’ వెంకటరెడ్డి హంద్రీ–నీవా, హెచ్చెల్సీ ఆధునికీకరణ, చాగళ్లు, పెండేకల్లు లాంటి ప్రాజెక్టులతో సాగునీటి కష్టాలు, శ్రీరామరెడ్డి, జేసీ నాగిరెడ్డి తాగునీటి పథకాలతో తాగునీరు, లేపాక్షినాలెడ్జ్‌హబ్, సైన్సుసిటీ పేరుతో పారిశ్రామిక అభివృద్ధికి బాసటగా నిలవడం, జేఎన్‌టీయూ విశ్వవిద్యాలయాన్ని స్థాపించి ఉన్నత విద్యకు దన్నుగా నిలవడం, పంటలబీమా, ఇన్‌పుట్‌సబ్సిడీ, పశుక్రాంతిలతో రైతుకు అండగా నిలవడం...ఇలా ప్రతీ విభాగంలో కూడా జిల్లా ప్రజలకు వైఎస్‌ అండగా నిలచారు. ఈ క్రమంలో 2009 సెప్టెంబర్‌ 2న ఆయన హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి చెందారు. ఆయన మరణవార్త విని తట్టుకోలేక ‘అనంత’లో 23 మంది గుండెపోటుతో మృతి చెందారు. వీరి కుటుంబసభ్యులను పరామర్శించేందుకు ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పుయాత్ర చేపట్టారు.  ఓదార్పుయాత్ర చేస్తూనే ఆయన వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీని స్థాపించారు.  

చేనేత కార్మికుల సమస్యలపై ‘చేనేత దీక్ష’
చేనేత రంగంపై సర్కారు నిర్లక్ష్యానికి నిరసనగా.. నేతన్నలకు దన్నుగా జగన్‌మోహన్‌రెడ్డి ధర్మవరంలోని ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల మైదానంలో 48 గంటల నిరాహారదీక్ష చేపట్టారు. 2012 ఫిబ్రవరి 12, 13, 14 తేదీలలో ఈ దీక్ష కొనసాగింది. ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికులకు పరిహారం అందించాలని, చేనేతలకు ముడిసరుకులో రాయితీ ఇవ్వాలని 48గంటలపాటు అన్నం మెతుకు ముట్టకుండా దీక్ష చేశారు. చేనేత కార్మికుల సమస్యలపై ఓ నాయకుడు జిల్లాలో దీక్ష చేయడం ఇదే ప్రథమం. ఈ దీక్ష తర్వాత చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయనకు పూర్తి అవగాహన వచ్చేసింది. ప్రజల ఆశీస్సులతో తాను అధికారంలోకి వస్తే వాటిని పరిష్కరించాలని అప్పట్లోనే సంకల్పించారు.  

పాదయాత్ర ద్వారా ప్రజలకు మరింత చేరువ
ప్రజాసంకల్పయాత్ర పేరుతో 2017 డిసెంబర్‌ 4 నుంచి 28 వరకూ 279.4 కిలోమీటర్లు జిల్లాలో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేశారు. గుంతకల్లు నియోజకవర్గంలో మొదలైన ఈ పాదయాత్ర కదిరి నియోజజకవర్గంలో ముగిసింది. మొత్తం 9 నియోజకవర్గాల్లోని 15 మండలాల్లో 175 గ్రామాల్లో యాత్ర సాగింది. పాదయాత్ర జగన్‌మోహన్‌రెడ్డిని ప్రజలకు అత్యంత చేరువ చేసింది. జగన్‌ రాకను ప్రతీ పల్లె ఓ పండుగలా చేసుకుంది. నాలుగేళ్లలో ప్రభుత్వతీరుతో మోసపోయిన వైనం, ప్రజల ఇబ్బందులు, కులవృత్తులు, నిరుద్యోగులు, రైతులు, మహిళలు, యవకులు ఇలా అన్ని వర్గాల ప్రజలు అడుగడుగునా సమస్యలు ఏకరువు పెట్టారు. విదేశీయులు సైతం జగన్‌ పాదయాత్రను చూసేందుకు వచ్చారు. శింగనమల నియోజకవర్గంలో కృష్ణారెడ్డి అనే రైతు ‘సార్‌! నాకు చదువు రాదు. ఫ్లెక్సీలు వేయించలేను. పేపర్లో ప్రకటనలు ఇస్తే ఒకేరోజుతో ఆ జ్ఞాపకం తుడిచిపెట్టుకుపోతుంది. అందుకే ఇత్తడి నాగలి ఇస్తున్నా’ అంటూ భారీ ఇత్తడి నాగలి ఇచ్చారు.

‘డిసెంబర్‌ 23 మధ్యాహ్నం భోజన విరామానికి టెంట్‌లోకి జగన్‌ వెళ్లారు. అప్పటికే శిబిరంలో ఇద్దరు మహిళలు వేచి ఉన్నారు. వారిని చూసి ఏం తల్లి అని జగన్‌ అడిగారు. వెంటనే వారు ‘అన్నా! మాది కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం. మా పేర్లు తిప్పమ్మ, ఆనందమ్మ! కూలీ పనికి వెళుతుంటాం. మీ పాదయాత్రకు ఎంతో కొంత ఇవ్వాలని కూలిలో కొంత దాస్తూ వచ్చాం. ఆ డబ్బు తెచ్చాం. తీసుకో అన్నా. పాదయాత్ర విజయవంతానికి మా వంతు భాగం’ అంటూ చిల్లర మూటను జగన్‌ చేతిలో పెట్టారు. వారి అభిమానానికి చలించిపోయిన జగన్‌ కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి. ఒక్క క్షణం ఏం మాట్లాడాలో తెలీలేదు. రెండు చేతులెత్తి దండం పెట్టారు. ఇలాంటి సంఘటనలు జగన్‌ను కదిలించాయి. తనను ప్రజలు ఏ స్థాయిలో అభిమానిస్తున్నారో, భవిష్యత్‌పై ఎలాంటి నమ్మకం పెట్టకున్నారో జగన్‌కు స్పష్టమైంది.

జగన్‌పైనే నమ్మకం
ఐదేళ్ల కష్టాలు, కన్నీళ్ల తర్వాత జగన్‌ నేడు (గురువారం) ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ క్రమంలో వైఎస్‌ చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయడంలో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయి. హంద్రీ–నీవా, హెచ్చెల్సీ ఆధునికీకరణ పూర్తి చేయాలి. జిల్లాలో 3.50లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలి. తిరిగి లేపాక్షినాలెడ్జ్‌హబ్‌ను తెరపైకి తెచ్చి పరిశ్రమలు రప్పించాలి. తద్వారా నిరుద్యోగ సమస్యను అధిగమించాలి. జిల్లాను సమగ్రాభివృద్ధి బాట పట్టించాలి. ‘అనంత’ కష్టాలను జగన్‌ అతిదగ్గరగా చూడడం వల్ల ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కచ్చితంగా జిల్లా అభివృద్ధి బాట పడుతుందని, రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అనంతకు ప్రత్యేక స్థానమిస్తారని ప్రజలతో పాటు రాజకీయపక్షాలు, మేధావులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.  

వైఎస్సార్‌సీపీ అధినేతగాజిల్లాలో తొలి అడుగు
వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధినేతగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పుయాత్ర పేరుతో ‘అనంత’లో తొలి అడుగుపెట్టారు. 2011 జూన్‌ 20న పులివెందుల–తలుపుల మధ్యలోని నామాలగుండు వద్ద ‘ఓదార్పుయాత్ర’ ప్రారంభించారు. ఈ యాత్రలో 12 రోజుల పాటు సాగింది. వైఎస్‌ మృతిని తట్టుకోలేక మృతిచెందిన 23 కుటుంబాలను పరామర్శించారు. కదిరి నియోజకవర్గంలో ప్రారంభమైన ఈ యాత్ర, శింగనమల నియోజకవర్గం నార్పలలో ముగిసింది. మొత్తం 921 కిలోమీటర్లు ఈ యాత్ర సాగింది. యాత్రలో 79చోట్ల వైఎస్‌ విగ్రహాలను ఆయన ఆవిష్కరించారు. ఈ యాత్రలో పేదింటి గడపలు తొక్కి వారి కష్టాలను ఆయన కళ్లారా చూశారు. కన్నీరు తుడిచారు. వారి ఇళ్లలో ఒక సభ్యుడిలా కలిసి పోయి వారు పెట్టింది తిన్నారు. వైఎస్‌ను ‘అనంత’ వాసులు ఏస్థాయిలో గుండెల్లో పెట్టుకున్నారో జగన్‌కు యాత్రలో అర్థమైంది. అంతకు మించి తనను గుర్తుపెట్టుకోవాలనే ధృడసంకల్పానికి అప్పుడే బీజం పడింది!

చరిత్రలో నిలిచిపోయేలా ‘రైతు భరోసా యాత్ర’
చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2014 జూన్‌ 8 నుంచి రైతుల వరుస ఆత్మహత్యలు ప్రారంభమయ్యాయి.  దీనికి కారణం రుణమాఫీ చేస్తానని చెయ్యకపోవడమే. 2014 సెప్టెంబర్‌ వరకూ చంద్రబాబు ప్రభుత్వం రుణమాఫీ ఊసెత్తలేదు. దీంతో అనంతపురం, కర్నూలుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా రైతులు అప్పుల్లో కూరుకుపోయారని, రుణమాఫీ చేస్తామని చేయకపోవడంతో ఆత్మహత్యలకు తెగిస్తున్నారని అసెంబ్లీలో చంద్రబాబును వైఎస్‌ జగన్‌ నిలదీశారు. వెంటనే రుణమాఫీ చేసి, ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అదే సమయంలో ఎక్కడా, ఏ రైతు ఆత్మహత్య చేసుకోలేదని రైతులను కించపరిచేలా అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు మాట్లాడారు. దీంతో చలించిపోయిన జగన్‌..  ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల ఇళ్లకు తానే స్వయంగా వెళ్లి పరామర్శిస్తానని, ఎందుకు వారు చనిపోయారో ప్రభుత్వానికి చెబుతానని అసెంబ్లీలో గట్టిగా చెప్పారు. 2015 ఫిబ్రవరి 22న ‘రైతుభరోసాయాత్ర’ ప్రారంభించారు. మొత్తం 5 విడతల్లో 32రోజుల పాటు జిల్లాలో పర్యటించి 81 కుటుంబాలకు భరోసా ఇచ్చారు. చనిపోయిన రైతు కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉన్నప్పటికీ, తాను చేయకపోవడంతో ప్రతిపక్షనేతగా వారి కుటుంబాలకు అండగా నిలిచారు. రైతుభరోసాయాత్ర ఫిబ్రవరి 22న ప్రారంభమైతే 21న చనిపోయిన రైతుకుటుంబాలకు పరిహారం ఇస్తున్నట్లు చంద్రబాబు జీవో జారీ చేశారు. ఇందులో కూడా కేవలం కొద్దిమంది పేర్లను మాత్రమే చేర్చారు. భరోసాయాత్రతో రుణమాఫీ పేరుతో ప్రభుత్వం చేసిన మోసం, వ్యవసాయం చేయలేక రైతులు పడుతున్న అవస్థలు, అప్పుల ఊబిలో కూరుకుపోయిన వైనం, కుటుంబాలు ఛిన్నాభిన్నమై వలసపోతున్న తీరును క్షుణ్ణంగా తెలుసుకున్నారు. ఒక పాలకుడు రైతుల సంక్షేమానికి ఎలా కట్టుబడి ఉండాలనేది అప్పుడే ఆయన మనసులో నాటుకుంది. నవరత్నాల్లోని ‘రైతుభరోసా’కు అదే కారణమైంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement