
పిల్లలతో వనజాక్షి
గంజినీళ్లు తాగి బతుకుతున్నాం మాది విడపనకల్లు మండలం హావళిగి. అర ఎకరా మాగాణి ఉండేది. నా భర్త టి. నరసింహులు(32) మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని మిర్చి, పత్తి సాగు చేసినాడు. నాలుగేళ్లుగా పంటలు చేతికందలేదు. బ్యాంకులో రూ.లక్ష.. తెలిసినోళ్ల దగ్గర రూ.6 లక్షలు అప్పు చేసినాడు. పంటలు పండక అప్పులోళ్ల బాధ భరించలేక 2018 జనవరి 22న పురుగుల మందు తాగి పొలంలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. అనారోగ్యంతో మంచాన పడ్డ అత్త, రెండు, ఐదేళ్లు వయస్సున్న పిల్లలు నా మీదే ఆధారపడి బతుకుతున్నారు. రోజూ రెక్కలు ముక్కలు చేసుకుంటే వచ్చేది రూ.250. అందులో వడ్డీకి రూ.150 పోతోంది. గంజినీళ్లు తాగి బతుకుతున్నాం. ప్రభుత్వం నయాపైసా సాయం చేయలేదు.– రైతు టి. నరసింహులు భార్యవనజాక్షి ఆవేదన
సాక్షి ప్రతినిధి, అనంతపురం: వ్యవసాయంలో అనంతపురం జిల్లా మొదటి స్థానంలో ఉందంటే 2014తో పోలిస్తే వ్యవసాయ రంగంలో పురోగతి కనిపించాలి. ఆ రంగానికి ప్రభుత్వం దన్నుగా నిలచి ఉండాలి. జిల్లాలో వ్యవసాయయోగ్యమైన భూమి 11.87 లక్షల హెక్టార్లు. ఇందులో నీటిపారుదల సౌకర్యం ఉన్న భూమి 1.51 లక్షల హెక్టార్లు. ఇందులోనూ బోరు, బావుల కింద నీళ్లందుతున్న భూమే 1.03 లక్షల హెక్టార్లు ఉండటం గమనార్హం. నదీ జలాల రూపంలో హెచ్చెల్సీ కింద ఏటా 32వేల హెక్టార్లకు మాత్రమే సాగునీరు అందుతోంది. జాతీయ జలవనరుల సంఘం నిబంధనల మేరకు ఏ ప్రాంతంలోనైనా సాగుకు యోగ్యమైన భూమిలో కనీసం 30 శాతం భూమికి సాగునీటి సౌకర్యం కల్పించాలి. ఈ అంశంలో పాలకులు దశాబ్దాల తరబడి ‘అనంత’ను నిర్లక్ష్యం చేశారు. ఇక్కడ అధిక శాతం వర్షాధార పంటలే సాగవుతున్నాయి. అలాగే ఇంకొందరు 2.20 లక్షల బోరు బావుల కింద 1.23 లక్షల హెక్టార్లలో పంటలు సాగుచేస్తున్నారు. వర్షాభావంతో భూగర్భజలాలు అడుగంటిపోతుండటంతో ఏటా సగటున 54వేల బోరు బావులు ఎండిపోతున్నాయి. పంటలను కాపాడుకునేందుకు ఏటా 80వేల బోర్లను అదనంగా తవ్వి పాతళగంగ అందక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.
నాలుగన్నరేళ్లలో మీ ఘనత ఇదేనా ‘బాబూ’
చంద్రబాబు 2014లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ నాలుగున్నరేళ్లలో జిల్లాలోని బీడు భూముల్లో కొత్తగా ఒక్క ఎకరానూ సాగులోకి తీసుకురాలేదు. పోనీ వర్షాధారంపై సాగు చేసే భూములకైనా సాగునీరు ఇచ్చారా? అంటే ఒక్క ఎకరా ఆయకట్టుకూ నీళ్లివ్వలేదు. హంద్రీ–నీవా ద్వారా 2012 నుంచి కృష్ణాజలాలు వస్తున్నాయి. 2014 నుంచి ఏటా సగటున 25–28 టీఎంసీలు వస్తున్నాయి. అంటే దాదాపు వంద టీఎంసీలు ఈ నాలుగున్నరేళ్లలో వచ్చాయి. ఈ నీళ్లను కూడా పొలాలకు పారించలేకపోయారు. అంటే సాగునీటి కల్పనలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఫేజ్–1లో 1.18లక్షల ఎకరాలకు, ఫేజ్–2లో 2. 27లక్షలు కలిపి 3.45లక్షల ఎకరాలకు హంద్రీనీవా ద్వారా నీరందించాలి. ఇప్పటి వరకూ డిస్ట్రిబ్యూటరీలు కూడా పూర్తి చేయని పరిస్థితి. పైగా డిస్ట్రిబ్యూటరీలు చేయొద్దని 2015 ఫిబ్రవరి 23న జీఓ 22 జారీ చేయడం గమనార్హం. దీన్నిబట్టే 12 ఎమ్మెల్యే, 2 ఎంపీ, 10 మునిసిపాలిటీలలో టీడీపీ అభ్యర్థులను గెలిపించిన చంద్రబాబు ఈ జిల్లాపై ఏస్థాయిలో విద్వేషం చూపించారో అర్థమవుతోంది.
కరువు మండలాలనుప్రకటిస్తూనే..
2014 నుంచి 2018 వరకూ 2017 మినహా తక్కిన నాలుగేళ్లలో జిల్లాలోని 63 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. అంటే జిల్లా పూర్తిగా దుర్భిక్షంలో ఉందని ప్రభుత్వమే అంగీకరించినట్లు లెక్క. కరువు వచ్చినప్పుడైనా మానవీయ కోణంలో ఆలోచించి జిల్లా రైతాంగాన్ని ఆదుకున్నారా? అంటే అదీ లేదు. 2014, 2016లో మాత్రమే ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చారు. తక్కిన రెండేళ్లూ చేయిచ్చారు. చివరకు దేశంలోనే వేరుశనగ అధికంగా సాగు చేసే ఈ జిల్లాలో కనీసం వేరుశనగ విత్తనాలను కూడా సరిగా పంపిణీ చేయలేని పరిస్థితి. వైఎస్ హయాంలో 5లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను ఏటా పంపిణీ చేస్తే ఈ ఏడాది 2.10లక్షల క్వింటాళ్లు మాత్రమే పంపిణీ చేయడం గమనార్హం. ఒక్కమాటలో చెప్పాలంటే 2013లో 18.925లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగయితే, ఈ ఏడాది 11.6లక్షల ఎకరాల్లో మాత్రమే సాగైంది. అంటే నాలుగన్నరేళ్లలో 7.325లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం తగ్గింది.
కరువు సీమలో ఆత్మహత్యల సాగు
2014 జూన్ 8 నుంచి ఇప్పటి వరకూ చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 242 మంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. వ్యవసాయంలో జిల్లా నెంబర్–1గా ఉంటే ఇంత మంది ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో చంద్రబాబుకే తెలియాలి. రైతు కుటుంబంలో అప్పులబాధ తాళలేక చేసుకున్న ఎలాంటి ఆత్మహత్య అయినా రైతు ఆత్మహత్య అవుతుందని, వారికి పరిహారం ఇవ్వాలని 421 జీఓను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జారీ చేశారు. కానీ 242 మందిలో కనీసం 25 శాతం కుటుంబాలకీ చంద్రబాబు ప్రభుత్వం పరిహారం ఇవ్వలేకపోయింది.
ఉద్యాన పంటల క్రెడిట్ తన ఖాతాలోకే..
ఉద్యానపంటల సాగులో 2009లోనే అనంతపురం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. కానీ ఇప్పడేదో తాను హార్టికల్చర్‌ను అభివృద్ధి చేశాననే స్థాయిలో చంద్రబాబు గొప్పులు చెబుతున్నారు. 2014లో 1.35లక్షల హెక్టార్లలో ఉద్యానపంటలు సాగైతే, ఇప్పుడు 1.80లక్షల హెక్టార్లలో సాగవుతున్నాయి. వేరుశనగ సాగు చేయలేని రైతులు కొందరు ఈ పంటలు సాగు చేస్తున్నారు. అంతే తప్ప వ్యవసాయ అభివృద్ధికి, ఉద్యానపంటల అభివృద్ధికి ప్రభుత్వం కొత్తగా చేసిందేమీ లేదు.
జిల్లా అగ్రస్థానంలో ఉందనడం హాస్యాస్పదం
జిల్లాలో తీవ్ర కరువు కారణంగా రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే, ఉపాధి కరువై లక్షల్లో జనం వలస పోతుంటే, వ్యవసాయంలో జిల్లా అగ్రస్థానంలో ఉందని ముఖ్యమంత్రి పేర్కొనడం హాస్యాస్పదం. జిల్లాలో తీవ్ర వర్షాభావం నెలకొంది. నీరు లేక పండ్ల తోటలు ఎండిపోతుంటే రైతుల బతుకు బుగ్గి అవుతోంది. వాస్తవాలు గుర్తించి రైతులను ఆదుకోవాల్సింది పోయి తప్పుడు ప్రకటన చేయడం సరైంది కాదు.
– డి.జగదీశ్, సీపీఐ జిల్లా కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment