గుడ్లవల్లేరు, న్యూస్‌లైన్ : ఇప్పటి వరకూ ఆదాయం, కులం, మరణం ధృవీకరణ వంటి పత్రాల జారీ తదితర 157 రకాల సేవలు అందిస్తున్న ‘మీ-సేవ’ కేంద్రలకు ప్రభుత్వం ఆధార్ గుర్తింపు కార్డుల జారీ బాధ్యత కూడా అప్పగించింది. ఈ మేరకు జిల్లాలోని కొన్ని ‘మీ - సేవ’ కేంద్రాలకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఆధార్ కార్డులు జారీ చేసేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, యంత్రపరికరాలు కూడా ఆయా కేంద్రాలకు దిగుమతయ్యాయి. ప్రజలకు అవసరమైన సేవలను సత్వరం, సక్రమంగా అందించడాన్ని ప్రాతిపదికగా తీసుకుని మండలానికి ఒక మీ-సేవ కేంద్రంలో ఆధార్ బాధ్యతలు అప్పగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అన్ని మండలాలతో పాటు పట్టణ ప్రాంతాల్లోనూ కొన్ని మీ-సేవ కేంద్రాలకు ఈ బాధ్యత అప్పగించారు.
వెనుకాడుతున్న మీ-సేవ కేంద్రాల నిర్వాహకులు
అందరికీ ఆధార్ కార్డు అందించాలన్న లక్ష్యంతో మీ-సేవ కేంద్రాలకు బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం కొన్ని నిబంధనలను భారంగా మారేలాచేసింది. ఆధార్ కేంద్రం నిర్వహించేందుకు లక్షల రూపాయల్లో డిపాజిట్ చెల్లించాల్సి ఉంది. దీంతో మీ- సేవ కేంద్రాల నిర్వాహకులు వెనుకాడుతున్నారు. ఇప్పటికే కొన్ని సెంటర్లకు ఒక్కొక్కసారి ఆరు నెలలకుగానీ కమీషన్లు ఇవ్వడం లేదు.
దీంతో ఆధార్ బాధ్యతలపై వెనుకాడుతున్నారు. కమీషన్లను సమయానికి జిల్లాలోని లక్ష్యాన్ని బట్టి ఆధార్ కార్డుకు అయ్యే ఒక్కో బిల్లులో వచ్చే కమీషను సమయానికి ఇవ్వడంతోపాటు, డిపాజిట్ మొత్తాన్ని తగ్గించాలని మీ-సేవ కేంద్రాల నిర్వాహకులు కోరుతున్నారు.
లక్షల మందికి ఆధార్ అందలేదు
జిల్లాలో ఇప్పటికీ ఆధార్‌కార్డు అందని వారు లక్షల్లోనే ఉన్నారని అధికారిక లెక్కలు స్పష్టంచేస్తున్నాయి. జిల్లాలో 45,17,398 మంది జనాభా ఉన్నారు. వీరికి ఆధార్ వివరాలు నమోదుచేసేం దుకు పలు ప్రాంతాల్లో కేంద్రాలు పనిచేస్తున్నాయి. అయితే వాటివద్దకు వెళ్లేందుకు ప్రజలు విముఖత చూపుతున్నారు. ఇప్పటికే వివరాలు సమర్పించినా కార్డులు అందని వారు కూడా అధికంగానే ఉన్నారు.
మండలంలో ఒక మీ-సేవ కేంద్రానికి బాధ్యత
జిల్లాలో ప్రతి మండలానికి ఒక మీ-సేవ కేంద్రానికి ఆధార్ బాధ్యతలు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే అందిన ఆధార్ కార్డుల్లో చేర్పులు మార్పులు కూడా ఈ కేంద్రాల్లోనే చేయించుకోవచ్చు. జిల్లాలో 96 శాతం జనాభా వివరాలను ఆధార్ కేంద్రాల్లో నమోదు చేశారు.
- సంధ్యారాణి, డీఎస్‌వో