ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)
విజయవాడ స్పోర్ట్స్ : ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. చెన్నైలో సోమవారం జరిగిన బీసీసీఐ సర్వసభ్య సమావేశంలో 2017 వరకు బీసీసీఐ కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సౌత్‌జోన్ నుంచి గంగరాజు ఒక్కరే పోటీ చేసి ఏకగ్రీవంగా ఎన్నికవడం విశేషం.అంచెలంచెలుగా ఎదుగుతూ.. విద్యార్థి దశలోనే యూనివర్సిటీ స్థాయి క్రికెటర్‌గా రాణించిన గంగరాజు పారిశ్రామికవేత్తగా రాణిస్తూనే కృష్ణా జిల్లా క్రికెట్ అసోసియేషన్ (కేడీసీఏ) ఉపాధ్యక్షునిగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.
2007 వరకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షునిగా వ్యవహరించారు. 2007-08లో ఏసీఏ ఉపాధ్యక్షునిగా, 2008 జూన్‌లో అధ్యక్షునిగా, 2009 జూన్‌లో ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 2011లో జరిగిన ఏసీఏ ఎన్నికల్లో పూర్తి మెజారిటీ సాధించి తిరుగులేని క్రికెట్ అడ్మినిస్ట్రేటర్‌గా నిలిచారు. 2014లో బీజేపీ తరఫున పోటీచేసి నర్సాపురం ఎంపీగా గెలిచారు. 2011లో ఏసీఏ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాక మాజీ టెస్ట్ క్రికెటర్ ఎంఎస్‌కే ప్రసాద్‌తో కలిసి ఆంధ్రలో క్రికెట్ అభివృద్ధికి కృషి చేశారు. దాదాపు అన్ని ఏజ్ గ్రూపుల్లో ఆంధ్రను సౌత్‌జోన్‌లో చాంపియన్‌గా నిలిపారు. మహిళా క్రికెట్‌ను ప్రోత్సహించారు. క్రీడాకారులకు ప్రోత్సాహం.. కోట్లాది రూపాయల నిధులు తెచ్చి వర్ధమాన క్రికెటర్లకు విద్య, వసతి, ఉపకార వేతనాలందేలా చూశారు గంగరాజు. క్రికెటేతర క్రీడలను ప్రోత్సహించారు.