రాజధానులిక అందరివీ.. | Andhra Pradesh Assembly Passed Resolution For Development Of 3 Regions | Sakshi
Sakshi News home page

వికేంద్రీకరణకు కేబినెట్‌ ఆమోదం

Published Tue, Jan 21 2020 4:33 AM | Last Updated on Tue, Jan 21 2020 2:24 PM

Andhra Pradesh Assembly Passed Resolution For Development Of 3 Regions - Sakshi

రాష్ట్ర శాసనసభ సరికొత్త చరిత్రకు వేదికైంది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు సమాన ప్రాతినిధ్యం కల్పిస్తూ సీఎం వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులను సోమవారం సభ ఆమోదించింది. అభివృద్ధి అన్నది ఒకే చోట కేంద్రీకృతం కారాదని.. అభివృద్ధి ఫలాలు అన్ని ప్రాంతాలకు సమానంగా విస్తరించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను సంపూర్ణంగా సమర్థించింది. అమరావతి ప్రాంతాన్ని కీలకమైన శాసన రాజధానిగా నిర్ణయించింది. ఇక సహజ వనరులతో సహజ సిద్ధంగా అభివృద్ధి చెందిన తీర ప్రాంత నగరం విశాఖపట్నం పరిపాలన రాజధానిగా, వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి తగిన ప్రాతినిధ్యం కల్పిస్తూ హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేసేందుకు ఆమోదించింది. తద్వారా మూడు కీలక వ్యవస్థలను రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో నెలకొల్పుతూ ప్రాంతీయ సమగ్రాభివృద్ధికి, రాష్ట్ర పురోభివృద్ధికి అడుగులు ముందుకు వేసింది. అమరావతిలో భూములు ఇచ్చిన రైతులు, రైతు కూలీలపై పలు వరాలు కురిపించడం ద్వారా తాను మనసున్న ముఖ్యమంత్రినని వైఎస్‌ జగన్‌ మరోమారు నిరూపించుకున్నారు. 

రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి దిశగా మేలి మలుపు.. ప్రాంతీయ వివక్షకు చరమగీతం.. సమానాభివృద్ధికి తెరతీస్తూ నూతన అధ్యాయం..ఇటు పాలన, అటు అభివృద్ధి వికేంద్రీకరణకు శాసనసభ ఆమోద ముద్ర వేసింది. శాసన రాజధానిగా అమరావతి, పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు.. ఇలా మూడు ప్రాంతాల ప్రజల కలను సాకారం చేసే దిశగా రాష్ట్రం పెద్ద ముందడుగు వేసింది. తద్వారా రాష్ట్ర ప్రజల 67 ఏళ్ల ఆకాంక్ష నెరవేరింది. పరిపాలన వ్యవస్థలోనూ తద్వారా అభివృద్ధిలోనూ రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు సమాన ప్రాతినిధ్యం కల్పిస్తూ సరికొత్త ప్రగతి చరిత్రకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

నాకు అన్ని ప్రాంతాలూ సమానమే. ఇదే కృష్ణా జిల్లాతో నాకు మంచి అనుబంధం ఉంది. స్వయానా మా మేనత్తను ఇదే జిల్లాకు ఇచ్చాం. ఇక్కడి (విజయవాడ) రాజ్, యువరాజ్‌ థియేటర్ల ద్వారా నాలుగు దశాబ్దాలుగా అనుబంధం కలిగి ఉన్నాం.  

శాసన రాజధానిలో..
ఏఎంఆర్‌డీఏ పరిధిలోని శాసనపరమైన రాజధాని అమరావతిలో శాసనసభ, శాసన మండలి ఉంటాయి. 

పరిపాలనా రాజధానిలో..
పరిపాలనా రాజధాని విశాఖపట్నంలో రాజ్‌భవన్, సచివాలయం, ప్రభుత్వ శాఖల శాఖాధిపతుల కార్యాలయాలు ఉంటాయి.  

జ్యుడీషియల్‌ రాజధానిలో..
హైకోర్టు ప్రధాన కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర న్యాయ సంబంధమైన సంస్థలు కర్నూలులోనే ఉంటాయి.

సాక్షి, అమరావతి:  రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్ర, సమ్మిళిత అభివృద్ధికి బాటలు వేసేందుకు వీలుగా పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణకు సంబంధించి రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పాలనాపరమైన మూడు రాజధానుల ఏర్పాటుతోపాటు ప్రాంతీయ ప్రణాళిక అభివృద్ధి బోర్డులు నెలకొల్పేందుకు ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అమరావతి మెట్రోపాలిటన్‌ అభివృద్ధి ప్రాంతంగా పిలువబడే అమరావతిని శాసన రాజధానిగా, విశాఖపట్నం మెట్రోపాలిటన్‌ అభివృద్ధి ప్రాంతంగా పిలువబడే విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా, కర్నూలు పట్టణాభివృద్ధి ప్రాంతంగా పిలువబడే కర్నూలును న్యాయపరమైన రాజధానిగా ఏర్పాటు చేసేందుకు, అలాగే ప్రాంతీయ ప్రణాళిక అభివృద్ధి బోర్డులు ఏర్పాటు చేసేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తున్నది.
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ మీటింగ్‌కు హాజరైన మంత్రులు, అధికారులు 

అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌ కేపిటల్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(ఏపీసీఆర్‌డీఏ)ను రద్దు చేస్తూ.. దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(ఏఎంఆర్‌డీఏ)ని ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన మరో ముసాయిదా బిల్లుకు సైతం ఆమోదముద్ర వేసింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం ఉదయం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. శివరామకృష్ణన్‌ కమిటీతోపాటు, ఇటీవల జీఎన్‌ రావు కమిటీ, బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌.. ఇచ్చిన నివేదికలపై అధ్యయనం చేసిన హైపవర్‌ కమిటీ పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణకు సంబంధించి తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికపై కేబినెట్‌ సమావేశంలో చర్చించి ఆమోదం తెలిపారు.

అమరావతి ప్రాంత రైతు కూలీలు, రైతులకు దన్ను.. 
అమరావతి రాజధానిలో భూములిచ్చిన రైతులకు కౌలును, రైతు కూలీలకు ఇచ్చే పెన్షన్‌ కాల వ్యవధిని అదనంగా ఐదేళ్లపాటు పెంచేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏపీసీఆర్‌డీఏ చట్టాన్ని రద్దు చేస్తూ దాని స్థానంలో ఏఎంఆర్‌డీఏను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ముసాయిదా బిల్లు ఇందుకు వీలు కల్పిస్తున్నది. రైతు కూలీలకిచ్చే నెల పెన్షన్‌ను రూ.2,500 నుంచి రూ.5 వేలకు పెంచేందుకు, అలాగే పెన్షన్‌ను గత ప్రభుత్వం పదేళ్లపాటు ఇవ్వాలని నిర్ణయించగా.. ఇప్పుడు అదనంగా మరో ఐదేళ్లపాటు ఇవ్వాలని ఈ బిల్లులో స్పష్టం చేశారు. రైతులకిచ్చే కౌలును గత ప్రభుత్వం పదేళ్లపాటు ఇవ్వాలని నిర్ణయిస్తే ఇప్పుడు అదనంగా మరో ఐదేళ్లపాటు ఇవ్వాలని నిర్ణయించారు.

11,159 రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు
- రైతులకు వ్యవసాయంలో అవసరమైన అన్నిరకాల సహాయ సహకారాలు అందించేందుకు, అలాగే నాణ్యమైన ఎరువులు, విత్తనాలతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు గ్రామ సచివాలయాల వద్దే రూ.199.44 కోట్ల వ్యయంతో 11,159 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ రైతు భరోసా కేంద్రాలు ఏప్రిల్‌ నుంచి పూర్తి స్థాయిలో పనిచేయాలని నిర్దేశించింది.
పులివెందుల డెవలప్‌మెంట్‌ అథారిటీకి పోస్టులను మంజూరు చేస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది.

హైపవర్‌ కమిటీ నివేదికలోని అంశాలివీ..  
- విభజిత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని మూడు ప్రాంతాలూ వేర్వేరు సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, అభివృద్ధి ప్రమాణాలను కలిగి ఉన్నాయి.
- ప్రాంతీయ అసమానతలు, సమానాభివృద్ధి లేకపోవడం రాష్ట్రంలో అశాంతికి దారితీశాయి. రాష్ట్రంలోని వివిధ వర్గాల మధ్య సమాన అభివృద్ధిని కోల్పోయామన్న తీవ్ర భావనను కలిగించాయి.
వివిధ ప్రాంతాల్లోని ప్రజలు సామాజిక, ఆర్థిక, ప్రగతి ఫలాలను సమానంగా అనుభవించేలా చూడటానికిగాను అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణపై శ్రద్ధ వహించాల్సిన అవసరముంది.
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ఆకాంక్షలను గౌరవిస్తూ.. చరిత్రాత్మక నిబద్ధతలు, ప్రాంతీయ ఆకాంక్షలను సమతుల్యం చేయాల్సిన ఆవశ్యకత ఎంతయినా ఉంది.
పరిమిత ఆర్థిక వనరులు, ద్రవ్యసాధనాలను దృష్టిలో ఉంచుకుని 217 చదరపు కిలోమీటర్ల ఒక చిన్న ప్రాంతానికి అన్ని వనరుల్ని ఉపయోగించడం  వాంఛనీయం కాదు. ఇది వెనుకబడిన ప్రాంతాల వారికి ఏమాత్రం అభిలషణీయమూ కాదు. అభివృద్ధితోపాటు వికేంద్రీకరణ సిద్ధాంతానికి ఇది అసలు పొసగదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement