సంక్షేమ పథకాలు వదిలేద్దామా! | CM YS Jagan Explained Welfare Schemes At AP Assembly Special Session | Sakshi
Sakshi News home page

సంక్షేమ పథకాలు వదిలేద్దామా!

Published Tue, Jan 21 2020 8:49 AM | Last Updated on Tue, Jan 21 2020 9:06 AM

CM YS Jagan Explained Welfare Schemes At AP Assembly Special Session - Sakshi

స్కూళ్లు, ఆసుపత్రుల పరిస్థితి బాగోలేదు. బాత్‌రూములు, కాంపౌండ్‌ వాల్స్‌ లేవు. బిల్డింగ్‌లు కూలిపోతున్నాయి. ఆసుపత్రులలో జనరేటర్లు లేక సెల్‌ఫోన్‌ లైట్ల వెలుగులో ఆపరేషన్లు చేస్తున్నారన్న వార్తలు చూశాం. ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఉన్న ఆసుపత్రులలో, స్కూళ్లలో మార్పు చేయాలని తలపెట్టిన నాడు–నేడు కార్యక్రమాన్ని కొనసాగిద్దామా? వద్దా?  

దాదాపు 50 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. దాదాపుగా 46 లక్షల మందికి రైతు భరోసా  కార్యక్రమంతో తోడుగా ఉన్నాం. దాదాపు 43 లక్షల మంది తల్లులకు అమ్మ ఒడి పథకం కింద ఒక్కొక్కరికి ఏటా రూ.15 వేలు ఇస్తూ పిల్లలను బడిబాట పట్టించేలా చేశాం. భవిష్యత్‌లో ఇవన్నీ కొనసాగించాలా? వద్దా? 

సాక్షి, అమరావతి:  రాష్ట్రం ఏర్పడిన 2014 వరకు ఉన్న రూ.96 వేల కోట్ల అప్పు.. బాబుగారి దోపిడీ పుణ్యమా అని 2019 నాటికి మరో లక్షా 50 వేల కోట్లకు పైగా పెరిగిందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఈ లెక్కన 2 లక్షల 57 వేల కోట్ల రూపాయల అప్పుతో తమ చేతికి పాలన వచ్చిందని చెప్పారు. ఇవి కాక కార్పొరేషన్ల పేరుతో ఆయన చేసిన అప్పులు మరో 57 వేల కోట్లున్నాయని, ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు రూ.39,423 కోట్లున్నాయని చెప్పారు. సోమవారం ఆయన అసెంబ్లీలో పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణకు సంబంధించిన బిల్లుపై చర్చలో మాట్లాడారు. 2014 మార్చి నాటికి విద్యుత్‌ పంపిణీ సంస్థలు ఉత్పత్తి సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలు రూ.2,893 కోట్లు ఉంటే, 2019 మార్చి నాటికి విద్యుత్‌ డిస్కమ్‌లు చెల్లించాల్సిన బకాయిలు రూ.21,540 కోట్లున్నా, తామే భరిస్తూ ప్రజలను సంతోష పెడుతున్నామని చెప్పారు. 

‘కిందా మీద పడి రాజధాని కోసం లక్ష కోట్లు తెచ్చినా మనం దేన్ని పణంగా పెట్టాలని ఆలోచించుకోవాలి. కృష్ణా నది పరిస్థితి చూస్తున్నాం. అక్కడ నానాటికీ దయనీయమైన స్థితి. 40 ఏళ్ల సీడబ్ల్యూసీ లెక్కల ప్రకారం శ్రీశైలంలోకి వచ్చే నీళ్లు 1200 టీఎంసీలు, గత పదేళ్లుగా అది 600 టీఎంసీలకు పడిపోయింది. గత ఐదేళ్లలో అయితే 400 టీఎంసీలకు తగ్గాయి. కృష్ణా మీద 8 జిల్లాల సాగు, తాగు నీరు కోసం ఆధారపడ్డాయి. ఏటా 3 వేల టీఎంసీల గోదావరి నీరు సముద్రంలో కలుస్తోంది. వీటిని కృష్ణాలోకి తీసుకొస్తేనే నీరు అందించగలం. గోదావరి నుంచి బనకచర్ల వరకు నీరు తేవాలంటే ఇంజనీర్లు అంచనాలు తయారు చేయమంటే, రూ.68 వేల కోట్లు కావాలని లెక్కతేల్చారు. దీన్ని ఎలా తగ్గించాలని తెలంగాణ వాళ్ళతో కూడా మాట్లాడాం. ప్రతీ పైసా మిగిల్చాలని కిందా మీద పడుతున్న పరిస్థితి ఉంది. ఇంత భారీ ప్రాజెక్టును చేద్దామా? వద్దా అని నేను ఈ సభలో అడుగుతున్నాను’ అని సీఎం అన్నారు. ఇంకా ఏమన్నారంటే.. 

సాగు నీటి ప్రాజెక్టుల సంగతేంటి? 
వెనకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలకు ఊపిరి పోసే ప్రాజెక్టు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి. పోలవరం ఎడమ కాల్వ నుంచి నీటిని తరలించే ఈ ప్రాజెక్టుకు రూ.16 వేల కోట్లు ఖర్చవుతుంది. ఇది వస్తే ఉత్తరాంధ్ర వెనుకబాటు తనం పోయి రైతులకు నీళ్లు వస్తాయి. ఈ ప్రాజెక్టు చేద్దామా? వద్దా? రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో ప్రాజెక్టుల పరిస్థితి మీరే చూస్తున్నారు. సమృద్ధిగా నీళ్లు వచ్చినా ప్రాజెక్టులు నింపుకోలేని పరిస్థితి. ఆర్‌ ఆండ్‌ ఆర్‌ ప్యాకేజీలు ఇవ్వని స్థితి. కరవు నివారణ కోసం కాల్వల సామర్థ్యం పెంచేందుకు రూ. 25 వేల కోట్లు ఖర్చవుతుంది. ఇది చెయ్యడం సాధ్యం కాదని చెప్పే మనసు ఎలా ఉంటుంది? జలయజ్ఞం ద్వారా రైతాంగానికి మేలు చెయ్యాలని నాన్నగారు తలంచారు. చంద్రబాబు జమానా కూడా అయిపోయింది. వాటిని పూర్తి చేయడానికి ఎంత ఖర్చవుతుందని ఇంజనీర్లను అడిగితే.. రూ.30 వేల కోట్లు అవుతుందని చెప్పారు. 62 శాతం ప్రజలు వ్యవసాయంపై బతుకుతున్నారు.  

రైతులకు శాశ్వతంగా ఉచిత విద్యుత్‌ ఇవ్వాలంటే ట్రాన్స్‌కోకు ప్రభుత్వం ఎంతివ్వాలని లెక్కలేస్తే.. ఏటా రూ.8 వేల కోట్లు ఇవ్వాలి. గతంలో చంద్రబాబు ఏనాడూ కూడా రూ.1200 కోట్లు...రూ.1500 కోట్లు మించి ఇవ్వలేదు. దీంతో ఆ సంస్థలు బయట నుంచి అప్పులు తెచ్చాయి. ఇదే పరిస్థితి కొనసాగితే రైతులకు ఉచిత విద్యుత్‌ ఇవ్వడానికి తర్వాత ప్రభుత్వాలు చేతులెత్తే పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితి రాకూడదని, రైతులకు శాశ్వతంగా ఉచిత విద్యుత్‌ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఆలోచిస్తే 10 వేల మెగా వాట్ల సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్‌ రాష్ట్ర ప్రభుత్వమే కట్టాలనే సలహా వచ్చింది. దీని కోసం రూ.36 వేల కోట్లు ఖర్చవుతుందని అధికారులు చెప్పారు. ఇది ఖర్చు పెడితే ఏడాదికి ట్రాన్స్‌కోకు ఇచ్చే రూ.8 వేల కోట్లు సబ్సిడీ భారాన్ని తగ్గించుకోవచ్చనే ఆశ.  

అన్ని జిల్లాల్లోనూ మౌలిక వసతులు కల్పించాలి.. 
గుంటూరు, విజయవాడ, తెనాలి, మంగళగిరి, నూజివీడు, నందిగామ, మైలవరం, చివరకు నా ఇల్లున్న తాడేపల్లి ఇవన్నీ ఒక్కోదానికి రూ.500 కోట్లు ఇస్తే చాలు అభివృద్ధి సాధిస్తాయి. తాడేపల్లి, మంగళగిరి మోడల్‌ మున్సిపాల్టీలుగా చేయాలని అంచనాలు వేయిస్తే కేవలం రూ.1100 కోట్లు పెడితే బ్రహ్మాండమైన అభివృద్ధి సాధించి మోడల్‌ సిటీలుగా మారతాయి. కృష్ణకు వరదలు వస్తే విజయవాడలోని కృష్ణలంక ముంపునకు గురవుతుంది. రిటైనింగ్‌ వాల్‌ కట్టాలి. కానీ అయిదేళ్లు చంద్రబాబు సీఎంగా ఉన్నా కట్టలేదు. నాకంతట నాకే బాధ అనిపించింది. వెంటేనే రిటైన్‌ వాల్‌ నిర్మాణానికి నిధులు మంజూరు చేశాం. పల్నాడుకు తాగు, సాగునీరు లేదు. వాటిని కల్పించడానికి, మెడికల్‌ ఆసుపత్రిని, మచిలీపట్నంలో పోర్టు మెడికల్‌ కాలేజీ, ప్రకాశం బ్యారేజీ దిగువన రెండు బ్యారేజీలు, ఎగువన వైకుంఠాపురంలో మరో బ్యారేజీ కట్టాల్సిన అవసరం కూడా ఉంది. సముద్రంలోకి నీరు వృధాగా పోకుండా వీటి ద్వారా స్టోరేజీ కెపాసిటీ పెరగడమే కాకుండా మచిలీపట్నం పరిధిలోని ఆరు నియోజకవర్గాలకు కూడా తాగు, సాగునీరు అందుతుంది. ప్రతి జిల్లాలోనూ ఇలాంటివి ఉన్నాయి. విజయనగరం జిల్లాలో మెడికల్‌ కాలేజీ లేదు. గిరిజన ప్రాంతంలో ట్రైబల్‌ యూనివర్సిటీ, ట్రైబల్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ, ట్రైబల్‌ మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రతి చోటా కనీస అవసరాలు తీర్చే కార్యక్రమాలు చేపట్టాలంటే మనదగ్గరున్న వనరులు, డబ్బులు ఏ మేరకు ఉన్నాయి?  

పాఠశాలల సంగతేంటి? 
► పాఠశాలల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని రూ.12 వేల కోట్లు, ఆసుపత్రులను బాగు చేయడానికి అక్షరాలా రూ.14 వేల కోట్ల అంచనాలతో పనులు చేపట్టనున్నాం. ఈ రెండు కార్యక్రమాలకు రూ.26 వేల కోట్లు ఖర్చు చేద్దామా వద్దా? 

► వాటర్‌ గ్రిడ్‌లో భాగంగా తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, శ్రీకాకుళంలోని పలాస ప్రాంతం, పల్నాడు ప్రాంతం, ప్రకాశం జిల్లాలోని కిడ్నీ ప్రభావిత ప్రాంతాలకు రిజర్వాయర్ల దగ్గరనే వాటర్‌ను ఫిల్టర్‌చేసి పైపుల ద్వారా గ్రామాలకు మంచినీటిని అందిస్తాం. ఈ జిల్లాలకు రూ.12 వేల కోట్లతో మంచినీటిని అందించడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమమే చేయాలంటే అక్షరాలా రూ.45 వేల కోట్లు అంచనా అవుతుంది. ఇలాంటివి చేయాలా? వద్దా? 

► భావనపాడు, మచిలీపట్నం, ప్రకాశం జిల్లాలోని రామాయపట్నం.. పోర్టులను కట్టడానికి రూ.15 వేల కోట్లు ఖర్చు చేద్దామా.. వద్దా? 

► ఉగాది నాటికి పేదలకు 25 లక్షల ఇళ్ల స్థలాలు శాచ్యురేషన్‌ పద్ధతిలో ఇస్తాం. నాలుగేళ్లలో ఏటా 6 లక్షల ఇళ్లు చొప్పున వారికి కట్టించి ఇవ్వాలంటే దాదాపుగా ఏడాదికి రూ.10 వేల కోట్లు.. నాలుగేళ్లకు రూ.40 వేల కోట్లు పేద వారి కోసం ఖర్చు చేద్దామా? వద్దా? 

► రాష్ట్ర జనాభాలో 90 శాతం మందికి ఆరోగ్యశ్రీ, లక్షలాది కుటుంబాలలో ఉన్నత చదువులు చదువుకొంటున్న వారికి ఫీజు రీయింబర్స్‌మెంటు, వసతి దీవెన, వడ్డీలేని రుణాలు, ఉచిత పంట బీమా, ధరల స్థిరీకరణ నిధి, ఉపద్రవాల సమయంలో ఆదుకొనేందుకు నిధి, పేదలకు నాణ్యమైన బియ్యం, రైతులకు తొమ్మిది గంటలపాటు ఉచిత విద్యుత్తు ఇంకా ఇటువంటివి చాలా చాలా చేస్తున్నాం. ఇన్ని చేస్తూ.. కేవలం రాజధాని పేరుతో 53 వేల ఎకరాలను డెవలప్‌ చేయడానికి మరో లక్ష కోట్లను పెట్టడమన్నది సాధ్యమేనా? 

చదవండి:
సర్వతోముఖాభివృద్ధే మా లక్ష్యం
అమరావతి రైతులకు వరాలు
వికేంద్రీకరణకు కేబినెట్‌ ఆమోదం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement