సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం పోరాటాలు ఉదృతమవుతున్నాయి. హోదా సాధించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు పార్టీలన్నీ దీక్షలు, నిరసనలతో హోరెత్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే హోదా సాధన కోసం ఈ నెల 16న ఏపీ బంద్‌కు హోదా సాధన సమితి పిలుపునిచ్చింది. ఈ బంద్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, అన్నీ వామపక్షాలు మద్దతు తెలిపాయి. పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు నిరసనగా బంద్ కు దిగుతున్నట్లు సాధన సమితి నాయకుడు చలసాని శ్రీనివాస్ తెలిపారు. ప్రధానమంత్రి దీక్ష ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసిందని, బంద్‌లు చేయాలని తాము కోరుకోవడం లేదని.. రాష్ట్ర ప్రజల కోసం రోడ్డెక్కుతున్నట్టు ఆయన స్పష్టం చేశారు. 16న నిర్వహించదలచిన బంద్‌లో అత్యవసర సేవలను మినహాయిస్తున్నట్టు తెలిపారు. బంద్‌ను ఎవ్వరూ అడ్డుకోవద్దని, ప్రతి ఒక్కరూ పాల్గొని బంద్ విజయవంతం చేయాలని ఆయన కోరారు.
ప్రత్యేక హోదా కోసం చేస్తున్న ఏపీ బంద్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతిస్తోందని పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి ప్రకటించారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ సీపీ పోరాటం కొనసాగిస్తూనే ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆగ్రహానికి భయపడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యూటర్న్ తీసుకున్నారన్నారు. హోదా ఉద్యమాన్ని నీరుగార్చేందుకు తెలుగుదేశం పార్టీ కుట్ర పన్నుతోందని మండిపడ్డారు. టీడీపీ దుష్ట చర్యలను బంద్ ద్వారా ప్రజలకు తెలియచేస్తామని ఆయన పేర్కొన్నారు.
ప్రజా పోరాటంతోనే హోదా..
కేంద్ర ప్రభుత్వం చేసిన నమ్మక ద్రోహానికి నిరసనగా బంద్‌కు అన్ని పార్టీలతో పాటు సీపీఎం కూడా సంపూర్ణ మద్ధతు ప్రకటిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సీహెచ్ బాబురావు తెలిపారు. భారతీయ జనతాపార్టీపై యుద్ధం చేస్తామని, దొంగ దీక్షలతో నరేంద్ర మోదీ అబద్ధాలకోరుగా మారిపొయారని విమర్శించారు. ప్రజాపోరాటంతోనే కేంద్రంపై పోరాడి హోదా సాధించుకుంటామన్నారు. మోదీకి ప్రధాని పదవిలో కొనసాగే అర్హతలేదని మండిపడ్డారు. బంద్‌కు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. రాష్ట్రమంతా హోదా కోసం పోరాడుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం సంతోషాల నగరమంటూ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుది జపాన్ పోరాటమైతే.. తమది ఆంధ్రప్రదేశ్ పోరాటమని ఆయన తెలిపారు.
మోదీ నియంతలా అడ్డుకున్నారు
ఈనెల 16న చేపట్టిన ఏపీ బంద్‌కు సీపీఐ పార్టీ మద్దుతు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా ప్రధాని మోదీ నియంతలా అడ్డుకున్నారని ఆ పార్టీ నేత రామకృష్ణ ఆరోపించారు. ప్రధానమంత్రి నిరసన దీక్ష చేపట్టడం అన్యాయమని ఆయన అన్నారు.
చంద్రబాబును ప్రజలు క్షమించరు
ప్రత్యేక హోదా కోసం ఈనెల 16న తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు జనచైతన్య వేదిక పూర్తి మద్దతు ప్రకటించింది. నాలుగేళ్లు రాష్ట్రంలో ప్రజానీకాన్ని ప్రత్యేక హోదా విషయంలో మభ్య పెట్టిన కేంద్ర రాష్ట్రాల వైఖరిని వ్యతిరేకించాలని జనచైతన్య వేదిక అధ్యక్షుడు వి. లక్ష్మణరెడ్డి కోరారు. గతంలో మాదిరిగా బంద్‌ను విఫలం చేయటానికి సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తే ప్రజలు క్షమించరన్నారు. బంద్ సఫలం కావటానికి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment