ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రాజధాని ప్రాంత అభివృద్ధి మండలి (సీఆర్‌డీఏ) లక్ష్యంగా సాగనున్నాయి.
* రాజధాని ప్రాంత అభివృద్ధి మండలికి చట్టబద్ధత కల్పించే దిశగా అసెంబ్లీ సమావేశాలు
* పలు సవరణలతో సీఆర్‌డీఏ ముసాయిదా బిల్లుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం
* శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టి తక్షణమే ఆమోదం పొందాలని నిర్ణయం
* సీఎం చైర్మన్‌గా 15 మందితో సీఆర్‌డీఏ.. 9 మంది అధికారులతో ఎగ్జిక్యూటివ్ కమిటీ
* ఎయిడెడ్ టీచర్ల పదవీ విరమణ వయసు 60 ఏళ్లకు పెంపు.. యూనివర్సిటీ అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందికి 62 ఏళ్లకు పెంపు
* రైతులు పండించిన ధాన్యం ఎక్కడైనా అమ్ముకొనేందుకు అనుమతి
* మార్కెటింగ్ కమిటీల కాలపరిమితి ఏడాదికి కుదింపు.. ఇక కమిటీలో చైర్మన్ సహా 19 మంది
* విద్యుత్తు సరఫరా నష్టాలు 6 శాతానికి తగ్గించి, మిగులు విద్యుత్తు తెలంగాణకు..
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రాజధాని ప్రాంత అభివృద్ధి మండలి (సీఆర్‌డీఏ) లక్ష్యంగా సాగనున్నాయి. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు అత్యంత ఆవశ్యకమైన రాజధాని నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం సీఆర్‌డీఏని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. బుధవారం జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం సీఆర్‌డీఏ బిల్లు ముసాయిదాను పలు సవరణలతో ఆమోదించింది. గురువారం నుంచి జరిగే అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లోనే దీనిని ప్రవేశపెట్టి, ఆమోదింపజేసుకోవాలని, తద్వారా దానికి చట్టబద్ధత కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది.
సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన 4 గంటలపాటు జరిగిన మంత్రిమండలి సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా సీఆర్‌డీఏ బిల్లు ముసాయిదాపై సుదీర్ఘంగా చర్చించారు. దేవాదాయ, మార్కెటింగ్ కమిటీల రద్దు బిల్లులతో సహా నాలుగు బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ప్రభుత్వం తరఫున ఆరు అంశాలపై విధాన ప్రకటనలు చేయాలని నిర్ణయించింది. సీఆర్‌డీఏ బిల్లుపై ప్రతిపక్షం నుంచి ఎదురయ్యే సవాళ్లకు ఏ రకంగా సమాధానాలివ్వాలన్న అంశాలపైన కూడా ముఖ్యమంత్రి సహచరులకు దిశానిర్దేశం చేశారు.
సీఆర్‌డీఏ బిల్లును శుక్రవారం సభలో ప్రవేశపెట్టడమే కాకుండా తక్షణం ఆమోదించుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది. సీఆర్‌డీఏ ముసాయిదాలో భాషాపరంగా కొన్ని సవరణలు చేసింది. ఎయిడెడ్ టీచర్ల పదవీ విరమణ వయోపరిమితిని 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. యూనివర్శిటీ అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పదవీ విరమణ వయోపరిమితిని 60 నుంచి 62 ఏళ్లకు పెంచింది. విశాఖ జిల్లా మునగపాక మండలం టి శిరసాపల్లిలో 139 సర్వే నంబరులో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు ఎకరా రూ.10 లక్షల చొప్పున 70.98 ఎకరాలు ఏపీఐఐసీకి ఇచ్చేందుకు నిర్ణయించింది.
విమానయానాన్ని ప్రోత్సహించేందుకు విమాన ఇంధన వ్యాట్‌ను 16 శాతం నుంచి ఒక శాతానికి తగ్గించింది. దీనివల్ల ప్రభుత్వానికి ఏటా రూ.25 కోట్ల నష్టం వాటిల్లినా, విమానయానం 30 శాతం పెరుగుతుందని అంచనా. కేంద్ర పంచాయతీరాజ్ అభియాన్ స్కీమ్ కింద 6 వేల మంది క్షేత్ర సహాయకులను, ఉపాధి హామీ పథకంలో 4వేల మంది క్షేత్ర సహాయకులను నియమించాలని నిర్ణయించారు. మరిన్ని సంచార రైతుబ జార్లను ఏర్పాటుచేయాని నిర్ణయించారు.
వీజీటీఎం ఆస్తులు, అప్పులు సీఆర్‌డీఏకి...
విజయవాడ-గుంటూరు- తెనాలి- మంగళగిరి పట్టణాభివృద్ధి సంస్థ (వీజీటీఎం వుడా) ఆస్తులు, అప్పులను సీఆర్‌డీఏకు బదలాయించాలని మంత్రివర్గం తీర్మానించింది. సీఆర్‌డీఏ 15 మంది సభ్యులతో ఏర్పాటవుతుంది. సీఎం చైర్మన్‌గా, మున్సిపల్ శాఖ మంత్రి వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్ కన్వీనరుగా ఉంటారు. సభ్యులుగా ఆర్థిక శాఖ మంత్రి, నలుగురు ప్రభుత్వ కార్యదర్శులు, నలుగురు నిపుణులు, ఇతరులు ఉంటారు. తొమ్మిది మంది అధికారులతో ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంటుంది.
సీఆర్‌డీఏకి రూ. 1,000 కోట్లు డెవలప్‌మెంటు ఫండ్, రూ.250 కోట్లు వర్కింగ్ కేపిటల్‌గా ఉంటాయి. ఆర్నెల్లలో సీఆర్‌డీఏపై సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందిస్తారు. ఆర్థికపరమైన అంశాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం, బాండ్లు జారీ చేసే అధికారం ఈ సంస్థకు కల్పించారు. సీఆర్‌డీఏ బిల్లులో అంశాల్ని సరళతరం చేసేలా, ల్యాండ్ పూలింగ్ వంటి పదాలకు అర్థమిచ్చేలా మార్పులు చేశారు.
ఎర్రచందనంతో ఆదాయం పొందేందుకు ప్రణాళిక
రాష్ట్రంలో ఎర్రచందనం అమ్మకాల ద్వారా ఏటా రూ. 2 నుంచి రూ.3 వేల కోట్ల వరకు ఆదాయం వచ్చేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. స్మగ్లర్లను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు కఠిన చట్టాలను తేవాలని మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 2,666 మెట్రిక్ టన్నులు ఎర్రచందనం విక్రయించగా, రూ.850 కోట్లు ఆదాయం వచ్చింది. ఇంకా అమ్మాల్సిన ఎర్రచందనం 7 వేల టన్నుల వరకు ఉంది. ఎర్రచందనం స్మగ్లర్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు మూడు నుంచి పదేళ్ళ జైలు శిక్ష, రూ. 10 లక్షల వరకు అపరాధ రుసుం విధించేలా చట్టాల్ని మార్చేందుకు మంత్రిమండలి నిర్ణయించింది.
రైతులే నేరుగాధాన్యం అమ్ముకొనేలా నిబంధనలు సడలింపు
రాష్ట్ర పరిధిలో రైతులే నేరుగా ధాన్యం అమ్ముకొనేందుకు వీలుగా సవరణలు తెచ్చారు. రైతులు పండించిన ధాన్యాన్ని ఆధార్‌తో సంబంధం లేకుండా ఎక్కడైనా విక్రయించేందుకు ట్రేడర్లకు ఇచ్చిన విధంగా అనుమతులు ఇస్తారు. ఏపీకి చెందిన రైతులు తెలంగాణ ప్రాంతంలో ధాన్యం అమ్ముకోవాలంటే వారే నేరుగా సీఎస్‌టీ చెల్లించాలి. రంగు మారిన ధాన్యం 17 శాతంకంటే నష్టం ఎక్కువగా ఉన్నప్పటికీ ఎఫ్‌సీఐ నేరుగా కొనేందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. తేమ ఉన్న ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు డ్రయర్లు, టార్పాలిన్ పట్టాలు ప్రభుత్వమే కొనుగోలు చేసి, ధాన్యం సేకరణ చేయాలి. ఈ ప్రక్రియను జిల్లా కలెక్టర్లు, జేసీలు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు పర్యవేక్షించాలని మంత్రిమండలి ఆదేశించింది.
ముఖ్యంగా హుద్‌హుద్ తుఫానుతో నష్టపోయిన ఉత్తరాంధ్ర జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్ళు చేపట్టాలని నిర్ణయించింది. మార్కెటింగ్ కమిటీల కాలపరిమితిని ఏడాదికి కుదించింది. కమిటీలో చైర్మన్‌తో కలిపి 19 మంది సభ్యులు ఉండేలా మార్పులు చేయనున్నారు. 12 మంది రైతులు, ముగ్గురు ట్రేడర్లు, నలుగురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశాలివ్వనున్నారు. మార్కెటింగ్ కమిటీలను నామినేటెడ్ విధానంలో నియమించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో పంట ఉత్పత్తుల్ని అంతర్జాతీయ మార్కెట్‌లో ఆన్‌లైన్ విధానంలో అమ్ముకునేందుకు ఓ నిపుణుడిని నియమించేందుకు మంత్రివర్గం అనుమతించింది.
విద్యుత్తు నష్టాలు సింగిల్ డిజిట్‌కు పరిమితం
విద్యుత్తు సరఫరా నష్టాలను సింగిల్ డిజిట్‌కు పరిమితం చేసి మిగులు విద్యుత్తు సాధించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 12 శాతం ఉన్న సరఫరా నష్టాలను 6 శాతానికి తగ్గించి, మిగులు విద్యుత్తును తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చేందుకు మంత్రిమండలి సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఎల్‌ఈడీ బల్బుల వాడకాన్ని మరింతగా పెంచేందుకు ఇంటికి రూ.398 రాయితీ ఇచ్చేలా ఓ ప్రాజెక్టు అమలుపై సమావేశంలో చర్చించారు. మొదటి విడతలో గుంటూరు, అనంతపురం, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో రూ.10కే ఎల్‌ఈడీ బల్బులు ఇవ్వనున్నారు. వైజాగ్‌లో ఈ నెల 25 నాటికల్లా 57 వేల ఎల్‌ఈడీ వీధి దీపాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మిగిలిన జిల్లాలో జూన్ నాటికి ఎల్‌ఈడీ ప్రాజెక్టు ప్రారంభిస్తారు.