
తన ఆదేశాలు తానే పాటించని చంద్రబాబు
హైదరాబాద్ : మింగ మెతుకు లేదు ..మీసాలకు సంపెగ నూనె అన్నట్లు... ఓవైపు రాజధాని నిర్మాణానికి నిధులు లేవంటూనే మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దూకుడుగా దుబారా చేస్తోంది. స్టార్ హోటళ్లలో సమీక్షలు పెట్టొద్దని గతంలో ఆదేశాలు ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ...తాను ఇచ్చిన ఆదేశాలు ఆయనే పాటించటం లేదు. తాజాగా చంద్రబాబు శుక్రవారం ఉదయం విజయవాడలోని ఓ ప్రయివేట్ ఫంక్షన్ హాల్లో సమీక్ష నిర్వహించటం విశేషం.
మరోవైపు మంత్రులు, అధికారులు సహా చంద్రబాబునే ఫాలో అవుతున్నారు. డీవీ మేనర్, గేట్వే, మురళీ ఫార్చ్యూన్ వంటి స్టార్ హోటళ్లలో బస చేస్తున్నారు. కలెక్టర్ల నుంచి మంత్రుల వరకూ అందరూ కాస్టలీ హోటళ్లలోనే బస చేయటం గమనార్హం. అంతేకాకుండా లంచ్, డిన్నర్లకు కూడా వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి, విమానాల్లో మంత్రులు, ఐఏఎస్లు ప్రయాణాలు చేస్తున్నారు. లోటు బడ్జెట్ కేంద్రం భర్తీ చేయకపోయినా దుబారాలో ఏపీ సర్కార్ ఏమాత్రం వెనక్కి తగ్గటం లేదు. చంద్రబాబు దుబారా ఖర్చు చూసి అధికారులే అవాక్కవుతున్నారు.