
ఏపీకి ప్రత్యేక హోదా అర్హత లేదు: బీజేపీ
ప్రత్యేక హోదా అర్హత ఆంధ్రప్రదేశ్‌కు లేదని, దానికంటే ప్రత్యేక ప్యాకేజి లేదా ప్రత్యేక ఆర్థిక సాయం మంచివని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు, విశాఖపట్నం ఎంపీ కె. హరిబాబు అన్నారు. కేంద్రప్రభుత్వం రాష్ట్రంలో చేపట్టిన కొన్ని ప్రాజెక్టులు అధికారుల కారణంగా ఆలస్యం అవుతున్నాయని వ్యాఖ్యానించారు. ఏపీలో అసెంబ్లీ సీట్లను 175 నుంచి 225కు, తెలంగాణలో 119 నుంచి 153కు పెంచుకోడానికి ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం అవకాశం కల్పిస్తోందని ఆయన చెప్పారు.
సుపరిపాలన, పేదలకు సంక్షేమ పథకాలు, ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో సాధించిన విజయాలు.. వీటన్నింటి వల్ల దక్షిణ భారతంలో తాము విస్తరించడానికి అవకాశాలను మరింతగా పెంచాయని హరిబాబు అన్నారు. ఉత్తరప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల్లో విజయాలను బట్టి చూస్తే ప్రజలకు బీజేపీ మీద, ప్రధాని నరేంద్రమోదీ చేపట్టిన అభివృద్ధి ఎజెండా మీద నమ్మకం ఉన్నట్లు కనిపిస్తోందని ఆయన చెప్పారు. పెద్దనోట్ల రద్దు గురించి ప్రతిపక్షాలు నానా వివాదాలు రేకెత్తించినా.. వాటిని ప్రజలు తిరస్కరించిన విషయం ఎన్నికల ఫలితాలతోనే స్పష్టం అయ్యిందన్నారు.