సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విద్యుత్, సాగునీటి కష్టాలు మరింత పెరిగేలా కనిపిస్తున్నాయి. కృష్ణానది నీటి కేటాయింపులపై ఏర్పాటైన బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తుది తీర్పు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు వ్యతిరేకంగానే ఉండే అవకాశముంది. 2010లో ఈ ట్రిబ్యునల్ ఇచ్చిన మధ్యంతర తీర్పులోనే మన రాష్ట్ర కేటాయింపులపై ప్రతికూల ప్రభావం చూపే పలు అంశాలున్నాయి. ఈ నెలాఖరున రానున్న తుది తీర్పులో కూడా అటుఇటుగా అవే అంశాలుండొచ్చని సాగునీటి పారుదల శాఖ అధికారులు భావిస్తున్నారు. నవంబర్ 29న బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తుది తీర్పు ఉంటుందని వారికి సమాచారం అందింది. అందుకోసం ఆ రోజు ట్రిబ్యునల్ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ సమావేశానికి మూడు రాష్ట్రాల అధికారులు, న్యాయవాదులు హాజరు కానున్నారు.
మధ్యంతర తీర్పులో ఏముంది?: మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కృష్ణానది జల వివాదాల పరిష్కారం కోసం పదేళ్ల క్రితం బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఏర్పడింది. మూడు రాష్ట్రాల వాదనలను విన్న ట్రిబ్యునల్ తన మధ్యంతర తీర్పును 2010 డిసెంబర్‌లో వెల్లడించింది. ఆ తీర్పులో రాష్ట్రానికి నష్టం కలిగించే పలు అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పటివరకు మనకే వాడుకునే హక్కు ఉన్న మిగులు జలాలను ఎగువ రాష్ట్రాలకు కూడా పంచారు. ఇందులో 177 టీఎంసీలు కర్ణాటకకు, 81 టీఎంసీలను మహారాష్ట్రకు కేటాయించారు. అలాగే, ఆల్మట్టి డ్యాం ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.25 మీటర్లకు పెంచాలన్న కర్ణాటక అభ్యర్థనకు కూడా ట్రిబ్యునల్ ఆమోదం తెలిపింది. దాంతో మరో వంద టిఎంసీల కృష్ణాజలాలను కర్ణాటక అదనంగా వాడుకోవచ్చు. అంతే కాకుండా ఈ ప్రాజెక్టు వల్ల వర్షాలు సరిగ్గా లేని సమయాల్లో దిగువన ఉన్న మన రాష్ట్రానికి నీటి ప్రవాహం ఆగిపోతుంది. దాంతో రాష్ట్రంలోని జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లతో పాటు వీటిపై ఆధార పడ్డ పలు ఇతర ప్రాజెక్టులకు తీవ్ర నీటి కొరత ఏర్పడనుంది. అయితే, మధ్యంతర తీర్పుపై మూడు రాష్ట్రాలు కూడా అభ్యంతరం తెలపడంతో సవరణల కోసం మళ్లీ వాదనలు విన్నారు. ఈ వాదనలు కూడా పూర్తయి తుది తీర్పునకు రంగం సిద్ధమైంది.
ఈ తీర్పులో ఏం ఉండొచ్చు!: మధ్యంతర తీర్పులో సవరణల కోసం ట్రిబ్యునల్ ముందు మన రాష్ట్రం వాదనలను వినిపించింది. ముఖ్యంగా మిగులు జలాల పంపిణీపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అయినా, తుది తీర్పులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చనే అధికారులు అంచనా వేస్తున్నారు. ఆలమట్టి నుంచి నీటి విడుదలకు సంబంధించిన టైమ్ షెడ్యూల్, కొత్తగా ఏర్పడబోయే అథారిటీ పరిధిపై ట్రిబ్యునల్ కొంత స్పష్టత ఇచ్చే అవకాశం ఉన్నట్టు భావిస్తున్నారు. మిగులు జలాల పంపిణీకి సంబంధించి గత తీర్పుకే ట్రిబ్యునల్ కట్టుబడి ఉంటుందనుకుంటున్నారు.
విభజన ప్రక్రియతో ఆందోళన: మిగులు జలాలపై ఎగువ రాష్ట్రాలకు కూడా హక్కులు కల్పిస్తే.. మన రాష్ట్రంలో వాటిపై ఆధారపడిన నెట్టెంపాడు, కల్వకుర్తి, గాలేరు-నగరి, హంద్రీ-నీవా, వెలుగొండ, ఏఎమ్మార్పీ వంటి ప్రాజెక్టుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. అలాగే, రాష్ట్ర విభజన జరిగితే, రాష్ట్రానికి జరిపిన అరకొర నీటి కేటాయింపులపై కూడా గందరగోళం ఏర్పడుతుంది. వర్షాలు సరిగ్గా లేని సమయాల్లో సాగర్, కృష్ణా డెల్టా ఆయకట్టు రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతారు.
మిగులు జలాలు దక్కేనా?
Published Thu, Nov 21 2013 2:21 AM | Last Updated on Sat, Sep 2 2017 12:48 AM
Advertisement
Advertisement