లంచం ఇచ్చేందుకు భిక్షాటన..  | Andhra Pradesh: Farmer turns to begging to arrange bribe for the local officer | Sakshi
Sakshi News home page

లంచం ఇచ్చేందుకు భిక్షాటన.. 

Published Fri, Dec 21 2018 1:57 AM | Last Updated on Fri, Dec 21 2018 1:57 AM

Andhra Pradesh: Farmer turns to begging to arrange bribe for the local officer - Sakshi

వెలుగోడు: అధికారులకు లంచం ఇవ్వడం కోసం కుటుంబ సభ్యులతో కలసి భిక్షాటన చేసి వినూత్నంగా నిరసన తెలిపాడు ఓ రైతు. ఏపీలోని కర్నూలు జిల్లా వెలుగోడు మండలం మాధవరం గ్రామానికి చెందిన వన్యం వెంకటేశ్వర్లు అలియాస్‌ రాజు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన గౌరెడ్డికి ఇద్దరు కొడుకులు కాగా.. వారిలో వన్యం వెంకటేశ్వర్లు అలియాస్‌ రాజు రెండో కుమారుడు. వారసత్వంగా తనకు 25 ఎకరాల భూమి దక్కాల్సి ఉండగా, దీన్ని సమీప బంధువు ఆక్రమించాడని రాజు ఆరోపిస్తున్నాడు. తన భూమి తిరిగి ఇప్పించాలని రాజు కోరగా వీఆర్‌వో లంచం డిమాండ్‌ చేశాడు. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం వెలుగోడు పట్టణంలో రాజుతో పాటు అతని భార్య, ఇద్దరు పిల్లలు చేతిలో గిన్నె పట్టుకొని.. మెడలో ఓ బ్యానర్‌ వేసుకుని భిక్షాటన చేయడం ప్రారంభించారు.

బ్యానర్‌పై ‘దయచేసి నాకు దానం చేయండి. డబ్బు చెల్లిస్తే ఏ పనైనా పూర్తవుతుంది. నేను అలా చేయలేకపోయా. కాబట్టి నా భూమిని కోల్పోయా. రెండేళ్ల నుంచి నా భూమి కోసం కష్టపడుతున్నా’ అని రాసి ఉంది. రాజు ఆరోపణల నేపథ్యంలో గురువారం ఆత్మకూరు సీఐ కృష్ణయ్య వెలుగోడు రెవెన్యూ కార్యాలయంలో విచారణ చేపట్టారు. రాజు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తహసీల్దార్‌ శ్రీనివాసులు తెలిపారు. రాజు అనుభవంలో 2.15 ఎకరాల పొలం మాత్రమే ఉందని, దాయాదుల మధ్య వివాదాన్ని తమపై నెడుతున్నాడని ఆరోపించారు. ఆయన భూమికి సంబంధించి ఏమైనా సమస్య ఉంటే కోర్టుకెళ్లి తేల్చుకోవాలని తహసీల్దారు సూచించారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement