సాక్షి, కర్నూలు : సమాజంలో అవినీతి, లంచం ఎంతలా పెరిగిపోయాయో ఈ సంఘటన చూస్తే అర్థమవుతోంది. అధికారులకు లంచం ఇవ్వడం కోసం ఓ రైతు కుటుంబంతో కలిసి భిక్షాటన చేస్తున్నారు. వివరాలు.. కర్నూలు జిల్లాకు చెందిన మన్యం వెంకటేశ్వర్లు అలియాస్ రాజుకు పశ్చిమ గోదావరి జిల్లా మాధవరం గ్రామంలో 25 ఎకరాల భూమి ఉంది. అయితే ఈ భూమిని రాజు సమీప బంధువు ఒకరు అక్రమంగా ఆక్రమించినట్లు రాజు ఆరోపించారు.
అంతేకాక సదరు బంధువు అధికారులకు లంచం ఇచ్చి, తప్పుడు డాక్యుమెంట్లను సృష్టించి.. భూమిని ఆక్రమించుకున్నాడన్నారు రాజు. ఈ విషయం గురించి అధికారులను సంప్రదించగా ఇప్పటికే సదరు బంధువు పేర మీద డాక్యుమెంట్ పేపర్లు తయారయ్యాయని.. ఏ నిమిషంలోనైనా వాటిని అతనికి అందజేస్తామని తెలిపారన్నారు.
అధికారుల తీరుతో విసిగిపోయిన రాజు.. తన భూమిని కాపాడుకునేందుకు బిచ్చగాడిగా మారారు. రాజుతో పాటు అతని భార్య, ఇద్దరు పిల్లలు కూడా చేతిలి భిక్షపాత్ర పట్టుకుని.. మెడలో ఓ బ్యానర్ వేసుకుని కనిపించిన వారినల్లా దానం చేయమని కోరుతున్నారు. బ్యానర్ మీద ‘దయచేసి నాకు దానం చేయండి.. డబ్బు చెల్లిస్తే ఏ పనైనా పూర్తవుతుంది. నేను అలా చేయలేకపోయాను.. కాబట్టి నా భూమిని కోల్పోయాను. గత రెండేళ్ల నుంచి నా భూమి కోసం కష్టపడుతున్నాను’ అని రాసి ఉంది.
అయితే ఈ విషయం గురించి కర్నూలు జిల్లా కలెక్టర్‌ని ప్రశ్నించగా.. రాజు చేస్తున్న ఆరోపణలు నిరాధరమైనవని తెలిపారు. అధికారుల గురించి ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తున్నందుకుగాను అతని మీద పరువునష్టం కేసు పెడతామని హెచ్చరించారు. అతని భూమికి సంబంధించి ఏమైనా సమస్య ఉంటే కోర్టుకెళ్లి తేల్చుకోవాలని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment