Andhra Pradesh Govt All Set To Celebrate State Formation Day Celebrations | నేడు రాష్ట్ర అవతరణ వేడుకలు - Sakshi
Sakshi News home page

నేడు రాష్ట్ర అవతరణ వేడుకలు

Published Fri, Nov 1 2019 5:09 AM | Last Updated on Fri, Nov 1 2019 11:27 AM

Andhra Pradesh Government Celebrate State Formation Day - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవాలను మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర స్థాయిలో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఈ వేడుకలను శుక్రవారం నుంచి అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ వేడుకలకు తొలి రోజు శుక్రవారం ముఖ్య అతిథులుగా గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరుకానున్నారు. అలాగే పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రముఖులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా అమరజీవిపొట్టి శ్రీరాములుకు నివాళి అర్పించనున్నారు.

రాష్ట్ర విభజన అనంతరం ఐదేళ్ల విరామం తరువాత తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహించకుండా రాష్ట్ర విభజన తేదీ జూన్‌ 2 నాడు నవనిర్మాణ దీక్షలు పేరుతో ఆర్భాటం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ఒరిజినల్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ కొనసాగించాలంటే నవంబర్‌ 1నే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర  సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ప్రత్యేక కార్యక్రమాలను మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. దీనితో పాటు స్వాతంత్య్ర పోరాటంలో త్యాగాలు చేసిన మహనీయుల వారసులను ఘనంగా సన్మానించనున్నారు.

రాష్ట్రానికి చెందిన పింగళి వెంకయ్య, పొట్టి శ్రీరాములు,  టంగుటూరి ప్రకాశం పంతులు, అల్లూరి సీతారామరాజు, కన్నెగంటి హనుమంతు, కోటిరెడ్డి, వావిలాల గోపాలకృష్ణయ్య, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, దామోదరం సంజీవయ్యల వారసులు, బంధువులను ఈ సందర్భంగా ప్రభుత్వం ఘనంగా సన్మానించనుంది. వేదికకు ఇరువైపులా చేనేత, హస్తకళలకు సంబంధించిన 21 స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. సంగీతం, నృత్యం, నాటకం వంటి లలితకళల ప్రదర్శనలతో మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల ప్రసిద్ధ వంటకాలతో 25 ఫుడ్‌ స్టాళ్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు.  

సందర్శకుల కోసం..
వేడుకలను చేనేత కార్మికులు, కళాకారులు సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు. దానికి తగ్గట్లుగా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సందర్శకుల కోసం వివిధ ఉత్పత్తులు అందుబాటులో ఉంచారు.  పలు స్టాళ్లు ఏర్పాటు చేశారు.  

రాష్ట్రం అన్నిరంగాల్లో పురోభివృద్ధి సాధించాలి
సాక్షి, అమరావతి: రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తోందని వారు గురువారం వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. ఈ సంక్షేమ పథకాలు అర్హులైన అందరికీ అందాలని చెప్పారు. రాష్ట్రం అన్ని రంగాల్లో పురోభివృద్ధి సాధించాలని  వారు ఆకాక్షించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement