
సాక్షి, విజయనగరం : రాష్ట్ర వ్యాప్తంగా అరవై లక్షల లబ్ధిదారులకు ఉదయం నుంచే వాలంటీర్లు పింఛన్ ఇచ్చారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సర్వే సమయంలో కొంత మంది ఇంట్లో లేనందున వారి పేర్లు జాబితాలో లేవని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి ప్రజా ప్రతినిధులు తీసుకెళ్లారని తెలిపారు. ఇలాంటివి పరిగణలోకి తీసుకుని రీవెరిఫికేషన్ చేయాలని సీఎం ఆదేశించారన్నారు. అర్హులకు రెండు నెలల పింఛన్ ఇవ్వాలని చెప్పారని, ఇలా రీవెరిఫికేషన్ చేయడం ద్వారా విజయనగరంలో నాలుగు వేల మంది అధికంగా ఇప్పుడు జాబితాలో చేరారని బొత్స తెలిపారు. ఉగాది రోజున అర్హులకు ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నామని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై అయిదు లక్షల పట్టాలు ఇవ్వనున్నామని, ఇవి కూడా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఇళ్ల పట్టాలు, పెన్షన్, రేషన్ కార్డుల జారీ వంటివి నిరంతర ప్రక్రియ అని, గత ప్రభుత్వం మాదిరిగా జన్మభూమి కమిటీల సిఫార్సులు చేసే వారికో, సొంత పార్టీ వారికో, డబ్బులిచ్చిన వారికో ఇవ్వడం కాదని అన్నారు. అర్హత కలిగినవారు గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి వారికి అందిస్తామని చెప్పారు. ఎవ్వరూ ఇబ్బందిపడాల్సిన అవసరం లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment