సాక్షి, అమరావతి : ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. చర్చలకు రావాలంటూ ఆర్టీసీ జేఏసీ నేతలకు ముఖ్యమంత్రి పేషీ నుంచి ఆహ్వానం అందింది. బుధవారం ఉదయం 10 గంటలకు సచివాలయంలో ఆర్టీసీ జేఏసీ నాయకులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసి సమస్యలు వివరించనున్నారు. సీఎంతో భేటీ అనంతరం సమ్మె ఉంటుందా లేదా అనే విషయమై స్పష్టమైన ప్రకటన వెలువడనుంది. ఇక ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబుతో జేఏసీ నేతలు మంగళవారం జరిపిన చర్చలు సానుకూలంగా ముగియడంతో సమ్మె విరమణ దిశగానే నిర్ణయం ఉంటుందని పలువురు భావిస్తున్నారు.
(ఆర్టీసీ ఎండీతో ముగిసిన జేఏసీ నేతల చర్చలు)
ఎండీ సురేంద్రబాబుతో సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయని, మొత్తం 26 అంశాలపై ఎంవోయూ ఇవ్వడానికి యాజమాన్యం అంగీకరించిందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ పీ. దామోదరరావు తెలిపారు. ఆర్థికపరమైన అంశాలన్నీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. తాము చేసిన 27 డిమాండ్లలో 26 డిమాండ్లకు ఆర్టీసీ యాజమాన్యం సానుకూల స్పందించిందని, ఆర్టీసీని ఆర్థికంగా ఆదుకునే డిమాండ్ ఒక్కటే మిగిలి ఉందని తెలిపారు. 90శాతం వరకూ సమస్యల పరిష్కారానికి యాజమాన్యం సానుకూలంగా ఉందని జేఏసీ నాయకులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment