మరో ఐదు ‘శ్రీసిటీ’లు | Andhra Pradesh Government Planning For Industrial Development | Sakshi
Sakshi News home page

మరో ఐదు ‘శ్రీసిటీ’లు

Published Fri, Jun 5 2020 5:01 AM | Last Updated on Fri, Jun 5 2020 5:15 AM

Andhra Pradesh Government Planning For Industrial Development - Sakshi

విజయవాడలోని ఎన్టీఆర్‌ పరిపాలన భవనంలో జరిగిన టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి

సాక్షి, అమరావతి: భారీఎత్తున విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన ప్రణాళిక రచిస్తోంది. ఇందులో భాగంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఏర్పాటుచేసిన మల్టీ ప్రొడక్ట్‌ సెజ్‌ ‘శ్రీసిటీ’ తరహాలో అన్ని వసతులతో ఐదు పారిశ్రామిక పార్కులను నిర్మించడానికి రంగం సిద్ధం చేస్తోంది. గురువారం విజయవాడలోని ఎన్టీఆర్‌ పరిపాలన భవనంలో ఉన్న ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ కార్యాలయంలో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి అధ్యక్షతన విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం కోసం ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్‌ కమిటీ తొలిసారి సమావేశమైంది. ఈ భేటీలో పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, టాస్క్‌ఫోర్స్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ కరికాల వలవన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్, టాస్క్‌ఫోర్స్‌ సీఈవో సుబ్రహ్మణ్యం జవ్వాది, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్, పంచాయతీ రాజ్, మైనింగ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది, విద్యుత్‌ శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్‌ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం కోసం ఐదు డిజిగ్నేటెడ్‌ క్లస్టర్స్, పారిశ్రామిక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా రక్షణ–ఏరోస్పేస్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, ఫార్మా–హెల్త్‌కేర్, టెక్స్‌టైల్‌ రంగాల్లో భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించే విధంగా అన్ని వసతులతో డిజిగ్నేటెడ్‌ క్లస్టర్స్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్లగ్‌అండ్‌ప్లే విధానంలో విదేశీ కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించుకునే విధంగా ఈ క్లస్టర్స్‌ను అభివృద్ధి చేస్తామని మంత్రి గౌతమ్‌రెడ్డి తెలిపారు.

♦ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్న దేశాలను గుర్తించి వాటి కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆయా దేశాల్లో స్థానికంగా నివసిస్తున్న తెలుగు వారితో కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. 
♦ పెట్టుబడి ప్రతిపాదనలు వేగంగా వాస్తవరూపం దాల్చడం కోసం దేశాల వారీగా, రంగాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించనున్నారు. 
♦ ప్రతిపాదన వచ్చిన 30 రోజుల్లో పరిశ్రమకు అవసరమైన భూమి, నీరు, విద్యుత్, మానవ వనరులను అందించే విధంగా నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తున్నట్లు మంత్రి గౌతమ్‌రెడ్డి తెలిపారు.
♦ పారిశ్రామిక పాలసీతో పాటు, ఐటీ–ఎలక్ట్రానిక్స్‌ పాలసీలను జూన్‌ 26న విడుదల చేసేందుకు కృషిచేస్తున్నామని మంత్రి చెప్పారు. కొత్త పారిశ్రామిక విధానం ద్వారా వచ్చే నాలుగేళ్లలో పెద్దఎత్తున సంపద సృష్టిస్తామని ధీమా వ్యక్తంచేశారు.
 ♦సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన ఉండే స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు (ఎస్‌ఐపీబీ) ముందుకు నేడు వచ్చే సుమారు రూ. 18,000 కోట్ల విలువైన 25 పెట్టుబడి ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకోనున్నారు.

నేతన్నల స్థితిగతులపై సర్వే
చేనేత కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగు పరచడానికి తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి సర్వే చేపట్టాలని చేనేత, జౌళి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. చేనేతల స్థితిగతులపై గురువారం సచివాలయంలో మంత్రి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈనెలలో అందించే ‘నేతన్న నేస్తం’ సాయానికి అర్హులైన వారి జాబితాను రూపొందించే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో చేనేత, జౌళి శాఖ డైరెక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శ్రీకాంత్‌ ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement