సాక్షి, అమరావతి: టీడీపీ ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, అనగాని సత్యప్రసాద్, గద్దె రామ్మోహన్‌ల ఎన్నికను సవాలు చేస్తూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు దాఖలు చేసిన ఎన్నికల వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీచేసింది. అలాగే ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు సైతం నోటీసులిచ్చింది. తదుపరి విచారణను అక్టోబర్ 14కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్ జి.శ్యాంప్రసాద్, జస్టిస్ ఎం.గంగారావు వేర్వేరుగా ఉత్తర్వులు జారీచేశారు.
విశాఖ ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గంటా శ్రీనివాసరావు ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ కె.కన్నప్పరాజు, రేపల్లె నుంచి అనగాని సత్యప్రసాద్ ఎన్నికను సవాలు చేస్తూ మోపిదేవి వెంకటరమణ, విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి గద్దె రామ్మోహన్ ఎన్నికను రద్దు చేయాలంటూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బొప్పన భవకుమార్ తరఫున ఎన్నికల ఏజెంట్ వి.శ్రీనివాస్‌రెడ్డి హైకోర్టులో ఎన్నికల పిటిషన్లు దాఖలు చేశారు.
పిటిషనర్ల తరఫు న్యాయవాది మలసాని మనోహర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల నిబంధనల ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తి అఫిడవిట్‌లో తన ఆదాయం, వృత్తి వివరాలను తెలపాల్సి ఉండగా వీరు పొందుపర్చలేదన్నారు. అనగాని సత్యప్రసాద్ కూడా ఆదాయ వివరాలు పేర్కొనలేదని తెలిపారు. వాస్తవాలను దాచి వీరు అఫిడవిట్ దాఖలు చేశారని, ఎన్నికల నిబంధనలకు ఇది విరుద్ధమని మనోహర్‌రెడ్డి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment