గంటా రాజీనామా వ్యవహారంలో కౌంటర్లు దాఖలు చేయండి | AP HC Seeks Counter Affidavits from Govt Poll Officials in Ganta plea | Sakshi
Sakshi News home page

గంటా రాజీనామా వ్యవహారంలో కౌంటర్లు దాఖలు చేయండి

Published Tue, Jan 30 2024 4:48 AM | Last Updated on Tue, Jan 30 2024 10:38 AM

AP HC Seeks Counter Affidavits from Govt Poll Officials in Ganta plea - Sakshi

సాక్షి, అమరావతి: విశాఖ తూర్పు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదిస్తూ శాసనసభ స్పీకర్‌ జారీ చేసిన ఉత్తర్వులు, ఆ ఉత్తర్వులను నోటిఫై చేస్తూ జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌కు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని హైకోర్టు సోమవారం న్యాయ, శాసన వ్యవహారాల శాఖ కార్యదర్శి, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని ఆదేశించింది. ఇందులో భాగంగా వారికి నోటీసులు జారీ చేసింది. కౌంటర్లతో పాటు గంటా శ్రీనివాసరావు రాజీనామా లేఖను, ఇతర ఆధారాలను తమ ముందుంచాలని ప్రతివాదులను ఆదేశించింది.

ఈ వ్యాజ్యంలో శాసనసభ సెక్రటరీ జనరల్‌ను ప్రతివాదిగా చేర్చాలని గంటా శ్రీనివాసరావును ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 19కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బొప్పూడి కృష్ణమోహన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. తన రాజీనామాను ఆమోదిస్తూ శాసనసభ స్పీకర్‌ ఈనెల 23న జారీ చేసిన ఉత్తర్వులు, ఆ ఉత్తర్వులను నోటిఫై చేస్తూ శాసనసభ సెక్రటరీ జనరల్‌ అదే రోజు జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ గంటా శ్రీనివాసరావు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై జస్టిస్‌ కృష్ణమోహన్‌ సోమవారం విచారణ జరిపారు. 

గంటా వ్యాజ్యానికి విచారణార్హతే లేదు..
గంటా తరఫు న్యాయవాది ఎన్‌.అశ్వనీ కుమార్‌ వాదనలు వినిపిస్తూ, 2021లో సమర్పించిన రాజీనామాను స్పీకర్‌ మూడేళ్ల తరువాత ఆమోదించారన్నారు. రాజీనామా ఉపసంహరణకు గంటా ఎలాంటి లేఖ ఇవ్వలేదని అంగీకరించారు. రాజీనామాను ఆమోదించడం వెనుక దురుద్దేశాలున్నాయి కాబట్టే, స్పీకర్‌ ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశామన్నారు. త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే రాజీనామా ఆమోదించారని, ఆ ఎన్నికల్లో గంటా ఓటు కీలకమని ఆయన వివరించారు.

న్యాయ, శాసన వ్యవహారాల శాఖ కార్యదర్శి తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) వేలూరి మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ, గెజిట్‌ నోటిఫికేషన్‌ను సవాలు చేసినప్పుడు, దానిని జారీ చేసిన సెక్రటరీ జనరల్‌ను ప్రతివాదిగా చేర్చాలని, అయితే ఈ పిటిషన్‌లో సెక్రటరీ జనరల్‌ను ప్రతివాదిగా చేర్చలేదన్నారు. సాధారణంగా ఇలాంటి వ్యాజ్యాలు ధర్మాసనం ముందుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. విధి విధానాల ప్రకారమే గంటా రాజీనామాను స్పీకర్‌ ఆమోదించారని తెలిపారు. తరువాత అసెంబ్లీ తరఫు న్యాయవాది మెట్టా చంద్రశేఖరరావు వాదనలు వినిపిస్తూ, అసలు ఈ వ్యాజ్యానికి విచారణార్హతే లేదన్నారు.

ఈ వ్యాజ్యం ధర్మాసనం ముందుకు వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. స్పీకర్‌ అన్నీ అంశాలను పరిగణనలోకి తీసుకునే రాజీనామాను ఆమోదించారన్నారు. శాసనసభ్యుడిగా కొనసాగాలన్న ఉద్దేశం గంటాకు ఉంటే, ఈ మూడేళ్లలో తన రాజీనామాను వెనక్కి తీసుకుని ఉండాల్సిందని, ఈ పని చేయకుండా ఆయనను ఎవరూ ఆపలేదని వివరించారు. రాజీనామాను ఆమోదించే విషయంలో నిర్ధిష్టంగా ఎలాంటి నిబంధనలు లేవన్నారు. స్పీకర్‌ నిర్ణయాన్ని రిట్‌ ద్వారా ప్రశ్నించడానికి వీల్లేదని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement