
‘విభజన’పై సమ్మెచేస్తారా?
* ఉద్యోగ సంఘాలను ప్రశ్నించిన హైకోర్టు
* రాజకీయ అంశాలతో మీకేం సంబంధం..?
* సమ్మెను ఎలా సమర్థించుకుంటారంటూ ప్రశ్న
* ఉద్యమం చేయాలనుకుంటే.. ఉద్యోగాలకు రాజీనామాలు చేయాలని సూచన
* విభజనపై నిర్ణయం తీసుకున్నారా..? లేదా..? చెప్పండి
* కేంద్ర ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశం
* సమ్మెను ఎదుర్కొనేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారు..?
* రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన న్యాయమూర్తులు
* కౌంటర్లు దాఖలు చేయాలంటూ విచారణ 26వ తేదీకి వాయిదా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు సంబంధించిన వ్యవహారంలో ఉద్యోగులు సమ్మె ఎలా చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. విభజన నిర్ణయం రాజకీయ అంశమని, రాజకీయ అంశాలతో ఉద్యోగులకు ఏమి సంబంధమని, ఆ విషయమై సమ్మె ఎలా చేస్తారని నిలదీసింది. ఉద్యోగాలకు రాజీనామాలు చేసి ఉద్యమంలో పాల్గొనవచ్చునని సూచించింది. విభజన నేపథ్యంలో చేస్తున్న సమ్మెను ఏ విధంగా సమర్ధించుకుంటారో తెలియచేయాలని పేర్కొంటూ ఏపీఎన్‌జీవో, సీమాంధ్ర సెక్రటేరియట్ ఉద్యోగుల ఫోరం నాయకులకు ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు రాష్ట్ర విభజనపై నిర్ణయం ఏదైనా తీసుకున్నారా..? లేదా..? స్పష్టం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సమ్మెను ఎదుర్కొనేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులిచ్చింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఉద్యోగ సంఘాలను, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, జస్టిస్ ఖండవల్లి చంద్రభానులతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ సీమాంధ్ర ఉద్యోగులు సమ్మె చేస్తున్నారని, రాజకీయ అంశంపై సమ్మె చేసే హక్కు ప్రభుత్వ ఉద్యోగులకు లేదంటూ హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది రవికుమార్ ఇటీవల హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని విచారించి ఏపీఎన్‌జీవో, సీమాంధ్ర సెక్రటేరియట్ ఉద్యోగుల ఫోరం ప్రతినిధులకు నోటీసులు జారీ చేసిన ధర్మాసనం.. బుధవారం మరోసారి పిల్ ను విచారించింది.
విచారణ ప్రారంభం కాగానే తాము కౌంటర్లు దాఖలు చేసేందుకు సమయం కావాలని ఉద్యోగ సంఘాల తరఫు న్యాయవాదులు కోరారు. ప్రధాన న్యాయమూర్తి స్పందిస్తూ.. ‘మీపాటికి మీరు కౌంటర్లు దాఖలు చేస్తాం.. సమయం ఇవ్వండని అంటున్నారు. ఇంతకీ అసలు కేసేమిటో చెప్పండి.’ అని అన్నారు. ఏపీఎన్‌జీవోలు, సీమాంధ్ర సచివాలయ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి తెలిపారు. ఎందుకు సమ్మె చేస్తున్నారని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించగా.. తాము సమ్మె ఎందుకు చేస్తున్నామో, అందుకు దారితీసిన పరిస్థితులు ఏమిటో కౌంటర్‌లో చెబుతామని ఎన్‌జీవోల తరఫు న్యాయవాది చెప్పారు.
సమ్మె నోటీసును పరిశీలించిన చీఫ్ జస్టిస్.. ‘ఈ నోటీసును చూస్తుంటే ఉద్యోగపరమైన సమస్యల వల్ల సమ్మె చేయడం లేదని నాకు అర్థమవుతోంది. ఉద్యోగుల సమస్యల మీద తప్ప మిగిలిన అంశాలపై సమ్మె చేసే అధికారం మీకు లేదు కదా..?’ అని వ్యాఖ్యానించారు. తమది రిజిస్టర్డ్ బాడీ అని ఎన్‌జీవోల న్యాయవాది చెప్పగా, ‘రిజిస్టర్ కావచ్చు.. కాకపోవచ్చు. అది ఇక్కడ విషయం కాదు. సమ్మె చేసేం దుకు మీరు కార్మికులు కాదు. అలాంటప్పుడు మీకు సమ్మె చేసే ప్రాథమిక హక్కు ఎక్కడిది..? వెంటనే సమ్మెను విరమించండి’ అని జస్టిస్ సేన్‌గుప్తా అన్నారు.
గడువిస్తే పూర్తి వివరాలను కౌంటర్ల రూపంలో కోర్టు ముందుంచుతామన్న ఎన్‌జీవోల న్యాయవాది, సమ్మె భావవ్యక్తీకరణ హక్కులో భాగమని చెప్పారు. భావవ్యక్తీకరణా..! దానికీ సమ్మెకు ఏ మాత్రం సంబంధం లేదన్న ప్రధాన న్యాయమూర్తి, ప్రభుత్వ కార్యకలాపాలను ఎందుకు స్తంభింప చేస్తారని ప్రశ్నించారు. ఇదే సమయంలో రాష్ట్ర విభజనపై నిర్ణయం ఏదైనా తీసుకున్నారా..? లేదా..? పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ పొన్నం అశోక్‌గౌడ్‌ను ఆదేశించారు. సమ్మెను ఎదుర్కొనేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన ధర్మాసనం, విచారణను ఈ 26వ తేదీకి వాయిదా వేసింది.