'ఏపీ రాజధాని కోసం సింగపూర్ వెళ్తున్నాం'
కృష్ణా - గుంటూరు జిల్లాల మధ్యే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటు చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయని ఆ రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. మంగళవారం హైదరాబాద్లో మంత్రి పి.నారాయణ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ప్రపంచస్థాయిలో నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో రాజధాని నిర్మాణానికి డిజైన్ను రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఆ డిజైన్ ఆరు నెలలో పూర్తవుతుందని చెప్పారు. రాజధానిపై అధ్యాయనం కోసం ఈ నెలాఖరులో సింగపూర్ పయనమవుతున్నట్లు నారాయణ వెల్లడించారు.
రాజధాని నిర్మాణం నేపథ్యంలో తమ నగరాన్ని పరిశీలించాలని సింగపూర్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆహ్వానించిందని ఆయన ఈ సందర్బంగా గుర్తు చేశారు. అందులోభాగంగా సింగపూర్ నగరాన్ని పరిశీలించేందుకు ఈ నెలాఖరులో పయనమవుతున్నట్లు నారాయణ చెప్పారు. సాధారణ రాజధాని నిర్మాణానికి రూ. 94 వేల కోట్లు... అదే ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణానికి రూ. లక్షా యాభై వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధానికి 184 కిలోమీటర్ల పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు నారాయణ పేర్కొన్నారు.
In English AP govt team set to visit Singapore for AP capital