ఏపీ పోలీసులకున్న మంచి పేరు నిలబెట్టండి
Published Wed, Oct 16 2013 2:48 AM | Last Updated on Tue, Aug 21 2018 5:44 PM
వరంగల్ రూరల్, న్యూస్‌లైన్ : దేశంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులకున్న మంచి పేరును నిలబెట్టాలని అదనపు డీజీపీ (కోఆర్డినేషన్) వీకే సింగ్ అన్నారు. మంగళవారం మామునూర్ ఏపీఎస్పీ 4వ బెటాలియన్ శిక్షణ కేంద్రంలో కమాండెంట్ నటరాజు అధ్యక్షతన 265 మంది ఏపీఎస్పీ కానిస్టేబుళ్ల దీక్షంత్ పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. ఈ పరేడ్‌కు వీకే సింగ్ ముఖ్య అతిథిగా హాజరై కానిస్టేబుళ్ల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ శిక్షణ కాలంలో నేర్చుకున్న అంశాలు జీవితకాలం ఉపయోగపడతాయన్నారు. పోలీసు వ్యవస్థలో కానిస్టేబుళ్ల స్థాయి నుంచి అత్యున్నత స్థాయి వరకు అందరూ ఖాకీ బట్టలు ధరించడం గౌరవించదగ్గ విషయమన్నారు.
విధి నిర్వహణలో మంచి పేరు తెచ్చుకోవడంతో పాటు దేశానికి, రాష్ట్రానికి, తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకురావాలని కోరారు. రాష్ట్రంలో అల్లర్లు చెలరేగి, హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో వాటిని అదుపు చేసేందుకు ఏపీఎస్పీ ప్రత్యేక కీలక పాత్ర పోషిస్తుందనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. తొమ్మిది నెలల కఠోర శిక్షణ పూర్తి చేసుకొని విధులకు సిద్ధమైన కానిస్టేబుళ్ళకు ఆయన అభినందనలు తెలిపారు. శిక్షణ సమయంలో ప్రతిభ కనబరిచిన కానిస్టేబుళ్ళకు వీకే.సింగ్ ట్రోఫీలు అందజేశారు. బె స్ట్ ఇన్‌డోర్‌గా మనిపూరి శ్రీకాంత్, బెస్ట్ అవుట్‌డోర్‌గా మరియాల శివకుమార్, బెస్ట్ ఫైర్‌గా రాంచందర్, బెస్ట్ ఆల్‌రౌండర్‌గా కందుల లవరాజు, పరేడ్ కమాండర్‌గా రాంచందర్‌లు ట్రోఫీలు అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ రేంజ్ డీఐజీ డాక్టర్ కాంతారావు, అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్‌రావు, పోలీస్ శిక్షణ కళాశాల ప్రిన్సిపాల్ పరిమళ హననూతన్, వర్ధన్నపేట ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ సాంబశివరావు, బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ వై.రాంబాబు, పీవీ.హనుమంతరావు, ఏజీపీ నారాయణ, డాక్టర్ సునీల్, శారద, మామునూర్ డీఎస్పీ సురేష్‌కుమార్, సీఐ రణధీర్‌తో పాటు శిక్షణ పొందిన కానిస్టేబుళ్ళ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. దీక్షంత్ పాసింగ్ అవుట్ పరేడ్ సందర్భంగా కానిస్టేబుళ్లు ప్రదర్శించిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఏపీఎస్పీ కానిస్టేబుళ్లు తొమ్మిది గ్రూపులుగా విడిపోయి ప్రత్యేక అలంకరణలో ప్రదర్శించిన పరేడ్ మరింత ఆకర్షణగా నిలిచింది.
Advertisement