బ్యాలెట్ దాసులుగా మారిన బుల్లెట్ బాసులు
ఖాకీతో కమాండింగ్, లాఠీతో డిమాండింగ్ .... అలాంటి పోలీస్ బాసులు కూడా రాజకీయాల్లోకి వచ్చారు. పార్టీల కండువాలతో ప్రచారం చేశారు. కొందరు పార్టీల దాకా వస్తే, కొందరు ఎన్నికల దాకా వచ్చారు. గెలిచిన వారు మాత్రం ఒకరిద్దరే. మన రాష్ట్రంలో పోలీసు బాసుల నుంచి పాలిటీషియన్లుగా ఎదిగిన వారెవరో ఓ సారి చూద్దాం.
భాస్కర రావు: ఈ డీజీపీ గారు చంద్రబాబు నాయుడు హయాంలో ఒక రాజకీయ పార్టీని పెట్టేందుకు, ఒక సామాజిక వర్గం ప్రయోజనాలు కాపాడేందుకు భాస్కరరావు ప్రయత్నించారు. పార్టీని పెట్టడమూ జరిగింది. ఆ తరువాత కథ ముందుకు సాగలేదు. పార్టీ పరిష్కారం కాని కేసులా మిగిలిపోయింది. ప్రచారం ఎఫ్ ఐ ఆర్ దాకా కూడా రాలేదు. ఆఖరికి ప్రజలకు క్లోజ్ కావాల్సిన పార్టీ, కేసు క్లోజైనట్టు మూసుకుపోయింది.
ఆంజనేయరెడ్డి: కౌంటర్ ఇంటలిజెన్స్ లో ఉద్దండులైన ఆంజనేయ రెడ్డి గారు పాలిటిక్స్ లో మాత్రం రాణించలేకపోయారు. ప్రజారాజ్యం పార్టీలో చేరిన తరువాత ఆయనకు త్వరలోనే ఈ 'కేసు' లో దమ్ములేదని తేలిపోయింది. ఆ తరువాత పార్టీని వదిలి బయటకు వచ్చారు. అప్పట్నుంచీ వానప్రస్థమే! ఈ మధ్యే ఆయన బౌద్ధధర్మం, ప్రాణాయామం విషయంలో కొన్ని సభలు ఏర్పాటు చేశారు.
పేర్వారం రాములు: డిజీపీ పేర్వారం రాములు పోలీసు యూనిఫారం వదలగానే రాజకీయ యూనిఫారం వేసుకున్నారు. ముందు టీడీపీలో చేరారు. తరువాత తెలంగాణవాదిగా మారి టీఆర్ ఎస్ లో చేరారు. కేసీఆర్ ఒకటి రెండు ప్రెస్ కాన్ఫరెన్స్ లలో పేర్వారం రాములును చూపించారు. ఆ తరువాత తెలంగాణ భవన్ షోకేసులో పెట్టేశారు.
విజయరామారావు: పోలీసు బాసుల్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ విజయరామారావే. సీబీఐ డైరెక్టర్ గా పీవీ హయాంలో పనిచేసిన విజయరామారావు ఖైరతాబాద్ నుంచి 1999 లో పోటీ చేసి పి జనార్దన రెడ్డిని ఓడించారు. ఆ తరువాత రాష్ట్రంలో మంత్రిగా కూడా పనిచేశారు.
వి. దినేశ్ రెడ్డి: దినేశ్ రెడ్డి రాజకీయాల్లోకి రావడం ఎవరినీ పెద్దగా ఆశ్చర్యపడేలా చేయలేదు. ఆయన వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. గెలిస్తే ఆయన రాష్ట్రం నుంచి ఎంపీగా గెలిచిన తొలి పోలీసు ఆఫీసర్ కావచ్చు. మల్కాజ్ గిరిలో ప్రస్తుతం ఆయనకు బోలెడన్ని సానుకూలాలు ఉన్నాయని వినవస్తోంది.