పీపీపీ విధానంలో ఏపీ వైద్యసేవలు
త్వరలో అన్ని జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రులలో పీపీపీ విధానాన్ని అమలు చేస్తామని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. పారిశుద్ధ్యం, సెక్యూరిటీ, వైద్యపరీక్షల విభాగాలను ఔట్ సోర్సింగ్‌కు ఇస్తామని ఆయన చెప్పారు. ఖరీదైన వైద్య విభాగాన్ని కూడా ప్రైవేట్ సంస్థలకు అప్పగించేలా పీపీపీ విధానాన్ని ఆలోచిస్తున్నట్లు వివరించారు. ఏపీకి పోలియో రహిత రాష్ట్రంగా ప్రపంచ ఆరోగ్యసంస్థ అవార్డు వచ్చిందని, 2008లోనే ఏపీ పోలియో రహిత రాష్ట్రంగా గుర్తింపు పొందిందని ఆయన అన్నారు.
మెడికల్ కౌన్సెలింగ్పై తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని కామినేని శ్రీనివాస్ చెప్పారు. ఫీజులు పెంచాలని ప్రైవేట్ మెడికల్ కాలేజీ లు కోరుతున్నాయని, రెండు రోజుల్లో ఫీజులపై నిర్ణయం తీసుకుని మెడికల్ కౌన్సెలింగ్ తేదీలను ప్రకటిస్తామని ఆయన అన్నారు.
బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా వచ్చే నెలలో ఆంద్రప్రదేశ్లో పర్యటిస్తారని కామినేని శ్రీనివాస్ తెలిపారు. బీజేపీని సంస్థాగతంగా నిర్మాణం చేసుకుంటామని, బలమైన, గతంలో వివాద రహిత సీనియర్ నేతలను బీజేపీలో చేర్చుకుంటామని ఆయన అన్నారు. అమిత్ షాను పవన్ మర్యాదపూర్వకంగానే కలిశారని, జనసేన విలీనంపై ఎలాంటి చర్చ జరగలేదని చెప్పారు.