హోదా ముగిసిన అధ్యాయం: వెంకయ్య
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్య
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ముగిసిన అధ్యాయమని కేంద్ర సమాచార శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి మోసం జరుగుతుంటే ఎందుకు అడ్డుకోలేకపోయారని ప్రతిపక్ష నేతలను వెంకయ్య ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ విషయంలో ప్రస్తుతం ఉద్యమాలు చేస్తూ ప్రధాని మోదీని, తనను విమర్శిస్తున్న వారు రాష్ట్ర విభజన సమయంలో ఏం చేశారో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘రాష్ట్రాన్ని విభజిస్తున్నప్పుడు, ఏకపక్ష విభజన జరుగుతున్నప్పుడు వీళ్లందరూ ఎక్కడ ఉన్నారు. ఉద్యమించే వాళ్లందరూ ఆరోజు ఎక్కడున్నారు? ఏమి చేశారు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పిన తర్వాత కేంద్ర ప్రభుత్వాన్నిగానీ, రాష్ట్ర ప్రభుత్వాన్నిగానీ విమర్శిస్తే బాగుంటుంది. ఇది నా సలహా’ అని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
ప్రస్తుతం విమర్శలు చేసేవారు విభజన జరుగుతున్న సమయంలో అన్యాయాన్ని ఎలా ఎదుర్కున్నారో ప్రజలకు వివరిస్తే ఆ తర్వాత వారు చెప్పే మాటలకుగానీ, చేసే విమర్శలకు గానీ విశ్వసనీయత ఉంటుందన్నారు. ప్రధాన మంత్రి మోసం చేశారు, వెంకయ్యనాయుడు మోసం చేశారని చెప్పే వాళ్లందరూ ఆ రోజు పచ్చి మోసం జరుగుతున్నప్పుడు ఎక్కడ ఉన్నారో, పార్టీగా, వ్యక్తులుగా సంస్థలుగా ఏమి చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘పై పెచ్చు ఈ సమస్య (ప్రత్యేక హోదా) ఏదైతే ఉందో అది ముగిసిన అధ్యాయం. ఏపీకి కేంద్ర సహకారం అవసరం’ అన్నారు. ఒక్క హామీనైనా నెరవేర్చారా అని కొందరు ప్రశ్నలు వేస్తున్నారని, ఏపీకి కేంద్ర ప్రభుత్వం అందించే సాయం చూసే వాళ్లకు కనిపిస్తుందని వెంకయ్యనాయుడు వివరించారు.