మాటకోసం ప్రాణంతీసుకునే వాళ్లున్నారంటే విన్నాం.. కొన్ని చూశాం. ఇప్పుడు పరిస్థితి మారిందేమో.. అడగకపోయినా మాటిచ్చి, ఆశపెట్టి, పట్టపగలే అరచేతిలో స్వర్గం చూపించి వారే ప్రాణాలు తీసే పరిస్థితి కనిపిస్తోంది. ఇదేదో హత్యా ఘటనకు సంబంధించిన విషయం కాదు.. ఆంధ్ర రాజకీయ క్షేత్రంలో అధికార నేతలు వ్యవహరిస్తున్న తీరుతెన్నులు, ఆ నేతలందరికీ ఇంజిన్‌గా వ్యవహరిస్తూ జనాలే లక్ష్యంగా తొక్కించుకుంటూ ముందుకెళుతున్న ముఖ్యమంత్రి వైఖరి.
ప్రజలు ఆయనను పిలవలేదు. అయినా.. అనుభవం ఉందంటూ వెళ్లారు.. ఆదుకుంటానని కల్లబొల్లిమాటలు చెప్పారు. ఏ మూల వదల్లేదు.. ఏం సందూ విడిచిపెట్టలేదు. చిన్నపిల్లాడి నుంచి పండుముసలివరకు అందరికీ అంత చేస్తాం ఇంతచేస్తామంటూ చెప్పారు. ఇప్పుడవి చేయలేక పోలీసుల సహాయంతో ముందుకెళుతున్నారు. దాదాపు పోలీసులు, ఏపీ ప్రభుత్వం ఒక్కటైనా పరిస్థితి నెలకొంది. ఇంకా చెప్పాలంటే మెజార్టీని పక్కకు పెట్టి చివరకు పోలీసులనే నమ్ముకుని ప్రభుత్వం నడిపిస్తున్నారని కూడా ప్రజలంటున్నారు. ఇది సదరు ముఖ్యమంత్రికి ఇప్పటికే కలిగిన భయం తాలూకు స్పష్టమైన ఆనవం అని కుండబద్దలు కొడుతున్నారు.
ఇది రాజుల యుగం కాదు
పోలీసులంటే నిరంకుశత్వం. సర్కార్ ఏది చెబితే అదే చేస్తారు. నేరాలు, ఘోరాలు, శాంతిభద్రతలకు మాత్రమే ఉపయోగించాల్సిన పోలీసులను ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తూ ఉద్యమాలతో ముందుకెళుతున్న ప్రజాసమూహంపైన ప్రయోగిస్తున్నారు. ప్రజా అసంతృప్తిని అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనినే నిరంకుశపాలన అంటారు. భయం ఉన్నవాళ్లే నియంతలవుతారు. తిరుగుబాటు వస్తుందని గుర్తెరిగిన వారే ఉన్న కొద్దిరోజులైనా క్షేమంగా ఉందామని చివరి సిపాయి పోయిందాక నేను యుద్ధం చేయను అని రాజు వ్యవహరించినట్లుగా తాను చేస్తాడు. అయితే, దిగిపోవడం మాత్రం తథ్యం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోగానీ, మొత్తం భారత్‌లోగాని ఉంది రాజరిక పాలన కాదు.. ఇది రాజుల యుగంకాదు. ఎవరికైనా ఐదేళ్లలోనే మూడుతుంది. ప్రజల చేతుల్లో తప్పకుండా మాడు పగులుతుంది.
ఓట్లేసిన కొన్నాళ్లకే తిరుగుబాట్లు షురూ..
సాధారణంగా ఒకసారి అధికారంలోకి వచ్చాక తిరుగుబాట్లు ప్రతిపక్షాల నుంచే అధికార పక్షానికి ఎక్కువగా ఎదురవుతుంటాయి. కానీ, ఆంధ్రలో మాత్రం ఓటెసిన ప్రజలే అనతికాలంలో ముఖ్యమంత్రిపైకి తిరగబడేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యమంత్రి తీరుకు విసుగుచెంది బయటకొచ్చిన ఆందోళనలు లెక్కగడితే ఈ మూడెళ్లలో కొసదొరకని చాంతాడంత. ఇక అధికార నేతల, కార్యకర్తల దాడులు అయితే లెక్కేలేదు. మేమిలాగే ఉంటాం మేమింతే చేస్తాం.. ఐదేళ్లు మేం చెప్పినట్లు మీరు పడుండాల్సిందే అన్న చందాన ఏపీ ప్రభుత్వ పరిస్థితి తయారైంది.
సీఎం వరుస ప్రెస్‌మీట్లు..
సాధారణంగా ముఖ్యమంత్రి అత్యవసర సమయాల్లోనే ప్రెస్ మీట్లు పెడతారు. కానీ, ప్రతిపక్షంలోని చిన్న నేత స్పందించినా, ప్రజాసమూహంలోని ఓ విద్యావంతుడు ప్రశ్నించినా వెంటనే ఉలిక్కిపడుతుండటం ఏపీ ముఖ్యమంత్రిలో కనిపిస్తోంది. గతంలో మంత్రుల ప్రెస్‌మీట్లు పెట్టి డంబాలు పలుకుతుంటే ఇప్పుడు వారిని పక్కకు పెట్టేసి తానే ఏకంగా మైకు ముందు కూర్చుని మేకపోతూ గాంబీర్యం ప్రదర్శిస్తున్న పరిస్థితి. తప్పులు చేస్తున్నవారిలో ఇలాంటి పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. ఊ అంటే ఉలిక్కిపడే పరిస్థితి సదరు ముఖ్యమంత్రి ముఖంలో కనిపిస్తోంది. అనుభవం అని గౌరవించినందుకు ప్రజలను అవమానాలకు గురిచేస్తున్నారు.
అసహనం తెప్పించే చర్యలకు దిగుతున్నారు. ప్రతిపక్షం కదులుతుందంటే దానితో సమాంతరంగా అధికార దండు పోలీసులను వెంటేసుకొని కదులుతోంది. వాస్తవానికి సుపరిపాలన, ప్రజాభీష్టపాలన అందిస్తే ఇలాంటి పరిస్థితి ప్రభుత్వానికి ఉండదు. ప్రతిపక్షాలు చేసే ఆరోపణలు నిజంకాకుంటే అందులో ప్రజలే ఉండరు. కానీ, ఆంధ్రలో మాత్రం ప్రజలే ముందుంటున్నారు.. ప్రతిపక్షాలను తమతో రమ్మంటున్నారు. ఇదంతా ఏపీ ముఖ్యమంత్రిపై గూడుకట్టుకున్న అసంతృప్తికి తార్కాణం.
దగాపడిన జనాలు.. ధైర్యంగా ముందుకు
కాపులకు రిజర్వేషన్లన్నారు అది చేయలేక వారితో లడాయి పెట్టుకున్నారు. రైతులకు రుణాలమాఫీ అన్నారు వారికిటోపీ పెట్టారు. డ్వాక్రా గ్రూపులంటూ వారికి టోకరా వేశారు. ఇక చదువుకున్న యువతనైతే నిండా చెరువులో ముంచిన పరిస్థితి. రాజధాని ప్రాంతాల్లో భూములు కోల్పోయిన రైతుల పరిస్థితి మరింత విచారం. ఇప్పుడు ఎక్కడ చూసినా అధికార బెదిరింపులు.. దండుకునే దందాలు.. దబాయించే మాటలు. ఎంతో విద్యావంతులైన నేటి సమాజంలో ఇలాంటి పరిస్థితికి ప్రతిస్పందన రెప్పపాటులోనే వస్తుంది.
దీనిని అధికార పక్షం గుర్తించకుంటే అట్టడుగుకుపోయినట్లే. హామీల వైఫల్యం ప్రజలకు అంతగా కనిపించకపోయినా ఇప్పుడు ముఖ్యమంత్రిని తమ శత్రువుగా ప్రజలకు స్పష్టంగా చూపిస్తున్న అంశం ప్రత్యేక హోదా. దీని విషయంలో ప్రజలకు అండగా నిలవాల్సిన సదరు ముఖ్యమంత్రి కేంద్రంపై ఒక్క రాయి కూడా వేయకుండా పెద్దపెద్ద బండరాళ్లు ప్రజలపై వేస్తున్నారు. ప్రత్యేక హోదా ప్రశ్నించినవారందరినీ పిచ్చివాళ్లలా చూస్తున్నారు. దానితో పెద్దగా ఒరిగే ప్రయోజనం లేదని ప్యాకేజీ ముద్దని చూపేయత్నం చేస్తున్నారు. నిజానికి ప్రయోజనమే లేదని అనుకుంటే ప్రజలకు అదే ఇష్టం కాబట్టి అదే ఇవ్వమని చెప్పండి. ప్రజాభీష్టం లేనివి ముఖ్యమంత్రి అయినా, అంతకంటే పెద్ద హోదాలో ఉన్న వ్యక్తి అయినా ఎలా అమలుచేస్తారని మేధావులు చర్చించుకుంటున్నారు.
పోలీసులతో రాష్ట్రపాలన
తన లోపాలు, కష్టాల నుంచి గట్టెక్కేందుకు ముఖ్యమంత్రి దగ్గరుండి పోలీసు బలగాన్ని ప్రయోగిస్తున్నాడు. విశాఖలో ప్రత్యేక హోదాకోసం యువత చేస్తున్నశాంతియుత ర్యాలీలో ఇది స్పష్టమైంది. ఆయన పుణ్యమా అని సంపూర్ణ వ్యతిరేకత బయటకు వచ్చింది. ప్రతిపక్షాలు ఒక్కటయ్యాయి. ప్రతి ఒక్కరూ రోడ్డెక్కి ప్రశ్నించే పరిస్థితి ఏర్పడింది. ఇది నిజంగా అనుభవంతో కూడిన పాలనేనా అని జనాలు విస్తుపోతున్నారు. సామాన్యులైతే చుక్కలు చూస్తున్నారు. ఎట్టకేలకు ప్రత్యేక హోదా విషయంలో ప్రజలకు అడ్డంగా ఆంధ్ర ముఖ్యమంత్రి దొరికిపోయారు. అంతర్గత ఒప్పందాలతో చట్టపరమైన శిక్ష తప్పించుకున్నాడేమోగాని, ప్రజా క్షేత్రంలో తప్పించుకోవడం కష్టమే అంటూ ప్రజలు తెగేసి చెబుతున్నారు. ఇప్పటికే తనపై విశ్వాసం సన్నగిల్లిందని ముఖ్యమంత్రికి అర్థమైందని, అందుకే ఆ ఆక్రోశంతో పోలీసులను ఉపయోగిస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని అంటున్నారు. ఇప్పుడు ఎన్ని ఆందోళనలు చేసినా చివరి ఏడాదిలో ప్రజలను మాయ చేయొచ్చని ఆలోచనలో ఆయన ఉన్నట్లు, రాత్రికి రాత్రే ఓటర్లను మార్చేయగల నేతను తానని భావిస్తున్నట్లుందని ప్రజలు అంటున్నారు.
అయితే, ఓట్లకు అమ్ముడుపోయేతరం పోయిందని ఆంధ్రా ఓటర్లు తెగేసి చెబుతున్నారు. ప్రతిపక్షాల వెంట జనసునామీలై మారి కదులుతున్నారు. దీని ప్రకారం చంద్రబాబు అనుభవానికి కాలం చెల్లిందని స్పష్టమైనట్లేనని అంటున్నారు. ఏదీ ఏమైనా గతంలో మాదిరిగా కాకుండా ఈసారి అప్పుడే అధికారం పోతుందనే భయంతో బెదిరింపు రాజకీయాలకు దిగుతూ పోలీసుల సహాయంతో చక్రం తిప్పుతున్న ముఖ్యమంత్రిని, ఆయన మంత్రులను చూస్తుంటే ఓటుకు ఇంకా రెండేళ్లు ఆగాలా అన్నట్లు ఎదురుచూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
ఏపీ సీఎంకు ఓటమి భయం పట్టుకుందా!
Published Mon, Jan 30 2017 5:02 PM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM
Advertisement
Advertisement