రమ్య (ఫైల్)
సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరులో గత ఏడాది ఆగస్టు 15న జరిగిన బీటెక్ విద్యార్థిని నల్లపు రమ్య (20) హత్య కేసు తీర్పు శుక్రవారం వెలువడనుంది. తనను ప్రేమించడంలేదని వట్టిచెరుకూరు మండలం ముట్లూరుకు చెందిన కుంచాల శశికృష్ణ (19) ఉదయం 9.40కి టిఫిన్ తీసుకురావడం కోసం ఇంటి నుంచి బయటకు వచ్చిన రమ్యతో గొడవపడి కత్తితో ఎనిమిదిసార్లు పొడిచాడు. ప్రభుత్వాస్పత్రికి తరలించేలోగా రమ్య చనిపోయింది. ఈ హత్యను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. నిందితుడు శశికృష్ణను అదేరోజు రాత్రి నరసరావుపేట సమీపంలోని మొలకలూరులో అరెస్టు చేసిన పోలీసులు ఆరురోజుల్లో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. గుంటూరు ప్రత్యేక న్యాయస్థానంలో గత ఏడాది డిసెంబర్ ఏడు నుంచి సాక్షుల వాంగ్మూలం నమోదు చేశారు. ఈ నెల రెండున మొదలైన వాదనలు మంగళవారం ముగిశాయి. శుక్రవారం తీర్పు చెప్పనున్నట్లు న్యాయాధికారి రామ్‌గోపాల్ ప్రకటించారు.
రమ్య కుటుంబాన్ని ఆదుకున్న ప్రభుత్వం
హత్య జరిగిన రెండోరోజే సీఎం ప్రకటించిన ఎక్స్‌గ్రేషియా రూ.పది లక్షల్ని రమ్య తల్లి జ్యోతికి అప్పటి హోంమంత్రి సుచరిత అందించారు. ఆ కుటుంబానికి మూడునెలలపాటు నిత్యావసరాలకు నగదు ఇచ్చారు. అదేనెల 20వ తేదీకల్లా రమ్య తల్లికి నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద గుంటూరులో ఇంటిస్థలం పట్టా ఇచ్చారు. అనంతరం ప్రభుత్వం మరో రూ.8,25,000 అందజేసింది. ఇంటి నిర్మాణానికి రూ.1.8 లక్షలు ఇచ్చింది.
రమ్య సోదరి మౌనికకు సెప్టెంబర్ 16న రెవెన్యూ విభాగంలో ఉద్యోగం ఇచ్చింది. ఆమె ఐదేళ్లలోగా డిగ్రీ పూర్తిచేసుకునే అవకాశం కల్పించారు. వారు కోరిన విధంగా వారి సొంత గ్రామమైన అమృతలూరు మండలం యలవర్రులో రూ.1,61,25,300తో ఐదెకరాల పట్టా భూమి కొనుగోలు చేసి రమ్య తల్లి పేరున రిజిస్టర్ చేసింది. రమ్య హత్యకేసు విషయంలో ప్రభుత్వం స్పందించిన తీరు బావుందని జాతీయ ఎస్సీ కమిషన్ వైస్‌చైర్మన్ అరుణ్‌హల్దార్ కొనియాడారు. హత్య అనంతరం గుంటూరు వచ్చిన కమిషన్ బృందం.. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏపీ ప్రభుత్వం చాలా పాజిటివ్‌గా స్పందించిందని కొనియాడింది.
Comments
Please login to add a commentAdd a comment