ramya death
-
సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం
గుంటూరు ఈస్ట్: బిడ్డను కోల్పోయిన బాధలో ఉన్న మాకు.. కుటుంబసభ్యుడి కంటే ఎక్కువగా ఎంతో అండగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు రుణపడి ఉంటామని రమ్య తల్లి జ్యోతి కృతజ్ఞతలు తెలియజేశారు. రమ్యను హత్య చేసిన శశికృష్ణకు కోర్టు ఉరిశిక్ష విధించిన నేపథ్యంలో శనివారం గుంటూరులో ఆమె తల్లి జ్యోతి మీడియాతో మాట్లాడారు. ‘ఎంతో ముద్దుగా పెంచుకున్న బిడ్డను.. ఎవడో వచ్చి చంపేస్తే ఎలా ఉంటుందో మాకు తెలుసు. ఇలాంటి పరిస్థితిని భవిష్యత్‌లో తల్లిదండ్రులెవ్వరూ అనుభవించకూడదు. ఘటన జరిగినప్పటి నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాకు అండగా ఉన్నారు. మా కుటుంబం పక్షాన ఉండి, స్వయంగా మమ్మల్ని పిలిపించుకుని మాట్లాడటమే కాకుండా ఎప్పటికప్పుడు మా మంచి చెడ్డలు చూస్తూ ధైర్యం నింపారు. ఆర్థికంగానూ సాయం చేసి తన గొప్ప హృదయాన్ని చాటుకున్నారు. నా బిడ్డను చంపిన వ్యక్తికి ఉరి శిక్ష పడేలా చర్యలు తీసుకున్నందుకు ధన్యవాదాలు’ అని రమ్య తల్లి జ్యోతి పేర్కొన్నారు. మంత్రి మేరుగ పరామర్శ గుంటూరు నగరంపాలెంలోని రమ్య కుటుంబసభ్యులను మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, డొక్కా మాణిక్యవరప్రసాద్, జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీక్రిస్టినా, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ మందపాటి శేషగిరిరావు, మేయర్ కావటి మనోహర్‌నాయుడు, డిప్యూటీ మేయర్లు సజిల, వనమా బాలవజ్రబాబు పరామర్శించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండటానికి ప్రభుత్వం దిశ బిల్లును తీసుకొచ్చిందని మంత్రి మేరుగ పేర్కొన్నారు. దిశ యాప్ డౌన్లోడ్ చేసుకొని.. కష్ట సమయంలో వినియోగించాలని సూచించారు. టీడీపీ నాయకులు శవాల మీద పేలాలు ఏరుకునే తరహాలో ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. -
బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసు తీర్పు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరులో గత ఏడాది ఆగస్టు 15న జరిగిన బీటెక్ విద్యార్థిని నల్లపు రమ్య (20) హత్య కేసు తీర్పు శుక్రవారం వెలువడనుంది. తనను ప్రేమించడంలేదని వట్టిచెరుకూరు మండలం ముట్లూరుకు చెందిన కుంచాల శశికృష్ణ (19) ఉదయం 9.40కి టిఫిన్ తీసుకురావడం కోసం ఇంటి నుంచి బయటకు వచ్చిన రమ్యతో గొడవపడి కత్తితో ఎనిమిదిసార్లు పొడిచాడు. ప్రభుత్వాస్పత్రికి తరలించేలోగా రమ్య చనిపోయింది. ఈ హత్యను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. నిందితుడు శశికృష్ణను అదేరోజు రాత్రి నరసరావుపేట సమీపంలోని మొలకలూరులో అరెస్టు చేసిన పోలీసులు ఆరురోజుల్లో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. గుంటూరు ప్రత్యేక న్యాయస్థానంలో గత ఏడాది డిసెంబర్ ఏడు నుంచి సాక్షుల వాంగ్మూలం నమోదు చేశారు. ఈ నెల రెండున మొదలైన వాదనలు మంగళవారం ముగిశాయి. శుక్రవారం తీర్పు చెప్పనున్నట్లు న్యాయాధికారి రామ్‌గోపాల్ ప్రకటించారు. రమ్య కుటుంబాన్ని ఆదుకున్న ప్రభుత్వం హత్య జరిగిన రెండోరోజే సీఎం ప్రకటించిన ఎక్స్‌గ్రేషియా రూ.పది లక్షల్ని రమ్య తల్లి జ్యోతికి అప్పటి హోంమంత్రి సుచరిత అందించారు. ఆ కుటుంబానికి మూడునెలలపాటు నిత్యావసరాలకు నగదు ఇచ్చారు. అదేనెల 20వ తేదీకల్లా రమ్య తల్లికి నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద గుంటూరులో ఇంటిస్థలం పట్టా ఇచ్చారు. అనంతరం ప్రభుత్వం మరో రూ.8,25,000 అందజేసింది. ఇంటి నిర్మాణానికి రూ.1.8 లక్షలు ఇచ్చింది. రమ్య సోదరి మౌనికకు సెప్టెంబర్ 16న రెవెన్యూ విభాగంలో ఉద్యోగం ఇచ్చింది. ఆమె ఐదేళ్లలోగా డిగ్రీ పూర్తిచేసుకునే అవకాశం కల్పించారు. వారు కోరిన విధంగా వారి సొంత గ్రామమైన అమృతలూరు మండలం యలవర్రులో రూ.1,61,25,300తో ఐదెకరాల పట్టా భూమి కొనుగోలు చేసి రమ్య తల్లి పేరున రిజిస్టర్ చేసింది. రమ్య హత్యకేసు విషయంలో ప్రభుత్వం స్పందించిన తీరు బావుందని జాతీయ ఎస్సీ కమిషన్ వైస్‌చైర్మన్ అరుణ్‌హల్దార్ కొనియాడారు. హత్య అనంతరం గుంటూరు వచ్చిన కమిషన్ బృందం.. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏపీ ప్రభుత్వం చాలా పాజిటివ్‌గా స్పందించిందని కొనియాడింది. -
ఫ్రైడే బార్ లైసెన్స్ రద్దు!
సాక్షి, హైదరాబాద్: పంజగుట్టలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్నారి రమ్య మృతికి కారణమైన శ్రావెల్ మద్యం సేవించిన బార్ లెసైన్స్‌ను సస్పెండ్ చేయాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించినట్లు తెలిసింది. బంజారాహిల్స్ పోలీసుస్టేషన్ పరిధిలోని పంజగుట్ట స్మశాన వాటిక వద్ద ఈ నెల 1న జరిగిన ఈ ప్రమాదం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. (రమ్యని తాగేశారు) ప్రమాదం జరిగిన నాటికి నిందితుడు శ్రావెల్ వయస్సు 21 ఏళ్ళ కంటే తక్కువే ఉంది. దీంతో నిబంధనలకు విరుద్ధంగా అతడికి మద్యం సరఫరా చేసిన టీజీఐ ఫ్రైడే బార్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు విభాగం ఎక్సైజ్ శాఖకు సిఫార్సు చేసింది. ఈ మేరకు సదరు బార్‌కు ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ షోకాజ్ నోటీసు జారీ చేయగా, శనివారం బార్ యాజమాన్యం కమిషనరేట్‌కు వివరణ అందజేసింది. అయితే, ఆ వివరణకు సంతృప్తి చెందని కమిషనర్ సస్పెన్షన్‌కు నిర్ణయించినట్లు సమాచారం.