
న్యాక్ నాదే.. కాదు నాదే...
సాక్షి, హైదరాబాద్: జాతీయ నిర్మాణ అకాడమీ(నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్-న్యాక్) నాదంటే నాదే అంటూ ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు పోటాపోటీ చర్యలకు పాల్పడుతున్నాయి. ఈ విషయంలో ప్రస్తుతానికైతే తెలంగాణ ప్రభుత్వం పైచేయి సాధించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. న్యాక్ సొసైటీ చట్టం కింద రిజిష్టర్ అయింది. న్యాక్‌కు ఏపీ ముఖ్యమంత్రి చైర్మన్‌గా ఉంటారు. మిగతా డెరైక్టర్లను ముఖ్యమంత్రి నామినేట్ చేస్తారు. అయితే విభజన చట్టంలోని ఏ షెడ్యూల్‌లోనూ దీనిని చేర్చలేదు. దీంతో స్థానిక త ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం న్యాక్ డెరైక్టర్ జనరల్(డీజీ)గా ఆర్ అండ్ బీ ఈఎన్‌సీ భిక్షపతిని నియమించింది. ఆలస్యంగా మేలుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమూ న్యాక్ డెరైక్టర్ జన రల్‌గా రహదారులు-భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి శాంబాబ్‌ను నియమించింది. అయితే శాంబాబ్ బాధ్యతలు చేపట్టడానికి న్యాక్‌కు వెళ్లగా పోలీసులు అడ్డుకుని వెనక్కు పంపించేశారు. అప్పటినుంచి ఇరురాష్ట్రాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. న్యాక్‌కు చెందిన రికార్డులతోపాటు రూ.25 కోట్లు తెలంగాణ డెరైక్టర్ జనరల్ అధీనంలోకి వెళ్లిపోయాయి. అంతేగాక తెలంగాణ సీఎంకోసం ప్రత్యేకంగా రూ.40 లక్షల వ్యయంతో కార్యాలయం నిర్మాణాన్ని కూడా న్యాక్‌లో చేపట్టారు. సీఎం కే సీఆర్ సైతం పలుసార్లు అక్కడికెళ్లి ముఖ్యమైన అంశాలపై సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా గత రెండు నెలలుగా ఆంధ్రాకు చెందిన 374 న్యాక్ ఉద్యోగులకు జీతాలందట్లేదు. వీరంతా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నవారే. దసరా పండుగ సమయంలో ఆంధ్రా ఉద్యోగులు వేతనాలకోసం ఆందోళన చెందడంతో అడ్వాన్స్‌గా కొంత మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెల్లించింది. అయితే గత నెల వేతనాలను ఇంతవరకూ చెల్లించలేదు. దీనిపై న్యాక్‌కు చెందిన ఆంధ్రా అధికారులను వివరణ కోరగా న్యాక్ డబ్బులు తెలంగాణ డీజీ అధీనంలో ఉన్నాయని, రికార్డులూ ఆయన అధీనంలోనే ఉన్నందున వేతనాలు ఇవ్వట్లేదని తెలిపారు. మరోవైపు న్యాక్‌లో పనిచేస్తున్న ముగ్గురు డెరైక్టర్లను తెలంగాణ డీజీ రాజమండ్రి న్యాక్ యూనిట్‌కు బదిలీ చేశారు. అంతేగాక న్యాక్‌లో వారి కార్యాలయాలకు తాళాలు వేయించేశారు. రాజమండ్రిలో డెరైక్టర్ పోస్టులు లేనేలేవు. దీంతో రహదారులు-భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి శాంబాబ్ తెలంగాణ డీజీ చేసిన బదిలీలు చెల్లవంటూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులు అయితే రద్దు చేశారు తప్ప ఆ డెరైక్టర్లు న్యాక్‌కు వెళ్లి పనిచేసే పరిస్థితి లేదు. దీంతో వారు సచివాలయంలో తిరుగుతున్నారు. రాష్ట్ర విభజనకు ముందే అప్పటి న్యాక్ డెరైక్టర్ జనరల్ అగర్వాల్.. న్యాక్‌ను విభజించరాదని నాటిప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే అప్పటి సీఎస్ శ్రీకాకుళం నుంచి తెలంగాణ వరకు న్యాక్ కార్యకలాపాలు నిర్వహిస్తోందని, దీనిని పదవ షెడ్యూల్‌లో చేర్చాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాశారు. అయినా ఇంతవరకూ కేంద్రం నుంచి స్పందన లేదు.