
సాక్షి, పాలకొల్లు(పశ్చిమగోదావరి) : 'రాష్ట్రంలోఅవినీతి తారా స్థాయికి చేరింది. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవినీతిలో నెంబర్ వన్ స్థానంలో ఉంది. ప్రతీ పనిలోనూ అవినీతి. పిల్లలకు పెట్టే గుడ్లు, కందిపప్పు, పుస్తకాల్లోనూ అవినీతి జరుగుతుంది. ఇంతలా అవినీతి జరగటంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సీబీఐ అంటేనే భయపడుతున్నారు. తాను చేసిన అవినీతి అక్రమాలు ఎక్కడ బయటపడతాయోమోనని వణికి పోతున్నార'ని బీజేపీ తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త పురిగళ్ల రఘురాం ఆన్నారు.
మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రధాని మోదీ మంచివారని, దమ్మున్న ప్రధాని అని, రాష్ట్రానికి కావల్పినన్ని నిధులు ఇస్తున్నారని అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు అనడం నిజం కాదా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కంటే ఎక్కువ నిధులు ఇస్తున్నారని చెప్పింది మీరు కాదా అని నిప్పులు చెరిగారు. చంద్రబాబు తీరుతో విసిగిపోయిన కొందరు సీనియర్ తెలుగు దేశం నాయకులు పార్టీని వదలి వెళ్లిపోవాలని చూస్తున్నారని చెప్పారు.
ఎన్నికల్లో ఇచ్చిన 600 అబద్దపు హామీల్లో ఆరు హామీలనైనా నేరవేర్చలేని అసమర్ధ ప్రభుత్వం తెలుగు దేశం ప్రభుత్వం అని ఆయన విమర్శించారు. రైతుల కోసం కేంద్రం ప్రకటించిన 17 శాతం ఫసల్‌బీమా కూడా ఇవ్వకుండా అన్నదాతల పొట్టకొట్టిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజలు ఇన్ని సమస్యలతో సతమతమౌతుంటే చంద్రబాబు మాత్రం పక్క రాష్ట్రాల సీఎంలతో కలిసి ఫొటోలకు ఫోజులిస్తున్నారని ఎద్దేవా చేశారు. నోటిఫికేషన్లపై మాయమాటలు చెప్పి నిరుద్యోగ యువత జీవితాలతో అడుకుంటున్నారని రఘురాం విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment