ఇప్పుడు దేశంలో అందరి చూపు బీజేపీపైనే బీజేపీ ఏం చేస్తోంది, ఎలా చేస్తోంది. ఎలా ప్రజల అభిమానం చూరగొంటోందన్నదాని పైనే అందరి మథనం. బీజేపీని విమర్శించడమే లక్ష్యంగా కొందరు కుట్రలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఏపీలో చంద్రబాబు అందుకు నాయకత్వం వహించారు. దేశ వ్యాప్తంగా మోదీ ప్రభంజనం వీస్తున్నప్పటికీ... ధృతరాష్ట్రుడిలా దాన్ని చూడకుండా నానాయాగీ చేసి ఎన్నికల గోదాలో చతికిలపడ్డారు. కేంద్ర ప్రభుత్వ మద్దతుతో చేస్తున్న కార్యక్రమాలకు తన స్టిక్కర్లు వేసుకొని విర్రవీగిన చంద్రబాబుకు జనం కర్రుగాల్చి వాతపెట్టారు.
ఇదంతా కళ్ల ముందు కన్పిస్తున్న వాస్తవమైతే... కొందరు కమ్యూనిస్టు విశ్లేషకులు లేని పోని అపోహలను, అవాస్తవాలను ప్రచారం చేస్తూ బీజేపీపై బురదజల్లాలని చూస్తున్నారు. ‘బాబు భజనలో ఏపీ బీజేపీ’ అంటూ విశ్లేషణలు చేస్తూ... దేశంలోనూ, రాష్ట్రంలోనూ ప్రజలు ఇచ్చిన తీర్పును అభాసుపాలుజేస్తున్నారు. చంద్రబాబుకు బీజేపీ నేతలు కొమ్ముగాస్తున్నారంటూ పెడర్థాలు తీస్తున్నారు. అసలు చంద్రబాబుకు రాష్ట్ర బీజేపీ కొమ్ముగాయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు చంద్రబాబును బీజేపీ చంకన ఎత్తుకుంటుంది? బీజేపీని అనవసరంగా ప్రజల ముందు దోషిగా చూపించాలని ప్రయత్నం చేసిన వ్యక్తిని గత ఎన్నికల్లో ఓడించిన ఘనత పార్టీది. గత ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోరాడి... కమలం పార్టీ దయాదాక్షిణ్యాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు... ఎన్నికలకు ఏడాది ముందు.... బీజేపీపై విషం చిమ్మారు. ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షాలపై వైరం పెంచుకొని విషంకక్కారు. సాక్షాత్తూ తిరుమల సందర్శనకు వచ్చిన బీజేపీ చీఫ్‌పై రాళ్ల దాడి చేయించారు. ప్రధాని మోదీ రాష్ట్రానికి వస్తే నల్ల బెలూన్లు ఎగురేసి... తన పరువు తీసుకోవడమే కాక... రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చిన ఘనుడు చంద్రబాబు.
బీజేపీపై అడుగడుగునా దుష్ప్రచారం సాగించిన చంద్రబాబును పార్టీ ఎన్నటికీ క్షమించదు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్షీ్మనారాయణ జిల్లా పర్యటనల్లో ఉన్న సమయంలో అనంతపురం, ప్రకాశం జిల్లాలోనూ దాడి చేయించిన ఘటనలను పార్టీ ఎలా మర్చిపోతోంది. పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఇంటిపై రాళ్ల దాడి చేయించిన హీన చరిత్ర టీడీపీది. ఇవన్నీ తెలియకుండా బాబు భజన చేస్తోన్న బీజేపీ అంటూ విమర్శలు చేయడం హాస్యాస్పదం. గత ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలన్న ఉద్దేశం ఉన్నప్పటికీ... చంద్రబాబు దురాగతాలను క్షమించరాదన్న ఉద్దేశం పార్టీ ఓటర్లు, కార్యకర్తలు వైసీపీకి మద్దతుపలికారు. అంతేగానీ టీడీపీకి మద్దతిచ్చేలా ఎలాంటి నిర్ణయాలు బీజేపీ తీసుకోదు. వ్యవస్థలను నిర్వీర్యం చేసి... ప్రజాకాంక్షలను నీరుగార్చిన చంద్రబాబును భారతీయజనతా పార్టీ ఎన్నిటికీ క్షమించదు.
ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారన్నట్టుగా చంద్రబాబు పరిస్థితి క్రిస్టల్ క్లియర్‌గా కన్పిస్తుంటే... కమ్యూనిస్టు విశ్లేషకులు మాత్రం ఏపీ బీజేపీ చంద్రబాబును కాపాడుతుందంటూ ఘోరంగా విశ్లేషిస్తున్నారు. చంద్రబాబును కాపాడే యోచన బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి ఎంత మాత్రం లేదు. టీడీపీతో కలిసే యోచన భవిష్యత్‌లోనూ పార్టీకి లేనేలేదు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను మింగేసిన టీడీపీ నేతల అవినీతిని జగన్ సర్కారు రుజువు చేయాలి. అవినీతి అనకొండలా దోచేసుకున్న బాబు జమానాపై పూర్తి స్థాయి విచారణ చేయించాలి. చంద్రబాబు అవినీతిని బయటపెట్టాలని రాష్ట్ర బీజేపీ డిమాండ్ చేస్తోంది. అదే సమయంలో... రాష్ట్రంలో బీజేపీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. వైసీపీ ప్రజారంజక పాలన చేస్తే స్వాగతిస్తోంది. నవ్యాంధ్ర సమగ్ర అభివృద్ధికి విజన్ ప్రకారం బీజేపీ సహకారం అందిస్తుంది. అదే సమయంలో ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై సూచనలు చేస్తోంది. విమర్శిస్తోంది. శృతిమించే నిర్ణయాలుంటే పోరాటానికి బీజేపీ ఎప్పుడూ సిద్ధమే.
వ్యాసకర్త : రఘురామ్, బీజేపీ సమన్వయకర్త
ఈ–మెయిల్ : raghuram.bjp@gmail.com
Comments
Please login to add a commentAdd a comment