సాక్షి, నల్లగొండ: అంగన్‌వాడీలు మరింత బలోపేతం కానున్నాయి. అంతేగాక వాటి సేవలు మెరుగుపడనున్నాయి. చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు మరింత పోషక విలువలు కలిగిన ఆహారం అందనుంది. తద్వారా చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించవచ్చని భావిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించి జీఓ విడుదల చేసింది. అంతేగాక కార్యకర్తలకు, ఆయాలకు గౌరవ వేతనాన్ని పెంచారు. జిల్లాలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో మొత్తం 18 ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 3,664 ప్రధాన, 162 మినీ అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల్లో ఆరు నెలల నుంచి మూడేళ్ల వయస్సు గల చిన్నారులు 80వేల మంది నమోదయ్యారు. మొత్తం 1.72 లక్షల మంది చిన్నారులు, గర్భిణీలు, బాలింతలు ఉన్నారు. వీరందరికీ ఇకపై మరింత పౌష్టికాహారం అందజేస్తారు.
మెనూ ఇదీ...
ఆరు నెలల నుంచి మూడేళ్లలోపు చిన్నారులకు నిత్యం ఇకపై 100 గ్రాముల చొప్పున పౌష్టికాహారం అందజేస్తారు. ఇప్పటివరకు చిన్నారులకు వారానికి రెండుసార్లు గుడ్లు అందజేసేవారు. ఇకపై నెలకు 16 కోడిగుడ్లు ఇస్తారు. మూడునుంచి ఆరేళ్ల చిన్నారులకు భోజనం వండిపెడతారు. ఇందుకు ఒక్కో చిన్నారికి 75గ్రాముల బియ్యం, 15 గ్రాముల కందిపప్పు, 25గ్రాముల కూరగాయలు, 5 గ్రాముల నూనె వాడతారు. రోజుకు 15 గ్రాముల శనగలు అందజేస్తారు. అంతేగాక పోషకాలు లోపించిన చిన్నారులకు రూ 50 విలువజేసే పాలపొడి అందజేస్తారు. గర్భిణీ, బాలింతలకు కూడా మెనూ మారింది. వారికి నెలకు 3 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, అర లీటరు వంటనూనె పంపిణీ చేస్తారు. అంతేగాక నెలకు 16గుడ్లు అందజేస్తారు.
పనివేళల్లో మార్పు...
అంగన్‌వాడీలను బలోపేతం చేయడానికి వాటి పనివేళల్లో మార్పు తెచ్చారు. ఇప్పటివరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు కొనసాగేవి. అదికూడా సక్రమంగా జరగకపోయేవి. దీంతో చిన్నారులను కేంద్రాలకు పంపేందుకు తల్లిదండ్రులు వెనకడుగు వేశారు. ఈ నేపథ్యంలో అంగన్‌వాడీ కేంద్రాల పనివేళలు మార్చారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విధిగా కొనసాగించాల్సిందే.
పెరిగిన గౌరవ వేత నం...
అంగన్‌వాడీ పనివేళలు పెరిగిన నేపథ్యంలో కార్యకర్తలు, ఆయాలు తమ విధులకు అధిక సమయం వెచ్చించాల్సి ఉంటుంది. అంతేగాక గతంకంటే పనిభారం కూడా పెరుగుతుంది. ఈ దృష్ట్యా వీరి గౌరవ వేతనాన్ని ప్రభుత్వం పెంచింది. కార్యకర్తలకు ఇప్పటివరకు రూ 3700 చెల్లిస్తున్నారు. వారి వేతనం ఇప్పుడు రూ 500 పెంచింది. కార్యకర్తలకు రూ 1950 ఇస్తుండగా.. ప్రస్తుతం రూ 250 పెంచింది.
అంగన్‌వాడీ సేవలు మరింత మెరుగు
Published Sat, Nov 9 2013 4:02 AM | Last Updated on Wed, Sep 19 2018 8:32 PM
Advertisement
Advertisement