నీరసం వీడని ‘ఆరోగ్యలక్ష్మి’
అందని కొత్త మెనూ
సాక్షి, హైదరాబాద్: ‘ఆరోగ్యలక్ష్మి’ నీరసించిపోతోంది. పరిపుష్టం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా ఆచరణకు నోచుకోవడంలేదు. ఆరోగ్యలక్ష్మి మెనూ పెంపునకు సంబంధించిన సర్క్యూలర్ ఉన్నతస్థాయి నుంచి అంగన్‌వాడీలకు అందాల్సి ఉంది. బాలింతలు, గర్భిణులకు తగిన పోషకాహారం అందించడం ఆరోగ్యలక్ష్మి ఉద్దేశం. ప్రస్తుతం రోజుకు రూ.15 విలువైన పోషకాహారం మాత్రమే ఇస్తున్నారు.
ఈ మెనూ సరిపోవడంలేదని భావించిన ప్రభుత్వం జూన్ 2వ తేదీ నుంచి ప్రతిరోజూ రూ.21 విలువైన ఆహారాన్ని అందించాలని జూన్ ఒకటో తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఆహార పదార్థాలను ఇంటికి ఇచ్చే విధానానికి స్వస్తి పలికి, అంగన్‌వాడీల్లోనే ఒక పూట పోషకాహారాన్ని తప్పనిసరిగా లబ్ధిదారులకు అందించాలి. లబ్ధిదారులకు రోజువారీ ఇచ్చే ఆహారంలో ఆకుకూర పప్పు, కూరగాయలతో సాంబారు, ఒక గుడ్డు, 200 మిల్లీలీటర్లు పాలు అంగన్‌వాడీ కేంద్రాల్లోనే అందించే విధంగా సర్కారు కొత్త మెనూను రూపొందించింది.
ఒకపూట పూర్తి భోజనంతోపాటు ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు ఇప్పించడం, శిశువులకు వ్యాధి నిరోధక టీకాలు ఇప్పించడం తదితర కార్యక్రమాల పర్యవేక్షణను కూడా అంగన్‌వాడీ కేంద్రాలకే సర్కారు అప్పగించింది. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని మొత్తం 5.18 లక్షల మందికి వారానికి ఆరురోజులపాటు సమృద్ధిగా పోషకాహారం ఇవ్వాలి.
‘ఆరోగ్యలక్ష్మి’ ద్వారా లబ్ధిదారులకు కొత్త మెనూను అమలు చేయాలని అన్ని జిల్లాల సమగ్ర శిశు అభివద్ధి సేవాకేంద్రాల(ఐసీడీఎస్) సిబ్బందికి మహిళా శిశు సంక్షేమ విభాగం డెరైక్టర్ సర్క్యులర్ పంపాల్సి ఉంది. డెరైక్టర్ సెలవులో ఉండడం, ఇన్‌చార్జి డెరైక్టర్‌కు పని భారం అధికంగా ఉండడంతో సకాలంలో సర్కులర్ జారీ కాలేదని ఆ విభాగం సిబ్బంది చెబుతున్నారు.