
తిరుమలలో అన్నదానానికి 30 ఏళ్లు
చిత్తూరు: తిరుమల క్షేత్రంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని మహాయజ్ఞంలా నిర్వహిస్తామని టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు అన్నారు. 1985, ఏప్రిల్ 6న రోజుకు రెండు వేల మందితో అన్నదాన కార్యక్రమం ప్రారంభం కాగా... అది నేటితో 30 ఏళ్లు పూర్తి చేసుకుందని తెలిపారు.
ఆదివారం తిరుమలలోని తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన భవనంలో ఈవో సాంబశివరావు విలేకరులతో మాట్లాడారు. అన్నదాన కార్యక్రమం 30 ఏళ్లుగా భక్తుల ఆకలి తీర్చిందన్నారు. రోజుకు 45 వేలు, వారాంతంలో రోజుకు 55 వేలు, పర్వదినాల్లో లక్ష మంది భక్తులకు అన్నప్రసాదాలు అందిస్తున్నట్టు తెలిపారు. తిరుమల, తిరుపతి, తిరుచానూరులో రోజుకు 1.16 లక్షల నుంచి 1.42 లక్షల మందికి అన్నప్రసాదాలు అందిస్తున్నట్టు వెల్లడించారు. 3.6 లక్షల మంది దాతలు ఇచ్చిన రూ.591.36 కోట్ల విరాళాలపై వచ్చే రూ.40 కోట్ల వడ్డీతోపాటు, టీటీడీ రూ.30 కోట్ల గ్రాంట్ కలుపుకుని ఏడాదికి రూ.70 కోట్ల ఖర్చుతో నిత్యాన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఇకపై భక్తులకు అందించే ఆహార పదార్థాల నాణ్యతపై మరింత దృష్టి సారిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో డెప్యూటీ ఈవోలు వేణుగోపాల్, రమణ, సరోజిని, పీఆర్‌వో రవి తదితరులు పాల్గొన్నారు.