- విద్యుత్ పరికరాల వినియోగంలో లక్షలు స్వాహా
- డీపీడబ్ల్యూ స్టోర్స్‌లో కీలక రికార్డులు మాయం
- 30 ఏళ్లుగా రూ.కోట్లలో అక్రమాలు
- మూడు దశాబ్దాలుగా నామమాత్రపు ఆడిట్
తిరుపతి సిటీ : తిరుమల తిరుపతి దేవస్థానంలో సంచలనం సృష్టించిన ఆర్జిత కుంభకోణం మరువకముందే తాజాగా సోమవారం విద్యుత్ విభాగంలో మరో అవినీతి బాగోతం వెలుగుచూసింది. 30 ఏళ్లుగా డీపీడబ్ల్యూ స్టోర్‌లో విద్యుత్ పరికరాల లావాదేవీల్లో రూ.లక్షలు స్వాహా చేసినట్లు అధికారులు గుర్తించారు. నిజాయితీ కలిగిన ఉద్యోగికి స్టోర్స్ ఇన్‌చార్జిగా అవకాశం రావడంతో దశాబ్దాలకాలంగా జరుగుతున్న అక్రమాలు బయటపడినట్లు ఉద్యోగులు చెబుతున్నారు.
ఈ వ్యవహారంపై వారం రోజులుగా విచారణ జరుగుతున్నా విద్యుత్ ఉన్నతాధికారి ఒకరు విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ము ఖ్యంగా టీటీడీ విజిలెన్స్‌కు సమాచారం చేరకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నా రు. కీలక రికార్డులను కూడా మాయం చేశారు. పైగా రికార్డుల పరిశీలనకు గు ట్టుచప్పుడు కాకుండా ఇతర విభాగాల నుంచి ఐదుగురిని డెప్యుటేషన్‌పై స్టోర్స్‌కు తీసుకున్నారు.
అలిపిరి లింక్ బస్‌స్టేషన్‌కు ఎదురు గా ఉన్న టీటీడీ డీపీడబ్ల్యూ స్టోర్స్ నుంచి దేవస్థానానికి అవసరమైన విద్యుత్ పరికరాలు సరఫరా అవుతాయి. ఇక్కడ చిన్న స్విచ్ నుంచి పెద్దపెద్ద జనరేటర్స్ వరకు అందుబాటులో ఉంటాయి. టీటీడీ నూతనంగా నిర్మించే పాత భవనాలకు, క్యూకాంప్లెక్స్‌లకు, యాత్రికుల వసతి సముదాయాలకు, గదులకు, గెస్ట్‌హౌస్‌లకు ఈ స్టోర్స్ నుంచే సంబంధిత అధికారి ఓచర్ రాయించి సంతకం చేసి తీసుకోవాల్సి ఉంటుంది.
మార్చిన పాత పరికరాలకు సైతం ఓచరు నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కలను ఏడాదికి ఒకసారి సరిచూసి ఆడిట్‌కు పంపాలి. అయితే 30 ఏళ్లుగా అధికారుల స్థాయి నుంచి ఉద్యోగుల వరకు ఇష్టారాజ్యంగా అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. ఇన్నేళ్లుగా జరుగుతున్న అక్రమాలను గుర్తించకుండానే ఆడిట్ అధికారులు పద్దులకు గ్రీన్ సిగ్నల్ ఎలా ఇచ్చారనేది మరో వాదన. మొత్తం మీద ఆర్జిత కుంభకోణం తరహాలో ఈ వ్యవహారాన్ని కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు ఇస్తే తప్ప తేలదని పలువురు చర్చించుకుంటున్నారు.
50 మందిపై వేటుకు అవకాశం
ఈ వ్యవహారంలో దాదాపు 50 మంది పాత్ర ఉన్నట్లు సమాచారం. ఈ విభాగంలో మూడు దశాబ్దాలు వివిధ స్థాయిలలో పనిచేసి పదవీ విరమణ పొందిన వారితోపాటు సర్వీసులో ఉన్న వారు ఉన్నట్లు తెలుస్తోంది. అక్రమార్కుల్లో రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు కాజేసిన వారు పది మంది ఉండగా, రూ.30 లక్షల వరకు స్వాహా చేసిన వారిలో 40 మంది ఉన్నట్లు తెలిసింది.
ఈ కుంభకోణంలో దేవుడి సొమ్ము రూ.3 నుంచి 5 కోట్ల మేరకు దుర్వినియోగమైనట్లు ప్రాథమికంగా గుర్తిం చినట్లు సమాచారం.
ఈ విషయాన్ని టీటీడీ జేఈవో, ఈవో స్థాయికి పోకుండానే రికవరీ చేయాలనే యోచనలో అధికారులు ఉన్నట్లు తెలిసింది. ఏడాదిన్నర క్రితం పదవీ విరమణ పొందినా ఈ అక్రమాల కారణంగా ఇప్పటికీ కొందరికి సెటిల్‌మెంట్ పూర్తి చేయకుండా, పెన్షన్ మంజూరు చేయకుండా తిప్పుతున్నట్లు సమాచారం. వీరిలో కొందరు ఆమ్యామ్యాలతో సెటిల్‌మెంట్ పొంది దర్జాగా పెన్షన్ పొందుతున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని బయటపెట్టిన స్టోర్స్ ఇన్‌చార్జి(ఎలక్ట్రికల్)ని ఆ స్థానం నుంచి ఎలాగైనా బదిలీ చేయించి, విచారణకు ఇంతటితో పుల్‌స్టాప్ పెట్టించేందుకు పైరవీలు ప్రారంభమైనట్లు సమాచారం.
దర్శనాలకే విజిలెన్స్ ప్రాధాన్యం
శ్రీనివాసునికి ప్రధాన కాపాలదారులైన విజిలెన్స్ విభాగం తమకు కావాల్సిన వారికి దర్శనాలు చేయించుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు విమర్శలు వినబడుతున్నాయి. అందుకే సంవత్సరాల తరబడి అక్రమాలు జరుగుతున్నా గుర్తించలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
నా దృష్టికి రాలేదు
డీపీడబ్ల్యూ స్టోర్స్‌లో అవినీతి విషయం ఇంకా నా నోటీసుకు రాలేదు. వస్తే విచారణ జరిపి, సంబంధిత బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.
-పోలా భాస్కర్, టీటీడీ జేఈవో
అక్రమాలు అంత మొత్తంలో లేవు
డీపీడబ్ల్యూ స్టోర్స్‌లో అక్రమాలు అంత మొత్తంలో లేవు. కొంతవరకు ఉండొచ్చు. అది కూడా ఓచర్లను ఎప్పటికప్పుడు రౌండప్ చేసుకోకపోవడం వల్లే సమస్య వచ్చింది.
-వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్, టీటీడీ విద్యుత్ విభాగం