రాయపాటికి మళ్లీ ఆశాభంగమే
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి ఛైర్మన్ పదవిని జీవితంలో ఒక్కసారైనా దక్కించుకోవాలని ఎదురుచూసిన రాయపాటి సాంబశివరావుకు మరోసారి ఆశాభంగం తప్పేలా లేదు. టీటీడీ ఛైర్మన్ పదవిని తన అనుంగు సహచరుడు, సొంత జిల్లాకు చెందిన నేత చదలవాడ కృష్ణమూర్తికి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నట్లు తెలిసిందే.
టీటీడీ ఛైర్మన్ పదవి తనకే ఇవ్వాలంటూ నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంతకుముందు చంద్రబాబును కోరారు. తాను సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్నానని, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి టీటీడీ ఛైర్మన్గా ఒక్కసారైనా పని చేయాలన్నది తన జీవితాశయమని, అయితే ఆ కోరిక ఇంతవరకూ నెరవేరలేదని ఆయన వివరించారు. ఆ ఒక్క కోరికను తీరిస్తే తానిక ఏమీ కోరబోనన్నారు. సుదీర్ఘకాలం తాను కాంగ్రెస్లో కొనసాగినా, స్థానిక, గ్రూపు రాజకీయాల వల్ల ఆ పదవి చేపట్టలేకపోయానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలెలా ఉంటాయో మీకు కూడా తెలుసని రాయపాటి చెప్పారు. (చదవండి: అది నా జీవితాశయం.. నాకే ఇవ్వండి)
అయితే, గత ఎన్నికల సమయంలో తిరుపతి అసెంబ్లీ సీటు ఆశించిన మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తికి టీటీడీ ఛైర్మన్ పదవి ఇస్తానని బాబు అప్పుడే హామీ ఇవ్వడంతో దానికే ఇప్పుడూ కట్టుబడి ఆయనకే ఆ పదవి కట్టబెడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో చిరకాలంగా ఈ పదవి మీద ఆశ పెట్టుకున్న రాయపాటి మరోసారి తీవ్ర ఆశాభంగానికి గురయ్యారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా తనకు దక్కుతుందనుకున్న టీటీడీ ఛైర్మన్ పదవి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన నాయకుడు కనుమూరి బాపిరాజుకు దక్కడంతో అప్పట్లోనే ఆయన పార్టీ వీడాలనుకున్నారు. తర్వాతి పరిణామాలలో రాష్ట్ర విభజన తర్వాత ఆయన తెలుగుదేశంలో చేరారు. అయితే ఇక్కడ కూడా ఆయనకు ఆశాభంగం తప్పలేదు.