మురళీ మోహనుడికే.......!
సినీనటుడు, రాజమండ్రి ఎంపీ మురళీ మోహన్ మీద కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడితో పాటు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కరుణా కటాక్ష వీక్షణాలు ప్రసరించినట్లున్నాయి. టీటీడీ ఛైర్మన్ పదవికి మురళీమోహన్ పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ప్రతిష్ఠాత్మక టీటీడీ ఛైర్మన్ పదవి రేసులోకి వెళ్లిన మురళీ మోహన్... ఈ పదవి కోసం పట్టువదలని విక్రమార్కులు చాలామందే ఉన్నా, వాళ్లందరినీ పక్కకు తోసి ముందు వరుసలో నిలిచారట. రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ రాష్ట్రంలోని అని దేవాలయాల పాలకమండళ్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. కాగా మురళీ మోహన్ నియామకంపై మరో రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం.
చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడుగా ముద్రపడిన మురళీమోహన్ టీటీడీ చైర్మన్ పదవిపై మక్కువ పెంచుకున్న విషయం తెలిసిందే. ఇటీవల 75వ జన్మదినం సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన తన మనసులోని మాటను బయటకు వెల్లడించారు. ఇందు కోసం మురళీమోహన్ ...బాబుపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం.
ఇక పాలక మండళ్లు రద్దు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయటమే ఆలస్యం ఆశావహులు పైరవీలు మొదలుపెట్టారు. ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వని నేపథ్యంలో టీటీడీ చైర్మన్ పదవి ఇస్తానంటూ రాతపూర్వకంగా చంద్రబాబు తనకు హామీ ఇచ్చారని మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి ఎప్పటి నుంచో చెబుతున్నారు. స్థానికుడైన తనకే పదవి ఖాయమని ఇప్పటివరకూ ధీమాలో ఉన్నారు. దాంతో మురళీమోహన్, చదలవాడ మధ్యే గట్టి పోటీ నెలకొంది.
కాగా ఇటీవలి ఎన్నికల్లో ఓడిపోయిన గాలి ముద్దుకృష్ణమనాయుడు పార్టీ కోసం పనిచేసిన తనకే ఆ పదవి దక్కుతుందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు భంగపడి.... టీటీడీ ఛైర్మన్ పదవి ఇస్తానంటేనే టీడీపీలో చేరానని.. జీవితంలో ఒక్కసారైనా ఆ పదవి దక్కించుకోవాలని ఎదురుచూసిన రాయపాటి సాంబశివరావుకు మరోసారి ఆశాభంగం తప్పేలా లేదు. ఇక టీటీడీ పాలక మండలి అధ్యక్ష పదవి స్థానికులకు దక్కుతుందా? స్థానికేతరులు చేజిక్కించుకుంటారా? అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. మరో రెండు రోజులు వేచి చూస్తే కానీ.. వెంకన్న, బాబుల కరుణ ఎవరికి దక్కిందో కచ్చితంగా తేలదు.