అది నా జీవితాశయం.... నాకే ఇవ్వండి
టీటీడీ ఛైర్మన్ పదవి ప్రస్తుతం హాట్ సీటుగా మారింది. స్వామివారికి సేవ చేసేందుకు అవకాశం ఇవ్వాలంటూ ప్రజాప్రతినిధులు, మాజీలు క్యూ కుడుతున్నారు. ఇందుకోసం తమవంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కాగా ఎప్పటి నుంచో టీటీడీ ఛైర్మన్ పదవిపై గంపెడు ఆశలు పెట్టుకున్న ఎంపీ రాయపాటి ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటున్నారు.
ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ పదవి తనకే ఇవ్వాలంటూ నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు.... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరారు. సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో కొనసాగుతున్నానని, కాంగ్రెస్ లో ఉన్నప్పటి నుంచి టీటీడీ ఛైర్మన్గా ఒక్కసారైనా పని చేయాలన్నది తన జీవితాశయమని, అయితే ఆ కోరిక ఇంతవరకూ నెరవేరలేదని ఇటీవల ఆయన బాబును కలిసి వివరించారు. ఆ ఒక్క కోరికను తీర్చితే తానిక ఏమీ కోరబోనన్నారు. సుదీర్ఘకాలం తాను కాంగ్రెస్ లో కొనసాగినా, స్థానిక, గ్రూపు రాజకీయాల వల్ల ఆ పదవి చేపట్టలేకపోయానని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలెలా ఉంటాయో మీకు కూడా తెలుసని రాయపాటి చెప్పటంతో ఏకీభవించిన బాబు టీటీడీ ఛైర్మన్ పదవి ఇస్తానని హామీఇచ్చినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా గత ఎన్నికల సమయంలో తిరుపతి అసెంబ్లీ సీటు ఆశించిన మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తికి టీటీడీ ఛైర్మన్ పదవి ఇస్తానని బాబు గతంలో రాతపూర్వకంగా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
దాంతో ఆ హామీని అమలు చేయాలని చదలవాడ ఇప్పుడు పట్టుబడుతున్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమనాయుడు సైతం ఈ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఇక సుదీర్ఘకాలంగా పార్టీకి సేవ చేస్తున్నా ఎలాంటి అధికారిక పదవి అనుభవించలేదని, అందువల్ల చైర్మన్ పదవి తనకివ్వాలని నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్ర యాదవ్ కోరారు. పనిలో పనిగా తనకు వీలుకాకుంటే తన సోదరుడు బీద మస్తాన్రావుకైనా ఇవ్వాలన్నారు.
ఇక దేవాదాయ శాఖ మంత్రి పదవి బీజేపీకి దక్కింది కాబట్టి.... టీటీడీ ఛైర్మన్ పదవికి తమకే ఇవ్వాలని టీడీపీ పట్టుబడుతోంది. ఇక ప్రస్తుత టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు కూడా మళ్లీ తనకే అవకాశం ఇవ్వాలని మంతనాలు జరుపుతున్నారు. మరి వెంకన్న స్వామి ఎవరిని కరుణిస్తాడో చూడాలి.