ప్రొద్దుటూరు టౌన్ : ప్రొద్దుటూరు తాగునీటి అవసరాల కొరకు మరో టీఎంసీ నీటిని అవుకు జలాశయం నుంచి మైలవరానికి విడుదల చేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు....
ప్రొద్దుటూరు టౌన్ : ప్రొద్దుటూరు తాగునీటి అవసరాల కొరకు మరో టీఎంసీ నీటిని అవుకు జలాశయం నుంచి మైలవరానికి విడుదల చేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మల్లేల లింగారెడ్డి భారీ నీటి పారుదల శాఖామంత్రి దేవినేని ఉమను కలిసి విన్నవించారు. మంగళవారం హైదరాబాదులో మంత్రిని కలిసిన ఆయన గతంలో తాగునీటి అవసరాల గురించి అవుకు రిజర్వాయరు నుంచి 2 టీఎంసీలు మైలవరానికి వదిలి అక్కడి నుంచి ప్రొద్దుటూరుకు నీరు వదలాలని కోరినట్లు వివరించారు.
ఈ మేరకు ఇప్పటివరకు అవుకు నుంచి మైలవరానికి 1 టీఎంసీ నీరు విడుదల చేశారని తెలిపారు. ఇందులో 0.60 టీఎంసీల నీరు వచ్చినట్లు తెలిపారు. కాగా 0.30 టీఎంసీల నీరు మైలవరం దక్షిణ కాలువ ద్వారా ప్రొద్దుటూరుకు వదులుతున్నారని వివరించారు. మరో టీఎంసీ నీటిని విడుదల చేయాలని కోరారు. దీనిపై కర్నూలు సీఈని మరొక టీఎంసీ నీరు విడుదలచేయాలని మంత్రి ఆదేశించినట్లు తెలిపారు. ఇందులో 0.80 టీఎంసీల నీటిని ప్రొద్దుటూరు తాగునీటి అవసరాల కొరకు నిల్వ ఉంచాలని తెలిపారు. ఈ నీరు ఎప్పుడు అవసరమైతే అప్పుడు వదలాలని సీఈని మంత్రి ఆదేశించినట్లు లింగారెడ్డి తెలిపారు.