కిడ్నాప్‌నకు యత్నిస్తుండగా పట్టివేత
అనంతపురం క్రైం, న్యూస్‌లైన్: ఉన్నతాధికారి తరఫుల రుణాల వసూలుకు వెళ్లిన జిల్లాకు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు శంషాబాద్‌లో పోలీసులకు పట్టుబడినట్లు టీవీ చానళ్లలో కథనాలు ప్రసారమయ్యాయి. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. అనంతపురం జిల్లాలో గతంలో ఉన్నత స్థాయిలో పని చేసిన ఓ అధికారి ఓ చిరుద్యోగిని మధ్యవర్తిగా ఉంచుకుని శంషాబాద్‌కు చెందిన వ్యక్తికి భారీ మొత్తంలో రుణం ఇచ్చాడు.
అనంతరం ఆయన మరో జిల్లాకు ఎస్పీగా బదిలీ అయ్యాడు. ఏళ్లు గడుస్తున్నా రుణం తీసుకున్న వ్యక్తి డబ్బు చెల్లించకపోవడంతో జిల్లాలో తనకు సన్నిహితుడైన ఓ సీఐ స్థాయి అధికారి సాయంతో ఇద్దరు కానిస్టేబుళ్లను బాకీ వసూలుకు టాటా సుమో వాహనంలో పంపినట్లు తెలిసింది. వారుఅప్పు తీసుకున్న వ్యక్తిని బలవంతంగా జిల్లాకు తీసుకువచ్చేందుకు ప్రయత్నించి, అక్కడి పోలీసులకు పట్టుబడ్డారు.
అనంతరం జిల్లాకు తిరిగి వచ్చిన కానిస్టేబుళ్లు ఈ విషయంలో తమ తప్పేమీ లేదని ఎస్పీ సెంథిల్ కుమార్ వద్ద విన్నవించినట్లు సమాచారం. కాగా, కానిస్టేబుళ్లను క్షమించాలంటూ, రుణాల వసూలుకు వారిని నియోగించిన అధికారి సూచనను ఎస్పీ నిరాకరించినట్లు సమాచారం.