కొత్తపేట(గుంటూరు): హైకోర్టు ఆదేశాల మేరకు.. రాష్ర్ట వ్యాప్తంగా ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేసుకునే విధానాన్ని నిలిపివేస్తూ ఆ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఐజీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయినట్టు గుంటూరు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ బి.సూర్యనారాయణ తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 4న రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా రిజిస్ట్రేషన్ (ఎనీవేర్) చేసుకునే సౌలభ్యం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 21న ఇది అమల్లోకి వచ్చింది. దీనిపై కృష్ణా జిల్లా మచిలీపట్టణానికి చెందిన పి.దేవేందర్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు.. సోమవారం స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఈ విధానాన్ని తాత్కాలికంగా నిలుపదల చేస్తూ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.