సాక్షి ప్రతినిధి, విజయనగరం:
ఏఓబీ (ఆంధ్రా ఒడిశా బోర్డర్)లో మావోయిస్టుల అలజడి రేగుతోంది. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఉనికి చాటుకోవాలని వారు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసుల వ్యూహాలకు ప్రతీకారేచ్ఛగా పథక రచన చేస్తున్నట్లు సమాచారం. ఎన్నికలు బహిష్కరించాలన్న పిలుపుతో చెలరేగడానికి సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా నాయకులను టార్గెట్ చేసి దాడులకు దిగే యత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పార్వతీ పురం పరిసర ఏఓబీ ప్రాంతంలో సుమారు 150 మంది వరకు యాక్షన్ టీమ్ సంచరిస్తున్నట్లు సమాచారం. ఈ టీమ్‌లోని కొంతమంది సభ్యులు పార్వతీపురం టౌన్ రైల్వేస్టేషన్‌తో పాటు పట్టణంలోని మరికొన్ని ప్రాంతాలపై కూడా రెక్కీ నిర్వహించినట్లు తెలిసింది.
ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతంలో పోలీసులు జల్లెడ పట్టడంతో అక్కడున్న దళాలు ఏఓబీని షెల్టర్ జోన్‌గా తీసుకుని వలస లొస్తున్నట్టు తెలుస్తోంది. అటు ఒడిశా, ఇటు ఆంధ్రపదేశ్‌లో ఏకకాలంలో ఎన్నికలు జరగనుం డడంతో పోలీసుల దృష్టి మళ్లుతుందని, బలం పెంచుకు ని దాడులకు దిగొచ్చని మావోయిస్టులు యోచిస్తున్నట్టు భోగట్టా. పార్వతీపురంలో రెక్కీ అనంతరం రాయగడ వెళ్లే రైలులో గుమడరైల్వే స్టేషన్ దాటి కొంత దూరం వెళ్లాక రైలు అనుకోకుండా ఆగినప్పుడు దిగి కొమరాడ మండలంలోని కొండలవైపు వెళ్లినట్లు సమాచారం. ఈ నెలాఖరున జరగనున్న మున్సిపల్, తర్వాత జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునేందుకే ఈ రెక్కీ నిర్వహించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పట్టణంలో ఏదైనా భారీ విధ్వంసానికి పాల్పడనున్నారా...? ఎన్నికల వేళ టార్గెట్‌లో ఉన్న రాజకీయ నాయకులపై దాడులకు దిగనున్నారా...? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మావోయిస్టుల అడ్డాగా పిలవబడే ఏఓబీకి పార్వతీపురం కూతవేటు దూరంలో ఉండడంతో మావోయిస్టుల కార్యకలాపాలకు పట్టణం అనువుగా ఉండే అవకాశాలున్నాయి. అంతే కాకుండా పార్వతీపురం పరిసరాలు, కొమరాడ మండలంలోని గుమడ, కూనేరు రైల్వే స్టేషన్లలో గతంలో పలు సంఘటనలకు పాల్పడ్డారు. అలాగే 2002లో పట్టణ నడిబొడ్డున ఉన్న పార్వతీపురం టౌన్ ఠాణాను రాత్రి 7 గంటల ప్రాంతంలోనే పేల్చివేశారు. ఈ నేపథ్యంలో మావోయిస్టులు మళ్లీ అటువంటి సంఘటనలకేమైనా పాల్పడే అవకాశాలున్నాయా...? అనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రలో బలమైన పట్టుకోసం కేడర్‌ను పెంపొందించుకునే చర్యలు ప్రారంభించి నట్లు తెలుస్తోంది.
ఏఓబీలో అలజడి?
Published Fri, Mar 7 2014 3:15 AM | Last Updated on Thu, Mar 28 2019 5:07 PM
Advertisement