ప్రతిపక్షాల నిరసన.. సభ వాయిదా
బీసీ సంక్షేమం మీద చర్చకు వైఎస్ఆర్‌సీపీ పట్టుబట్టింది. ఈ అంశంపై ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడేందుకు ప్రయత్నిస్తుండగా ఒక్క మాట మాట్లాడగానే.. స్పీకర్ మైక్ కట్ చేశారు. ఇప్పటికే ఆ ప్రశ్న ముగిసిపోయి మరో ప్రశ్నలోకి వెళ్లిపోయామని, అందువల్ల దానిపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేమని అన్నారు.
అయితే.. బీసీ సంక్షేమం మీద తాము వాకౌట్ చేయాలనుకుంటున్నామని, అందువల్ల ఆ విషయమై తాము చెప్పదలచుకున్న వివరణ చెప్పి వాకౌట్ చేస్తామని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంత అడిగినా పట్టించుకోలేదు. దాంతో వైఎస్ఆర్‌సీపీ సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. జగన్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష సభ్యులు తీవ్రంగా నినాదాలు చేస్తుండగానే ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ఏదో మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే గందరగోళం నడుమ ఎవరికీ ఏమీ వినిపించలేదు. దాంతో స్పీకర్ కోడెల శివప్రసాదరావు సభను పది నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.