'లాకర్లలో నల్లధనం తీస్తేనే ఉపయోగం'
- ఏపీ బీజేపీ అభివృద్ది కమిటీ చైర్మన్
అమరావతి : బ్యాంకు లాకర్లలో ఉండేందంతా నల్లధనమేనని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ది కమిటీ చైర్మన్ యడ్లపాటి రఘునాథ్‌బాబు చెప్పారు. లాకర్లలో దాచుకున్న సొత్తును బ్యాంకు ఖాతాల్లోకి తీసుకొచ్చినప్పుడే సాధారణ ప్రజలకు ప్రయోజనం కలుగుతుందన్నారు.
విజయవాడలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలో నగదు రహిత సేవలు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరముందన్నారు. నల్లధనం అరికట్టేందుకు మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు దేశ చరిత్రలో గొప్ప ఆర్ధిక సంస్కరణగా నిలిచిపోతాయని చెప్పారు. భవిష్యత్‌లో పెద్ద నోట్ల రద్దు ఫలితాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత నరేంద్రమోదీని మహనీయుడిగా కొనియాడే పరిస్థితి ఏర్పడుతుందని రఘునాథ్బాబు జోస్యం చెప్పారు.