ఫేస్‌బుక్ ప్రేమ.. పోలీస్ స్టేషన్‌కు జంట
ఫేస్‌బుక్ ప్రేమ.. పోలీస్ స్టేషన్‌కు జంట
Published Sat, Mar 11 2017 9:31 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM
నెల్లూరు: ప్రేమకు హద్దులు, సరిహద్దులు అడ్డురావు. మనసులు కలిస్తే జాతి, కులాలు సమస్యే లేదు. ఇందుకు తాజా ఉదాహరణ మహరాష్ట్ర అమ్మాయి, ఆంధ్ర అబ్బాయి ప్రేమ అనే ప్రపంచంలోకి ఫేస్‌బుక్‌లో ముచ్చటలాడి పరిణయమాడాలని నిర్ణయించుకున్నారు. తమ ఆలోచనలను ఆచరణలో పెట్టేందుకు ఈ ప్రేమ పక్షులు రక్షణ కోసం పోలీసుల అభయం కోరారు. సీతారామపురం మండలం పండ్రంగి గ్రామానికి చెందిన సింగల నాగార్జున బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ వేటలో నంద్యాలలోని ఓ ప్రవేటు బ్యాంకు కోచింగ్ కేంద్రంలో శిక్షణ నిమిత్తం చేరాడు.
ఈ క్రమంలో ఫేస్‌బుక్, వాట్సప్ గ్రూపులో మహరాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన పూజా చౌహన్(23) నాగార్జునకు పరిచయం అయ్యింది.
పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. గత మూడు నెలలు ఇద్దరు ప్రేమలో మునిగితేలుతున్నారు. ప్రేమాయణం గురించి అమ్మాయి తల్లిదండ్రులకు తెలియడంతో మూడు రోజుల క్రితం తీవ్రంగా మందలించారు. దీంతో పూజా, నాగార్జునకు తన స్నేహితురాలి ఫోన్ నుంచి కాల్ చేసి తాను హైదరాబాద్ వస్తున్నట్లు తెలిపింది. శుక్రవారం ప్రేయసిని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో కలుసుకున్న నాగార్జున ఆమెను తీసుకుని నెల్లూరు ఎస్పీ వద్దకు వెళ్లి విషయం తెలిపారు.
పూజా ఇంటి నుంచి వచ్చేసిన విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు నాగార్జున ఫోన్ సిగ్నల్స్‌ను అనుసరించి శుక్రవారం పండ్రంగి గ్రామానికి చేరుకున్నారు. విషయంపై సీఐ రమణతో మాట్లాడిన ఎస్పీ.. ప్రేమికులకు కౌన్సిలింగ్ ఇచ్చి, తల్లిదండ్రులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. శుక్రవారం రాత్రి ప్రేమికులకు, వారి తల్లిదండ్రులకు సీఐ రమణ కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత కూడా పూజ, నాగార్జుననే వివాహం చేసుకుంటానని లిఖితపూర్వకంగా తెలియజేయడంతో ఇరువురి పెళ్లికి అంగీకరించారు. ఉన్నత కుటుంబానికి చెందిన పూజ తల్లిదండ్రులు మహారాష్ట్రలోని రాజకీయ, ఉన్నత వ్యక్తుల సహకారంతో ఆమెను సొంత రాష్ట్రానికి తీసుకెళ్లే ప్రయత్నాలు జరిగాయి.
Advertisement
Advertisement