ఏప్రిల్ 2న ఏపీ కేబినెట్ విస్తరణ
అమరావతి: ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం ఖరారైంది. ఏప్రిల్ 2వ తేదీ ఉదయం 9 గంటల 25 నిమిషాలకు ముహుర్తం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అమరావతి సచివాలయం ప్రాంగణంలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్సీగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేసిన నారా లోకేశ్‌కు కేబినెట్‌లో చోటు దక్కనుంది.
కాగా నారా లోకేశ్ కేబినెట్‌లోకి రావాలని ఎంతో కాలంగా ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా చంద్రబాబు ముహూర్తం ఖరారు చేశారు. లోకేశ్‌కు ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ కేటాయించినట్లు తెలుస్తోంది. ఉగాది పర్వదినం రోజున విస్తరణ చేపట్టాలని చంద్రబాబు భావించారు. అయితే సాంకేతిక కారణాలతో ఆ ముహూర్తాన్ని వాయిదా వేసుకున్నారు. కాగా ప్రస్తుత మంత్రుల్లో ఐదుగురికి ఉద్వాసన తప్పదనే సంకేతాలు అందుతున్నాయి. ప్రస్తుతం మంత్రివర్గం 20 మంది ఉండగా,ఆ సంఖ్యను 26 వరకూ పెంచుకునే అవకాశం ఉంది. అలాగే ప్రస్తుత మంత్రుల శాఖల్లో మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
చదవండి....ఐదుగురు మంత్రులు అవుట్!
ఇక కేబినెట్‌లో మార్పులు చేర్పులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విస్తృతంగా కసరత్తు చేశారు. అయితే మంత్రి పదవి ఇవ్వాలని ఉన్నా, వివిధ సమీకరణాల నేపథ్యంలో చోటు కల్పించలేని ఎమ్మెల్సీలకు శాసనమండలి ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ వంటి పదవుల్లో అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రెడ్డి సుబ్రహ్మణ్యం ఇవాళ ఏపీ మండలి డిప్యూటీ చైర్మన్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు.