ఏపీ కేబినెట్ విస్తరణకు ముహూర్తం
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణను చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయానికి వచ్చారు. ఆయన కుమారుడు, ఇటీవలే ఎమ్మెల్సీగా ఎన్నికైన నారా లోకేశ్ కేబినెట్‌లోకి రావాలని ఎంతో కాలంగా ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా చంద్రబాబు ముహూర్తం ఖరారు చేశారు. ఉగాది పర్వదినం రోజున విస్తరణ చేపట్టాలని చంద్రబాబు భావించారు. అయితే సాంకేతిక కారణాలతో ఆ ముహూర్తాన్ని వాయిదా వేసుకున్నారు.
ఎమ్మెల్యే కోటాలో లోకేశ్ ఎమ్మెల్సీగా ఇటీవలే ఎన్నికయ్యారు. అయితే ఆయన ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు. ప్రస్తుతం పదవీ విరమణ చేయాల్సిన ఎమ్మెల్సీల పదవీ కాలం మార్చి 29 వరకు ఉంది. అంటే వారంతా అప్పటివరకు ఎమ్మెల్సీలుగానే కొనసాగుతారు. వారి పదవీకాలం పూర్తయిన తర్వాత మాత్రమే లోకేశ్, ఆయనతో పాటు ఎన్నికైన మిగతా సభ్యులు ఎమ్మెల్సీలవుతారు. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయకున్నా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కూడా ఉంది. అయితే, ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆ సమావేశాలు ముగిసిన తర్వాత చేయడం మంచిదన్న అభిప్రాయానికి చంద్రబాబు రావడంతో ఉగాది మూహూర్తం వాయిదా పడినట్టు సన్నిహిత వర్గాలు చెప్పాయి.
చదవండి: ఐదుగురు మంత్రులు అవుట్!
తెలంగాణలో కేటీఆర్ మంత్రిగా ఉంటూ ఇమేజి పెంచుకున్నారని, తనను కూడా కేబినెట్‌లో చేర్చుకోవాలని లోకేశ్ ఎప్పటినుంచో పట్టుబడుతున్నారు. ఇప్పుడు అదే తరహాలో లోకేశ్‌కు మంచి పదవి కట్టబెట్టాలన్న నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 వరకు కొనసాగనున్నాయి. 28వ తేదీన అప్రాప్రియేషన్ బిల్లును ఆమోదించాలని నిర్ణయించారు. ఆ మర్నాడు 29న ఉగాది పండుగ రోజున అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. అదే రోజుతో పలువురు ఎమ్మెల్సీల పదవీ కాలం ముగుస్తోంది. ఆ మర్నాడు లోకేశ్‌తో పాటు మరికొంతమంది కొత్త ఎమ్మెల్సీలు పదవీ స్వీకార ప్రమాణం చేయనున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక రోజు (చివరి రోజున) పాటు శాసనమండలి సమావేశాల్లో లోకేశ్ పాల్గొన్న అనంతరం ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడుతాయి.
అనంతరం ఏప్రిల్ 6వ తేదీన నిర్ణయించుకున్న ముహూర్తం ప్రకారం లోకేశ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. లోకేశ్‌తో పాటు మరి కొంతమందిని కొత్తగా కేబినెట్‌లోకి చేర్చుకోనుండగా, కొంత మందికి ఉద్వాసన తప్పదని తెలుస్తోంది. మొత్తంమీద లోకేశ్ కోరికను ఏప్రిల్ ఆరో తేదీన చంద్రబాబు పూర్తి చేయనున్నారు.