లోకేశ్ చేరికతో ఎవరికి ‘స్పాట్’ | AP CM Chandrababu's son lokesh interested in Industries portfolio | Sakshi
Sakshi News home page

లోకేశ్ చేరికతో ఎవరికి ‘స్పాట్’

Published Fri, Mar 3 2017 4:45 PM | Last Updated on Wed, Aug 29 2018 3:37 PM

లోకేశ్ చేరికతో ఎవరికి ‘స్పాట్’ - Sakshi

లోకేశ్ చేరికతో ఎవరికి ‘స్పాట్’

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేశ్ మంత్రివర్గంలో చేరడం ఖాయమైంది. అయితే అందుకు ముహూర్తం ఎప్పుడన్నది ఇంకా ఖరారు కాలేదు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా లోకేశ్ సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభమయ్యే శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో తొలిసారిగా లోకేశ్ శాసనమండలిలో అడుగుపెడుతున్నారు. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల అనంతరం మంత్రివర్గాన్ని విస్తరించాలన్న ఆలోచనతో చంద్రబాబు నాయుడు ఉన్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

వచ్చే జూన్ నాటికి ప్రభుత్వం ఏర్పాటు చేసి మూడేళ్ల కాలం పూర్తవుతుండగా, మరో ఏడాదిలో ఎన్నికలకు సిద్ధం కావలసి ఉంటుంది. ఈ తరుణంలో కొంతమందిని కేబినేట్ నుంచి తప్పించాలన్న ఆలోచనలో కూడా చంద్రబాబు ఉన్నారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన వెంటనే మంత్రిమండలిలోకి తీసుకోవాలని చంద్రబాబు భావించారు. అయితే తప్పుడు సంకేతాలు వెళుతాయన్న ఉద్దేశంతో మంత్రివర్గ విస్తరణ సందర్భంలోనే లోకేశ్ ను మంత్రిని చేయాలన్న అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. లోకేశ్ మంత్రివర్గంలోకి వస్తున్న తరుణంలో తమ శాఖల్లో కోతలు పడతాయని కొందరు మంత్రుల్లో ఆందోళన మొదలైంది.

మౌలిక సదుపాయాకల్పన, పరిశ్రమలు-వాణిజ్యం, సినిమాటోగ్రఫీ, న్యాయశాఖ, టూరిజం వంటి శాఖలన్నీ ప్రస్తుతం ముఖ్యమంత్రి వద్దే ఉన్నాయి. పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన, పరిశ్రమల శాఖలను లోకేశ్ కోరుతున్నారు. ఒకవేళ ఆ శాఖలను లోకేశ్ కు కేటాయిస్తే మంత్రివర్గ విస్తరణలో భారీ మార్పులేమీ ఉండకపోవచ్చని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో కేసీఆర్ కుమారుడు కేటీఆర్ తరహాలోనే మున్సిపల్ వ్యవహారాల శాఖ కావాలనుకుంటే మంత్రి నారాయణ శాఖలో కోతలు పెట్టడం ఖాయం. అలా కాని పక్షంలో మరో కీలకమైన మానవ వనరుల శాఖ కావాలనుకుంటే గంటా శ్రీనివాసరావు శాఖల్లో కోతలు పెట్టాలి.

పరిశ్రమల శాఖతో పాటు ఇన్ఫర్ మేషన్ టెక్నాలజీ, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖలు మాత్రం తప్పనిసరిగా తనకు ఉండాలని లోకేశ్ కోరుతున్నారని సమాచారం. ఐటీ శాఖ కారణంగానే తెలంగాణలో కేటీఆర్ ఇమేజీ పెంచుకుంటున్నారని, ఆ కారణంగానే లోకేశ్ సైతం పరిశ్రమలతో పాటు ఐటీ శాఖను అప్పగించాలని పట్టుబడుతున్నారు. ప్రస్తుతం ఐటీ శాఖ పల్లె రఘునాధరెడ్డి నిర్వహిస్తున్నారు. మంత్రులు కొందరి శాఖలను మార్చడం, మరికొందరికి ఉద్వాసన పలకడానికి సంబంధించి గత ఆరు నెలలుగా కసరత్తు జరుగుతోంది. దానికి తగినట్టుగానే గత కొంతకాలంగా తొలగించాలని భావిస్తున్న మంత్రుల నెలవారీ నివేదికల్లో తక్కువ మార్కులు కూడా ఇచ్చారని విశ్వసనీయ సమాచారం.

ఏదిఏమైనప్పటికీ, ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యే వరకు మంత్రివర్గాన్ని విస్తరించకపోవడం మంచిదని, కుమారుడు లోకేశ్ కోసం విస్తరణ చేపట్టారన్న విమర్శల నుంచి తప్పించుకోవడానికి, ఎమ్మెల్సీగా ఎన్నికైన రోజు నుంచి లోకేశ్ బ్రహ్మాండంగా పనిచేస్తున్నారంటూ నేతల ద్వారా కితాబు ఇప్పించే కార్యక్రమం కొంతకాలం చేపట్టి ఆ తర్వాత మంత్రిపదవి అప్పగిస్తారన్న మాట పార్టీలో బలంగా వినిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement