వైఎస్ జగన్ను కలిసిన రాజధాని ప్రాంత రైతులు
గుంటూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సోమవారం ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత గ్రామాల రైతులు కలిశారు. రాజధాని గ్రామాల్లో పోలీసుల దుశ్చర్య, వేధింపులపై రైతులు ఈ సందర్భంగా వైఎస్ జగన్ దృష్టికి తీసుకు వచ్చారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రాజధాని ప్రాంత రైతులు...వైఎస్ జగన్ను కలిసి ఫిర్యాదు చేశారు. తమ పంటను తామే తగలపెట్టించామని పోలీసులు వేధింపులకు దిగుతున్నారని, రైతులు తమ ఆవేదన వెలిబుచ్చారు.
కాగా గత నెల 29వ తేదీన రాజధాని ప్రాంతంలో జరిగిన దహన కాండను సాకుగా చూపి భూసమీకరణకు వ్యతిరేకంగా ఉన్న రైతులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుంది. ఇందులో భాగంగా అమాయకులైన 25 మంది కార్యకర్తలను పోలీసులు ఆదుపులోకి తీసుకుని మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరు పోలీస్‌స్టేషన్లలో నిర్బంధించి నానా హింసలు పెట్టారు.
రాజధాని ప్రాంతంలోని ఆరు గ్రామాల్లో 13 చోట్ల దుండగులు దహనకాండ చేపట్టారు. అది తామే చేశామంటూ ఒప్పుకోవాల్సిందిగా నిర్బంధంలో ఉన్నవారిని పోలీసులు బలవంతపెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాంతో పోలీసుల చర్యలతో మంగళగిరి, తాడేపల్లికి చెందిన గ్రామాల రైతులు హడలి పోతున్నారు.