'పోలీసులు అరేయ్..ఒరేయ్ అంటున్నారు'
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో ఒకటైన పెనుమాక గ్రామం ప్రస్తుతం కశ్మీర్లోని ఉద్రిక్తతను తలపిస్తోందని నరేష్ రెడ్డి అనే రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. తన పేరు నరేష్ అని చెప్పగానే...పోలీసులు తన ఫోన్ నెంబర్ చెబుతుంటే ఆశ్చర్యపోవటం తనవంతైందన్నారు.
పోలీస్స్టేషన్లకు తాము ఎందుకు వెళ్లాలని, పొలాలు పోతే తామేమీ తినాలి, ఎట్లా బతకాలని ఆయన ప్రశ్నించారు. రాజధాని గ్రామాల్లో పోలీసుల దుశ్చర్య, వేధింపులపై రాజధాని ప్రాంత గ్రామాల రైతులు సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా వారు తమ సమస్యలను వైఎస్ జగన్ దృష్టికి తీసుకు వచ్చారు.
గ్రామాల్లో పోలీసుల కవాతులు ఎందుకు?...మనశ్శాంతి కరువై, భయంభయంగా బతుకుతున్నామని మహిళా రైతులు కన్నీటిపర్యంతమయ్యారు. భూములు ఇవ్వకుంటే పట్టుకుపోతామని పోలీసులు బెదిరిస్తున్నారన్నారు. మేమిస్తున్నాం... మీరెందుకు ఇవ్వరని టీడీపీ నేతలు ఒత్తిడి తెస్తున్నారని రైతులు తెలిపారు. పోలీసులు తమకు కనీసం గౌరవం కూడా ఇవ్వడం లేదని , అరేయ్...ఒరేయ్ అని పిలుస్తూ వేధిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక ఎకరంతో పదిమంది బతుకుతున్నామని, ఉన్న ఎకరం తీసుకుంటే తమ పిల్లల భవిష్యత్ ఏంటని రైతులు ప్రశ్నించారు. భూములు ఇవ్వకుంటే కొట్టేట్టుగా ఉన్నారని, తమ అనుమతి లేకుండా భూములను గ్రీన్ బెల్ట్గా ఎలా ప్రకటిస్తారన్నారు. రూ.3 కోట్లు విలువైన భూములను రూ.కోటికి ఎవరైనా ఇస్తారా అన్నారు. తమ కోసం ఏదో చేస్తున్నానని చంద్రబాబు చెప్పుకుంటున్నారని రైతులు మండిపడ్డారు.